హైడ్రామా
♦ ఉప ఎన్నికలో గెలవలేమని టీడీపీ కుయుక్తులు
♦ శిల్పా నామినేషన్ చెల్లదంటూ ఆర్‌వోకు ఫిర్యాదు
♦ మధ్యాహ్నం నుంచి ఉత్కంఠ
♦ సాయంత్రం శిల్పా నామినేషన్‌కు ఆర్‌వో ఆమోదం
♦ సంబరాలు చేసుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
నంద్యాల : ఉప ఎన్నికలో గెలవలేమనే భయంతో అధికార పార్టీ నాయకులు కుయుక్తులు పన్నుతూనే ఉన్నారు. చివరకు నామినేషన్ల విషయంలోనూ ఇదే తరహాలో వ్యవహరించి అభాసుపాలయ్యారు. నాయకులను కొనుగోలు చేయడం, సోదాల పేరుతో పోలీసుల ద్వారా కౌన్సిలర్లను బెదిరించడం, ప్రచారాలను అడ్డుకోవడం.. ఇలా ఎన్ని చేష్టలు చేస్తున్నా టీడీపీ నేతలను మాత్రం ఓటమి భయం వీడడం లేదు. దీంతో చివరి ప్రయత్నంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్‌ను
తిరస్కరింపజేసేందుకు విఫలయత్నం చేశారు. సోమవారం నంద్యాల ఆర్టీఓ కార్యాలయంలో అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు. శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్‌లో జత చేసిన అఫిడవిట్ చెల్లుబాటు కాదని టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. దాన్ని ఇచ్చిన అడ్వొకేట్ రామతులసిరెడ్డి నోటరీ కాల పరిమితి 2013లోనే ముగిసిందని, ఆ తర్వాత రెన్యూవల్ చేసుకోలేదని, అలాగే అఫిడవిట్‌ను రూ.100 బాండ్‌పై కాకుండా తెల్లపేపర్‌పై ఇచ్చారంటూ టీడీపీ తరఫు న్యాయవాది రామచంద్రారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకుల్లో ఉత్కంఠత నెలకొంది. 2014 ఎన్నికల్లోనూ రామతులసిరెడ్డి నోటరీగా సంతకం చేశారని, అప్పుడు సమ్మతించి.. ఇప్పుడెందుకు అభ్యంతరం పెడతారని వైఎస్సార్‌సీపీ నాయకులు వాదించారు. తాము ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ దాఖలు చేశామని స్పష్టం చేశారు.
టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఐటీ రిటరŠన్స్ దాఖలు చేయలేదని, కావున ఆయన నామినేషన్ తిరస్కరించాలని వైఎస్సార్‌సీపీ తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. దీంతో రిటర్నింగ్ అధికారి ఇద్దరి నామి నేషన్ల పరిశీలనకు సమయం తీసుకున్నారు. ఓ దశలో శిల్పామోహన్‌రెడ్డి నామినేషన్ తిరస్కరణకు గురైందంటూ కొన్ని ఛానెళ్లలో దుష్ప్రచారం కూడా మొదలుపెట్టారు. అయితే, రిటర్నింగ్ అధికారి ఎలాంటి ఒత్తిళ్లకూ తలొగ్గకుండా నామి నేషన్లు క్షుణ్ణంగా పరిశీలించి.. నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయంటూ స్పష్టం చేశారు. దీంతో టీడీపీ కుయుక్తులకు చెక్ పడింది. శిల్పా నామినేషన్ ఓకే కావడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.
దొంగబుద్ధులెందుకు?:
ఎన్నికల్లో గెలవలేమనే భయంతో టీడీపీ నాయకులు.. శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్‌ను తిరస్కరింపజేయాలని చూశారు. అభివృద్ధి చేశాం, గెలుస్తామని చెప్పుకుంటున్న టీడీపీ నాయకులకు ఇలాంటి దొంగ బుద్ధులెందుకు? అనవసర అభ్యంతరాలతో ప్రజలను ఉత్కంఠకు గురి చేశారు. శిల్పా నామినేషన్ ఆమోదంతో వారి కుయుక్తులకు చెక్ పడింది. వైఎస్సార్‌సీపీ భారీ మెజార్టీతో గెలవబోతుంది.
శిల్పా చక్రపాణిరెడ్డి
టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది:
ఉపఎన్నికలో ఓడిపోతామని తెలుగుదేశం పార్టీకి భయం పట్టుకుంది. అందుకే శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్‌ను తిరస్కరించాలని ఎన్నికల అధికారిపై ఒత్తిడి తెచ్చారు. అయితే ఎన్నికల అధికారి నిజాయితీగా వ్యవహరించి శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్‌ను ఖరారు చేశారు.
గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే
ధైర్యం లేక దొంగదారిన వెళ్తున్నారు:
అధికార పార్టీ నాయకులు ధైర్యంగా పోరాడలేక దొంగ దారుల్లో వెళ్తున్నారు. న్యాయవాదులతో మాట్లాడి ఎన్నికల నియమావళి ప్రకారమే మేం నామినేషన్ వేశాం. అఫిడవిట్‌లో నోటరీ సంతకం కాలపరిమితి తీరిందన్న చిన్న సాకుతో నామినేషన్ ఎత్తి వేయాలని టీడీపీ నాయకులు చూశారు. వారి ఎత్తుగడ పారలేదు. శిల్పా మోహన్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం తథ్యం.
శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి