సాక్షి, హైదరాబాద్: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మరో ఐదు మున్సిపాలిటీలకు ఈ ఏడాది మే నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారం, అభ్యర్థి ఎంపికలో తలమునకలైన టీఆర్‌ఎస్ పార్టీ త్వరలో ఎన్నికలు జరిగే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపైనా దృష్టి కేంద్రీకరించింది. సర్వేలు, పార్టీ ఇన్‌చార్జిల నివేదికల ఆధారంగా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని ఎప్పటికపుడు సమీక్షిస్తూ ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఎన్నికల షెడ్యూలు వెలువడేలోగా ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వంటి కార్యక్రమాలు పూర్తి చేయాలని సంబంధిత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలను పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. నాగార్జునసాగర్ అభ్యర్థి ఎంపిక పూర్తయిన తర్వాత ఏప్రిల్ మొదటివారంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు సమావేశం
అవుతారు.
ఆశావహుల జాబితాపై కసరత్తు
వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట మున్సిపాలిటీ పాలకమండలి కాలపరిమితి ఈ నెల 14న ముగియడంతో ప్రత్యేక అధికారులను నియమించారు. సిద్దిపేట మున్సిపాలిటీ పాలకమండలి గడువు కూడా ఏప్రిల్ 14న ముగియనుంది. గతంలో గ్రామ పంచాయతీలుగా ఉన్న జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలుగా అవతరించాయి. ఈ మూడు గ్రామ పంచాయతీల పాలకమండళ్ల పదవీ కాలపరిమితి కూడా గత ఏడాది ముగిసింది. దీంతో రెండు కార్పొరేషన్లతో పాటు ఐదు మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన కసరత్తును మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వార్డుల పునర్విభజనతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గ ఓటర్ల సంఖ్య తేలితే ఏప్రిల్ రెండో వారంలోగా వార్డులు, మున్సిపల్ చైర్మన్ స్థానాల రిజర్వేషన్లు ఖరారు అవుతాయి. ఈ నేపథ్యంలో వార్డుల వారీగా టీఆర్‌ఎస్ టికెట్ ఆశిస్తున్న నేతలు, క్రియాశీల కార్యకర్తల జాబితాను ఇప్పటికే పార్టీ ఇన్‌చార్జిలు రూపొందించారు. ఇతర పార్టీల్లో క్రియాశీల నాయకులు, వారి బలాబలాలు, సామాజిక నేపథ్యం వంటి పూర్తి వివరాలతో నివేదికలు సిద్ధం చేశారు. సిట్టింగ్ కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పనితీరును కూడా మదింపు చేయాలని తాజాగా ఇన్‌చార్జీలను టీఆర్‌ఎస్ ఆదేశించింది.
త్వరలో కేటీఆర్ ఖమ్మం పర్యటన
ఎన్నికలు జరిగే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధుల కేటాయింపుపై టీఆర్‌ఎస్ దృష్టి సారించింది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2021–22లో వరంగల్ కార్పొరేషన్‌కు రూ.250 కోట్లు, ఖమ్మం కార్పొరేషన్‌కు రూ.150 కోట్లు ప్రత్యేక నిధులను ఎన్నికల నేపథ్యంలోనే కేటాయించినట్లు కనిపిస్తోంది. సిద్దిపేటలో రూ.45 కోట్లతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టవర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడాది డిసెంబర్‌లో శంకుస్థాపన చేశారు. తాజాగా ఖమ్మంలో రూ.36 కోట్లతో అదనపు ఐటీ టవర్‌ను నిర్మించేందుకు అనుమతులు మంజూరయ్యాయి. ఐదు మున్సిపాలిటీల ఎన్నిలకు పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసే బాధ్యతను సంబంధిత జిల్లా మంత్రులకు అప్పగిస్తారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లపై మాత్రం కేటీఆర్ స్వయంగా దృష్టి కేంద్రీకరిస్తారు. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా కేటీఆర్ ఈ నెల 31 లేదా వచ్చే నెల 2వ తేదీన ఖమ్మంలో పర్యటిస్తారు. ఏప్రిల్ రెండో వారంలో వరంగల్ నగరంలో పర్యటించే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment