‘టీడీపీలోకి వెళ్లినా ఇంట్లో వైఎస్‌ఆర్ ఫోటోనే’
కర్నూలు: వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన రాజకీయ గురువు అని, తాను టీడీపీలోకి వెళ్లినా ఇంట్లో ఉన్నా ఫోటో వైఎస్‌ఆర్‌దేనని మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారమిక్కడ ‘సాక్షి’తో మాట్లాడుతూ వైఎస్‌ఆర్ సీపీ సిద్ధాంతాలు, జగన్ పనితీరు తనను ఆకర్షించాయన్నారు. టీడీపీలో ఉండటం వల్ల కార్యకర్తలు నలిగిపోయారని, నంద్యాల టీడీపీలో మూడు గ్రూపులయ్యాయని శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. తమ కార్యకర్తలపై చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, పార్టీని వీడాలని కార్యకర్తలంతా తనపై ఒత్తిడి తెచ్చారన్నారు.
నిరంతరం ఘర్షణ వాతావరణం మంచిదికాదనే భావన వ్యక్తం చేశారని, భూమా నాగిరెడ్డి టీడీపీలోకి వచ్చాక విభేదాలు మరింత పెరిగాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా తన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. కార్యకర్తల నిర్ణయం మేరకే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు శిల్పా మోహన్ రెడ్డి స్పష‍్టం చేశారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. పార్టీ మారినవారు గెలిచే పరిస్థితి కనిపించడం లేదన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనే కాదని, ప్రజల వ్యతిరేకతను చవిచూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తాను అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్లడం లేదని, పవర్ పాలిటిక్స్‌కు తాను చాలా దూరమని శిల్పా మోహన్ రెడ్డి పేర్కొన్నారు.