ఆట మొదలైంది
ఎన్నికల షెడ్యూల్ విడుదల
అమలులోకి ఎన్నికల కోడ్
ఏర్పాట్లలో అధికారులు
సమరానికి నేతలు సన్నద్ధం
మే 16న ఓటరు తీర్పు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొదలైంది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 30న పోలింగ్ జరగనుంది. రాజకీయ నేతల గెలుపోటములు మే16న వెల్లడి కానున్నాయి. బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. గత కోడ్ అమలు విషయంలో రాష్ట్రంలోనే వరంగల్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. మున్సిపల్ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి రావడం గతంలో ఎప్పుడూ లేదు. ప్రస్తుతం ఈ రెండు ఎన్నికల నిర్వహణ జిల్లా యంత్రాంగానికి సవాలుగా మారింది.
జిల్లాలో 12 అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వరంగల్ లోక్‌సభ పరిధిలో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, భూపాలపల్లి, పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్(ఎస్సీ), వర్దన్నపేట(ఎస్సీ) అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. మహబూబాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో ములుగు(ఎస్టీ), నర్సంపేట, మహబూబాబాద్(ఎస్టీ), డోర్నకల్(ఎస్టీ)తో పాటు ఖమ్మం జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది.
2009 ఎన్నికల్లో వరంగల్(ఎస్సీ), మహబూబాబాద్(ఎస్టీ) ఎంపీ సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. అసెంబ్లీకి సంబంధించి... కాంగ్రెస్ 7, టీడీపీ 4, టీఆర్‌ఎస్ 1 సీట్లను గెలుచుకున్నాయి. తర్వాత రాజకీయ పరిస్థితులు మారాయి. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరి తిరిగి గెలుపొందారు. పరకాల ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిచింది. మూడు రోజుల క్రితం డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ టీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనంపై స్పష్టత వచ్చినా... పొత్తు విషయం తేలకపోవడంతో నేతలు పూర్తి స్థాయిలో ఎన్నికలపై దృష్టి పెట్టడం లేదు.
తెలంగాణ ఇచ్చిన ఘనతతో ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. కాంగ్రెస్‌కు సంబంధించి ఇటీవల వరంగల్‌లో నిర్వహించిన తెలంగాణ జైత్రయాత్ర ర్యాలీకి జనం నుంచి స్పందన లేకపోవడం పార్టీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జనగామ, వరంగల్ తూర్పు, భూపాలపల్లి, పరకాల, మహబూబాబాద్, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాలను గెలుచుకుంది.
కాంగ్రెస్‌లో విలీనం ఉండదని కేసీఆర్ ప్రకటించడంతో టీఆర్‌ఎస్ నేతల్లో ఊపు వచ్చింది. టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాత్రం భిన్నమైన అభిప్రాయం ఉన్నట్లు తెలుస్తోంది. 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జిల్లాలో ఆరు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. 2009లో కేవలం వరంగల్ పశ్చిమ స్థానానికి పరిమితమైంది. ప్రస్తుతం పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 4కు చేరింది.
తెలంగాణ ఏర్పాటు విషయంలో అస్పష్ట వైఖరితో టీడీపీలో ఇంకా అయోమయం నెలకొనే ఉంది. 2009 ఎన్నికల్లో పొత్తులతో పాలకుర్తి, నర్సంపేట, ములుగు, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీ గెలుచుకుంది. డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ మార్చి 3న టీఆర్‌ఎస్‌లో చేరడం ఎన్నికల ముందు పార్టీకి దెబ్బగా మారింది.
వైఎస్సాఆర్‌సీపీ సాధారణ ఎన్నికలకు సన్నద్ధమైంది. పాలకుర్తి, వరంగల్ తూర్పు, స్టేషన్ ఘన్‌పూర్, నర్సంపేట, డోర్నకల్, వర్ధన్నపేట, మహబూబాబాద్, ములుగు నియోజకవర్గాల్లో సమన్వయకర్తలు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. త్వరలో ప్రచారం ప్రారంభించనున్నారు.
గత ఎన్నికలతో పోల్చితే బీజేపీలో కొంత ఊపు కనిపిస్తోంది. నరేంద్రమోడి ప్రధాని అభ్యర్థిత్వంతో సానుకూలత వస్తున్నా.. ఇటీవల తెలంగాణపై పార్టీ వైఖరితో కొంత ఆందోళన నెలకొంది. గతంలో జిల్లాలో బీజేపీకి ప్రాతినిధ్యం ఉండేది. 2004 ఎన్నికల వరకు ఒక ఎమ్మెల్యే ఉండేవారు. తర్వాత పరిస్థితి దిగజారింది.
మహబూబాబాద్, పరకాల, భూపాలపల్లి, జనగామ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సీపీఐ ఏర్పాట్లు చేసుకుంటోంది. వరంగల్ తూర్పు, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, మహబూబాబాద్‌లో పోటీ చేసేందుకు సీపీఎం సన్నద్ధమవుతోంది. కొత్తగా ఆవిర్భవించిన మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ వర్ధన్నపేట(ఎస్సీ) నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన స్థానాల్లో ఎక్కడెక్కడ పోటీ చేయనుందనేది త్వరలో తేలనుంది.