సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న మినీ మున్సిపల్ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా వామపక్షాలు, టీడీపీతో పొత్తు కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఖమ్మం కార్పొరేషన్‌లో సీపీఎం, టీడీపీ, వరంగల్‌లో సీపీఎం, సీపీఐలతో పొత్తు కుదుర్చుకుని ఎన్నికలను ఎదుర్కొనేందుకు వీలుగా ఆయా కార్పొరేషన్ల ఇన్‌చార్జులు, స్థానిక నాయకత్వం అడుగులు వేస్తోంది. ఈ రెండు చోట్లా పొత్తుల విషయంలో పీటముడే కనిపిస్తున్నా.. మంగళవారం రాత్రి లేదా బుధవారం ఉదయం కామ్రేడ్లతో మాట్లాడి పొత్తులను ఖరారు చేసుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. ఈ రెండు కార్పొరేషన్లతో పాటు ఐదు మున్సిపాలిటీల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖరారైనా అప్పుడే బీఫామ్‌లు ఇవ్వకపోవడం ద్వారా మిగతా వారు చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. మరోవైపు టీఆర్‌ఎస్, బీజేపీల నుంచి టికెట్ ఆశించి భంగపడిన వారిని చివరి క్షణంలో బీఫామ్‌లు ఇచ్చేలా కూడా వ్యూహాలకు పదును పెడుతోంది.
అక్కడ వారు... ఇక్కడ వీరు
వరంగల్ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లకు గాను 20 డివిజన్లను వామపక్షాలకు వదులుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. అయితే సీపీఐ, సీపీఎంలు రెండూ కలిపి 24 సీట్లు అడుగుతు న్నాయి. ఇందులో సీపీఐ ఇప్పటికే ఏడు చోట్ల నామినేషన్లు దాఖలు చేయగా, మరో నాలుగింటి కోసం ఎదురుచూస్తోంది. సీపీఎం కూడా 11 స్థానాల్లో అధికారికంగా నామినేషన్లు దాఖలు చేయగా, మరో రెండింటిలో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు పార్టీల మధ్య కేవలం మూడు స్థానాల్లోనే పేచీ ఉండడం కొంత సానుకూల అంశమే అయినా కాంగ్రెస్ బలంగా ఉన్న స్థానాలు కొన్నింటిని కామ్రేడ్లు ఆశిస్తుండటం సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి లేదంటే బుధవారం ఉదయం వరంగల్‌లో పొత్తులు ఖరారు కానున్నట్టు సమాచారం. ఇక ఖమ్మంలో సీపీఐ, టీఆర్‌ఎస్‌లు పొత్తు కుదుర్చుకోవడంతో అక్కడ సీపీఎంతో పాటు టీడీపీతో కలసి ముందుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. అక్కడ 60 డివిజన్లకు గాను సీపీఎం ఇప్పటికే 20 చోట్ల నామినేషన్లు దాఖలు చేయగా, టీడీపీ పదింటిలో పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలకు కలిపి 10-15 స్థానాలు ఇవ్వాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం ఉదయానికల్లా ఈ పొత్తులను కూడా ఖరారు చేసే పనిలో పడ్డారు. అయితే టీడీపీ, సీపీఎం పార్టీలు తాము ఒంటరిగానే పోటీ చేస్తామని చెబుతుండటం గమనార్హం. ఇక నకిరేకల్, కొత్తూరు, అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల మున్సిపాలిటీల్లో కూడా స్థానిక పరిస్థితులను బట్టి వీలున్న పార్టీలు లేదా వ్యక్తులతో కలసి ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది.
ఆపరేషన్ ‘ఆకర్ష్’
ఎన్నికల వేళ పార్టీ నేతలు ఎప్పటికప్పుడు టీఆర్‌ఎస్ వేస్తున్న బుట్టలో పడుతున్న నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే బీఫామ్‌లు పార్టీ అభ్యర్థులకు కాకుండా చివరి క్షణంలో నేరుగా ఎన్నికల పరిశీలకులకే అందజేయాలని నిర్ణయించింది. తద్వారా తమ పార్టీ టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా నివారించడంతో పాటు అభ్యర్థులుగా ప్రకటించిన నేతలు అధికార పార్టీ ప్రలోభాలకు తలొగ్గి పోటీ నుంచే తప్పుకునే వీలు లేకుండా ద్విముఖ వ్యూహాన్ని అమలు పరుస్తోంది. మరోవైపు టీఆర్‌ఎస్ అసంతృప్త నేతలకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి బాగానే గాలం వేస్తోంది. ఇప్పటికే ఖమ్మంలోని నాలుగైదు చోట్ల గులాబీ నేతలను పార్టీలో చేర్చుకుని ఆయా డివిజన్లలో బలోపేతం అయ్యే ప్రయత్నాలు చేసింది. మిగిలిన స్థానాల్లో కూడా టీఆర్‌ఎస్ అసంతృప్తులకు గాలం వేసి, వీరిలో బలమైన నేతలు ఉంటే వారినే చివరి క్షణంలో అభ్యర్థులుగా ఖరారు చేయడం కూడా టీపీసీసీ వ్యూహంగా కనిపిస్తోంది.
పొత్తులు.. ఎత్తులు.. హస్తం కొత్త వ్యూహం
Published Wed, Apr 21 2021 3:13 AM | Last Updated on Wed, Apr 21 2021 4:03 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment