సాక్షి ప్రతినిధి, కాకినాడ : సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ‘పుర సమరం’లో పట్టు సాధించేందుకు రాజకీయ పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. పదేళ్ల తరువాత జరుగుతున్న ఈ ఎన్నిక ల్లో గెలిచి మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకోవడంతో.. గత ఎన్నికల్లో జిల్లాలో మండపేట మినహా అన్ని మున్సిపాలిటీల్లో టీడీపీ చతికిలబడింది. తునిలో అయితే మొత్తం 30 వార్డుల్లోనూ వైఎస్ నాయకత్వానికి పట్టం కట్టిన ఓటర్లు.. టీడీపీ కంచుకోటను బద్దలుగొట్టారు. ఈ పరిస్థితుల్లో ఈసారి ఎలాగైనా సరే కొద్దోగొప్పో స్థానాలు సాధించి, ఉనికి చాటుకునేందుకు ఆ పార్టీ కుస్తీ పడుతోంది.
మరోపక్క రాష్ర్ట విభజన పరిణామాల నేపథ్యంలో అడ్రస్ గల్లంతై న కాంగ్రెస్ పార్టీ ఈసారి పోటీలో నామమాత్రంగానే మిగి లింది. మొత్తమ్మీద వైఎస్సార్ సీపీ, టీడీపీల మధ్యనే ప్రధానం గా పోరు సాగుతోంది. మహానేత సంక్షేమ పథకాలతో పాటు, తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆయా పట్టణాల్లో నిర్వహించిన రోడ్ షోలు కూడా తమ అభ్యర్థులకు ఘన విజయాన్ని అందిస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
రాజమండ్రి : తమ మేయర్ అభ్యర్థి రజనీ శేషసాయి ముందున్నారని మొదట్లో టీడీపీ వేసుకున్న అంచనాలు తరువాత తారుమారైపోయాయి. బీటెక్ ఎంబీఏ చేసిన మేడపాటి షర్మిలారెడ్డిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆమె మామ దివంగత సీతారామరెడ్డి రాజమండ్రిలో విస్తృతంగా చేసిన సేవా కార్యక్రమాలు, జననేత రోడ్‌షో తదితర అంశాలు తమకు సానుకూలమయ్యాయని వైఎస్సార్‌సీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు.
అమలాపురం : ఇక్కడ 30 వార్డులకు మూడు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 27 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యనే ప్రధాన పోటీ జరుగుతోంది. 3, 5, 24 వార్డుల్లో స్వతంత్రులు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. మొదట్లో టీడీపీ దూసుకుపోతోందనే అంచనాలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షోతో తలకిందులయ్యాయని నేతలు విశ్లేషిస్తున్నారు. సహజంగానే బీసీ, ఎస్సీ సామాజికవర్గాలు తమవైపు ఉండటం, వైఎస్ చేపట్టిన సంక్షేమం.. వెరసి తమకే సానుకూల పవనాలు వీస్తున్నాయని వైఎస్సార్‌సీపీ నేతలు అంటున్నారు.
మండపేట : వరుసగా మూడుసార్లు మండపేటను కైవసం చేసుకున్న టీడీపీ ఈసారి ఏటికి ఎదురీదుతోందని ఆ పార్టీ నేతలే విశ్లేషిస్తున్నారు. మండపేటలో 29 వార్డులకు ఐదో వార్డు వైఎస్సార్‌సీపీకి ఏకగ్రీవమైంది. 28 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ, టీడీపీల తరఫున సమీప బంధువులైన వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి, చుండ్రు శ్రీవరప్రకాష్ చైర్మన్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.
గత ఎన్నికల్లో మండపేటలో బలమైన సామాజివకర్గం ఓటింగ్ టీడీపీకి సానుకూలంగా ఉండేది. ఇప్పుడా ఓటింగ్ రెండుగా చీలిపోతుండటం, వరుస విజయాల పరంపరలో టీడీపీపై నెలకొన్న వ్యతిరేకత తమకు సానుకూలంగా మారుతాయని వైఎస్సార్‌సీపీ నేతలు చెబుతున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షోకు వెల్లువెత్తిన ప్రజా స్పందన కూడా తమకు కలిసొచ్చే అంశమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రామచంద్రపురం : ఇక్కడ ఒకే సామాజికవర్గానికి చెందిన అడ్డూరి జగన్నాథ వర్మ(వైఎస్సార్‌సీపీ), ఎస్‌ఆర్‌కే గోపాలబాబు (టీడీపీ) చైర్మన్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. జగన్నాథవర్మ ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త కావడం, వివాదరహితుడనే పేరుండడం వైఎస్సార్‌సీపీకి కలిసొచ్చే అంశంగా మారింది. టీడీపీ చైర్మన్ అభ్యర్థి గోపాలబాబు, ఆయన భార్య విజయాదేవి గతంలో మున్సిపల్ చైర్మన్లుగా పని చేశారు. మరోపక్క సిటింగ్ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీలోకి వలస రావడంతో వ్యతిరేకత వచ్చింది. ఇది టీడీపీకి ప్రతికూల అంశంగా మారుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
సామర్లకోట : ఇక్కడ 30 వార్డులకు వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యనే పోటీ జరుగుతోంది. ఇదివరకు మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ఉన్న గోలి దొరబాబు ఈసారి వైఎస్సార్‌సీపీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయనపై గత కౌన్సిల్‌లో ప్రతిపక్ష నాయకుడైన మన్యం చంద్రరావు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. రెండుసార్లు వైస్ చైర్మన్‌గా సేవలు అందించడం, భార్య వెంకటలక్ష్మికి చైర్‌పర్సన్‌గా పని చేసిన అనుభవం ఉండడం, గోదావరి నీటిని అందరికీ అందించడం తమకు సానుకూలంగా ఉంటుందని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దొరబాబు చెబుతున్నారు.
పెద్దాపురం : ఈ పట్టణంలోని 28 వార్డులకు వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. మహానేత వైఎస్ హయాంలో పట్టణానికి గోదావరి నీటిని అందించడం తమ అభ్యర్థులకు కలిసి వచ్చే అంశమవుతుందని వైఎస్సార్‌సీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
పిఠాపురం : పట్టణంలో 30 వార్డులున్నాయి. గండేపల్లి రామారావు(బాబి) వైఎస్సార్‌సీపీ తరఫున చైర్మన్ అభ్యర్థిగా బరిలోకి నిలిచారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షో తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలు ప్రలోభాలకు పాల్పడుతున్నా పట్టు సాధిస్తామని ఆ వైఎస్సార్‌సీపీ నేతలు చెబుతున్నారు. అంతర్గత విభేదాలతో ఇక్కడ టీడీపీ తన అభ్యర్థిని ప్రకటించలేని దుస్థితిని ఎదుర్కొంటోంది.
తుని : పేరుకు త్రిముఖ పోరు అయినా ప్రధాన పోటీ వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యనే సాగనుంది. వైఎస్సార్‌సీపీ నుంచి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కుసుమంచి శోభారాణి, గత ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి ఇనుగంటి సత్యనారాయణ మధ్య పోటీ నెలకొంది. వైఎస్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన రోడ్‌షో, అసెంబ్లీ అభ్యర్థి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వైఎస్సార్ జనభేరి సూపర్‌సక్సెస్ అవడం సానుకూల అంశాలు కానున్నాయని శోభారాణి, ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి ఈసారి సానుభూతిగా కలిసివస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది.
గొల్లప్రోలు : వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థిగా తెడ్లపు చిన్నారావు బరిలోకి దిగారు. వ్యక్తిగతంగా ఉన్న మంచిపేరుకు ఇతర సానుకూల అంశాలు కూడా ఇక్కడ ఆ పార్టీ విజయావకాశాలను మెరుగుపరుస్తున్నాయి. టీడీపీ చైర్మన్ అభ్యర్థిని ప్రకటించలేని దుస్థితిని ఎదుర్కొంటోంది.
ఏలేశ్వరం : ఇక్కడి 20 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ, కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి. ప్రధాన పోటీ వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యనే జరుగుతోంది. బలమైన నాయకత్వం, కేడర్‌లో నూతనోత్తేజాన్ని నింపిన జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షో వైఎస్సార్‌సీపీకి సానుకూల అంశాలుగా ఉన్నాయి.
ముమ్మిడివరం : ఇక్కడ మూడు వార్డులు ఏకగ్రీవమవగా 17 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. తమకు అంతా సానుకూలంగా ఉందని టీడీపీ తొలుత వేసుకున్న అంచనాలు జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనతో తలకిందులయ్యాయి. జనభేరి సభకు ప్రజలు పోటెత్తడం, అదే సభలో శెట్టిబలిజ సామాజివకర్గం నుంచి గుత్తుల సాయిని అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించడంతో టీడీపీ పరిస్థితి తారుమారైంది. ప్రస్తుతం ఇక్కడ ఫ్యాన్ గాలి జోరుగా వీస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బస్తీలో కుస్తీ..
Published Sun, Mar 30 2014 12:21 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM
Advertisement
Advertisement