2018 ఆరంభమైంది. జిల్లాలో సరికొత్త రాజకీయ చిత్రం ఏర్పడనుంది. ఇప్పటికే ఆయా పార్టీల శ్రేణుల్లో స్థానిక ఎన్నికల ఊపు నెలకొంది. గులాబీసేనలో నామినేటెడ్ జోష్ నెలకొనగా.. హస్తం పార్టీలో ఆశలు చిగురిస్తున్నాయి. అమిత్‌షా రాష్ట్ర పర్యటనపైనే కమలదళం ఆశలు పెట్టుకుంది. వామపక్షాలు పోరుబాట పట్టగా.. వైఎస్సార్ సీపీ పూర్వవైభవ దిశగా ముందుకు సాగుతోంది.
సాక్షి, కొత్తగూడెం: రాజకీయ పార్టీల శ్రేణుల్లో సరికొత్త వాతావరణం నెలకొంది. 2018 ఏడాది మధ్యలో పంచాయతీ ఎన్నికలు జరగనుండడంతో పాటు తర్వాత సాధారణ ఎన్నికలు రానుండడంతో జిల్లాలోని ఆయా పార్టీ నాయకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. క్షేత్రస్థాయి కార్యకర్తలతో నూతనోత్సాహం ఏర్పడింది. కొత్త ఏడాది కానుకగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించడంతో అధికార టీఆర్‌ఎస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఇన్నాళ్లు ఊరిస్తూ వచ్చిన నామినేటెడ్ పదవులు ఎప్పుడెప్పుడు వరిస్తాయా అని ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు.
జిల్లాలో ప్రధానమైన భద్రాచలం, అన్నపురెడ్డిపల్లి ఆలయ కమిటీలతో పాటు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల డైరెక్టర్ల పదవులు ఆశించే వారు ఉవ్విళ్లూరుతున్నారు. మొదటి నుంచి పనిచేసే వారితో పాటు, రాష్ట్ర స్థాయి నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో వివిధ రకాల పదవులకు సంబంధించి ఒప్పందాలు చేసుకుని టీఆర్‌ఎస్‌లో చేరిన వలస నాయకులు నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లా కమిటీ రద్దు చేసి 15 నెలలు దాటడంతో సంస్థాగత పదవులకు కూడా ఎదురుచూపులు తప్పడంలేదు. క్షేత్రస్థాయి శ్రేణుల్లో అసంతృప్తిని తొలగించేందుకు పార్టీ అధినేత నిర్ణయించడంతో కొంత ఊరట పొందారు.
♦ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సంస్థాగత పదవుల విషయమై శ్రేణుల్లో సరికొత్త ఆశలు నెలకొన్నాయి. క్షేత్రస్థాయిలో సమన్వయం చేసేందుకు అధిష్టానం తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా భద్రాద్రి జిల్లాకు సంబంధించి డీసీసీ అధ్యక్షుడు, కార్యవర్గం నియామకంపై ఉత్కంఠ నెలకొంది. స్థానిక ఎన్నికలు, అనంతరం సాధారణ ఎన్నికలు వస్తుండడంతో సంస్థాగత పదవులపై శ్రేణుల్లో మరిన్ని ఆశలు చిగురిస్తున్నాయి.
♦ రానున్న స్థానిక ఎన్నికల్లో జిల్లాలోని అన్ని పంచాయతీల్లో పోటీ చేసేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా సంస్థాగతంగా మరింత బలోపేతం అయ్యేందుకు జిల్లాలో కార్యవర్గాన్ని విస్తరించేందుకు నిర్ణయించారు.
♦ మోదీ–అమిత్‌షా మేనియాతో జిల్లాలో బలపడాలని కమలదళం ప్రయత్నిస్తోంది. ఈ నెలలో రాష్ట్రంలో 5 రోజుల పాటు పర్యటించి భవిష్యత్ కార్యాచరణకు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా నిర్ణయించడంతో జిల్లా శ్రేణుల్లో ఊపు వచ్చింది. మారుమూల ప్రాంతాల్లో విస్తరించేందుకు సంస్థగతంగా మరిన్ని పదవులు ఇచ్చేందుకు నిర్ణయించడంతో పాటు, స్థానిక ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పావులు కదుపుతోంది. దీంతో శ్రేణుల్లో ఆశలు పెరిగాయి.
♦ ఇక భద్రాద్రి జిల్లాలో ప్రాబల్యం ఎక్కువగా కలిగిన వామపక్షాలైన సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు సర్వశక్తులూ ఒడ్డేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రజాక్షేత్రంలో పోరుబాటకు దిగాయి. గ్రామ స్థాయిలో సంస్థాగతంగా బలోపేతమయ్యేందుకు శ్రేణులను సిద్ధం చేస్తున్నాయి. మండల మహాసభలు పూర్తిచేసుకుంటున్న సీపీఎం ఈ నెల మొదటివారంలోనే జిల్లా మహాసభలను జరుపుకోనుంది.
♦ ఇక టీడీపీ పుంజుకునే పరిస్థితి కనిపించడంలేదు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోనే కేడర్‌తో అంతా టీఆర్‌ఎస్‌లో చేరింది. అనంతరం రేవంత్‌రెడ్డితో కొందరు కాంగ్రెస్‌లో చేరారు. మిగిలిన ఒకరిద్దరు నాయకులు కూడా నైరాశ్యంలోనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment