శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: మున్సిపల్ పోలింగ్ సరళి తొలిసారి ఈ ఎన్నికల బరిలో నిలిచిన వైఎస్‌ఆర్‌సీపీ హవాను స్పష్టం చేసింది. ఎన్నికలు జరిగిన నాలుగు మున్సిపాలిటీల్లోనూ ఫ్యాన్ గాలి వీచినట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడటంతో ప్రధాన ప్రత్యర్థి అయిన టీడీపీ శ్రేణులు గుబులు చెందుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఎన్నికల పోలింగ్, ఫలితాల ప్రభావం తప్పనిసరిగా తర్వాత జరిగే ఎన్నికలపై పడుతుందని పార్టీలు విశ్వసిస్తున్నాయి. తాజా ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి, ఓటర్ల అభిప్రాయలు, పోలింగ్ సరళి బట్టి చూస్తే అన్ని చోట్లా వైఎస్సార్ కాంగ్రెస్‌కే విజయావకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలపై పూర్తిగా ఆశలు వదిలేసుకోగా వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీల మధ్యే ప్రధాన పోటీ జరిగింది. నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 91 వార్డులు ఉండగా పాల కొండ 14వ వార్డులో వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మిగిలిన 90 వార్డులకు ఆదివారం పోలింగ్ జరిగింది. పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన వృద్ధులు, తొలిసారి ఓటు వేస్తున్న యువజనులు ఫ్యాన్‌కే వేశామని ఎక్కువగా చెప్పడం పలు చోట్ల కనిపించింది. మహిళా ఓటర్లు సైతం ఇదే విషయం చెప్పారు. దీనికితోడు ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ పరిస్థితి ప్రజల్లో విశేష ఆదరణ ఉన్న వైఎస్‌ఆర్‌సీపీకే లాభిస్తుందని అంచనా వేస్తున్నారు.
ఆమదాలవలస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీల్లో ఆ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత కనిపించగా.. పాలకొండ, పలాసల్లో టీడీపీ కొంత పోటీ ఇచ్చినట్లు కనిపించినా అత్యధిక వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీయే విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఇలాంటి అంచనాలనే ఉన్నతాధికారులకు పంపినట్లు విశ్వసనీయ సమాచారం.
కాగా పోలింగ్ సరళిని చూసి టీడీపీ శ్రేణులు జావగారిపోతున్నాయి. గట్టి పోటీ ఇచ్చామని భావిస్తున్న ఆ పార్టీ నాయకులు తాజా పరిస్థితులతో డీలా పడిపోతున్నారు. వీటి ప్రభావం ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ అవకాశాలపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని దిగులు చెందుతున్నారు.
ఫ్యాన్ జోరు.. సైకిల్ బేజారు
Published Mon, Mar 31 2014 1:59 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement