దళితులపై టీడీపీ వివక్ష
మచిలీపట్నం టౌన్, న్యూస్‌లైన్ :
టీడీపీ నాయకులు దళితుల పట్ల వివక్ష చూపుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య(నాని) చెప్పారు.స్థానిక 27వ వార్డు టీడీపీ నాయకుడు మేడూరి సద్గుణరావు, ఆయన భార్య హైమావతిలతో పాటుదాదాపు 200 మంది టీడీపీ కార్యకర్తలు సోమవారం వైఎస్సార్ సీపీలో చేరారు. వీరందరికీ పేర్నినాని పార్టీ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
పేర్ని మాట్లాడుతూ 27వ వార్డు పరిధిలోని శారదానగర్ ప్రాంతంలో నామమాత్రంగా ఉన్న టీడీపీని సద్గుణరావు బలోపేతం చేశారన్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల్లో 27వ వార్డు పార్టీ అభ్యర్థివి నీవేనని, నామినేషన్ కు ఏర్పాట్లు చేసుకోమని చెప్పిన నాయకులు సద్గుణరావు నామినేషన్‌కు వేసేందుకు వెళ్లగా పార్టీ టిక్కెట్ వేరే వారికి ఇస్తున్నామని చెప్పడం విచారకరమన్నారు. 27వ వార్డు జనరల్ మహిళ అయినందున పార్టీ మాది, జెండా మాది అంటూ కొంతమంది అగ్రవర్ణాల వారు సద్గుణరావుకు సీటు రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. సద్గుణరావు పార్టీలో చేరడంతో ఈ వార్డులోని పార్టీ అభ్యర్థి యండ్రపాటి శాంతమ్మ అధికమెజారిటీతో ఘన విజయం సాధించటం తథ్యమన్నారు.
మున్సిపల్ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ సలార్‌దాదా మాట్లాడుతూ బహునాయకత్వంలో ఉన్న టీడీపీలో దళిత నాయకులకు అన్యాయం జరుగుతుందన్నారు. 27వ వార్డు మాజీ కౌన్సిలర్ కొక్కిలిగడ్డ శరత్‌కుమార్ అధ్యక్షతన జరిగిన పార్టీలో చేరిన మేడూరి సద్గుణరావు మాట్లాడుతూ టీడీపీ నాయకులు తనను కుల వివక్షకు గురిచేశార ని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ జెడ్‌పీటీసీ సభ్యుడు లంకే వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ నాయకులు యండ్రపాటి నాగేశ్వరరావు, మేడెంపూడి అనీల్, మాచవరపు సురేష్, యోనా, నతానియేల్, సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు.
పార్టీలోకి టీడీపీ నేతలు...
బందరు మండలం తుమ్మలపాలెంకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు బండారులంక సాంబశివరావు సోమవారం రాత్రి సుమారు 150 మంది అనుచరులతో వైఎస్సార్ సీపీలో చేరారు. పేర్ని నాని వారికి పార్టీ కండువాలతో స్వాగతం పలికారు. కాగా సాంబశివరావుతో పాటు పార్టీలో చేరిన బండారులంక బ్రహ్మరాజులు, రాజు, వీరభద్రరావు, సాంబయ్యలకు పేర్ని పార్టీ కండువాలు వేశారు. అనంతరం నెలకుర్రు పీఏసీఎస్ డెరైక్టర్ నాంచారయ్య తన అనుచరులతో వైఎస్సార్ సీపీలోకి చేరారు. తోట శ్రీనివాసరావు, ఫరీద్ పాల్గొన్నారు.