వైఎస్‌ఆర్ గంగా హారతి కార్యక్రమ వేదికపై వైఎస్‌ఆర్‌సీపీ నేతలు
‘రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదే. ఆయన చేపట్టిన ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు లష్కర్‌లా గేట్లు ఎత్తుతూ తానే పూర్తి చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం దగాకోరుతనానికి నిదర్శనం. ఈ విషయంలో టీడీపీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవ’ని వైఎస్సార్‌సీపీ నేతలు హెచ్చరించారు. మంగళవారం శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం సిద్ధాపురం ఎత్తిపోతల పథకం వద్ద వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఆ నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ‘వైఎస్సార్ గంగాహారతి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 1,200 మంది మహిళలతో గంగమ్మకు బోనాలు సమర్పించారు. అనంతరం జరిగిన సభలో పార్టీ నేతలు మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ముందుగా వారికి వారు శుద్ధి చేసుకోవాలని హితవు చెప్పారు. వారికి దమ్మూ ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీ తరఫున గొలుపొందాలని సూచించారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలను వైఎస్సార్‌సీపీ
కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు)/ఆత్మకూరు:
కరువు కోరల్లో చిక్కుకున్న రైతన్నలను ఆదుకునే లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్ట్‌లను నిర్మించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి దక్కుతుందని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఉద్ఘాటించారు. మంగళవారం ఆత్మకూరు మండలం సిద్ధాపురం ఎత్తి పోతల పథకం దగ్గర నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ గంగాహారతి కార్యక్రమం పండుగలా సాగింది. గంగమ్మకు పూజలు చేసి.. మహానేతను మనసారా స్మరించుకుంటూ.. రైతు సంక్షేమాన్ని విస్మరించిన అధికార పార్టీ పాలకులను తూర్పారబట్టారు.
తరలివచ్చిన నేతలు
వైఎస్‌ఆర్ గంగా హారతి కార్యక్రమానికి జిల్లా నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. సిద్ధాపురం చెరువు ప్రాంతం జనసంద్రంగా మారింది. ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఎమ్మిగనూరు, కోడుమూరు ఇన్‌చార్జీలు ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి, మురళీకృష్ణా, నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి, శిల్పా కార్తీక్‌రెడ్డి, డాక్టర్ మధు సూదన్, ప్రదీప్‌రెడ్డి, తోట వెంకటకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఉదయభాస్కర్, రాజా విష్ణువర్ధన్‌రెడ్డి, తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, సీహెచ్ మద్దయ్య, నాగరాజుయాదవ్, వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, పోలూరు భాస్కరరెడ్డి, చెరకుచెర్ల రఘురామయ్య, ఆయుష్మాన్ హాస్పిటల్ అధినేత సంజీవరావు, కరుణాకరరెడ్డి, పర్ల శ్రీధర్‌రెడ్డి, పీపీ నాగిరెడ్డి, పీపీ మధుసూదన్‌రెడ్డి, జాకీర్, హబీబుల్లా, ఇషాక్, మల్కిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పలుచని బాలిరెడ్డి, ధనుంజయాచారి, డీకే రాజశేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment