Fan air
-
ఫ్యానుకు లైటు!
భలే బుర్ర అవసరమే ఆవిష్కరణలకు తల్లి. అదే మన మెదడుకు పదును పెడుతుంది. అదే మనలోని శాస్త్రవేత్తను మేల్కొలుపుతుంది. వనరులతో పనిలేదు, పెద్దగా డబ్బూ దస్కం కూడా అక్కర్లేదు. పెద్దపెద్ద డిగ్రీలూ వగైరా అవసరం లేదు. కాస్త తెలివితేటలుంటే చాలు, జటిల సమస్యలకు కూడా తేలికపాటి పరిష్కారాలను వెదుక్కోగలం. శాస్త్రవేత్తల ఘనతను కాదు, సామాన్యుల తెలివిని పరిశీలిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. ఒక సామాన్యుడి తెలివికి ఇదొక ఉదాహరణ. ఈ ఫొటోలో కనిపిస్తున్న ఆసామి పేరు మహేశ్వరన్. బెంగళూరు వీధుల్లో కాల్చిన మొక్కజొన్నలు అమ్ముతూ పొట్ట పోసుకుంటూ ఉంటాడు. పగలంతా ఈ వ్యాపారానికి పెద్ద గిరాకీ ఉండదు. సాయంత్రమైతేనే కస్టమర్ల సందడి మొదలవుతుంది. బొగ్గుల మంటపై మొక్కజొన్న కండెలను కాలుస్తూ, వేడివేడిగా కస్టమర్లకు అందించాలి. వాళ్లిచ్చే డబ్బులు తీసుకుని, చిల్లర లెక్క తప్పకుండా తిరిగివ్వాలి. చీకటి ముసురుకునే సమయంలో, సరైన వీధిదీపాలు లేని ప్రాంతాల్లో ఇదంతా మా చెడ్డ ఇబ్బంది. బండి మీద ఒక లైట్ అయినా ఏర్పాటు చేసుకోకపోతే పని జరగదు. అది మాత్రమేనా? బొగ్గులు రాజేసేందుకు జబ్బలు పీకేలా విసనకర్రతో విసురుతూ ఉండాలి, మరోపక్క కస్టమర్లనూ సంభాళిస్తూ ఉండాలి. చాలాకాలం ఈ సమస్యతో వేసారిపోయిన మహేశ్వరన్‌కు ఉన్నట్లుండి బుర్రలో బల్బు వెలిగింది. అంతే! ఉన్న వనరులతోనే తన అవసరాలకు తగిన టూ ఇన్ వన్ పరికరాన్ని రూపొందించుకున్నాడు. ఒక చిన్న బార్లైట్ ఫ్రేమ్‌కి, పాతబడ్డ టేబుల్ ఫ్యాన్‌ని కూడా ఫిక్స్ చేసి బండి మీద అమర్చుకున్నాడు. ఆ ఫ్యాన్ గాలితో నిప్పులు రాజేసి పొత్తులు కాలుస్తాడు. లైటు వెలుగులో డబ్బులు లెక్కపెట్టుకుంటాడు. వెలుగు, గాలి ఏకకాలంలో ఇచ్చే ఈ పరికరాన్ని బెంగళూరు జనాలు అబ్బురంగా చూస్తున్నారు. -
ఫ్యాన్ జోరు.. సైకిల్ బేజారు
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: మున్సిపల్ పోలింగ్ సరళి తొలిసారి ఈ ఎన్నికల బరిలో నిలిచిన వైఎస్ఆర్సీపీ హవాను స్పష్టం చేసింది. ఎన్నికలు జరిగిన నాలుగు మున్సిపాలిటీల్లోనూ ఫ్యాన్ గాలి వీచినట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడటంతో ప్రధాన ప్రత్యర్థి అయిన టీడీపీ శ్రేణులు గుబులు చెందుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఎన్నికల పోలింగ్, ఫలితాల ప్రభావం తప్పనిసరిగా తర్వాత జరిగే ఎన్నికలపై పడుతుందని పార్టీలు విశ్వసిస్తున్నాయి. తాజా ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి, ఓటర్ల అభిప్రాయలు, పోలింగ్ సరళి బట్టి చూస్తే అన్ని చోట్లా వైఎస్సార్ కాంగ్రెస్‌కే విజయావకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలపై పూర్తిగా ఆశలు వదిలేసుకోగా వైఎస్ఆర్సీపీ, టీడీపీల మధ్యే ప్రధాన పోటీ జరిగింది. నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 91 వార్డులు ఉండగా పాల కొండ 14వ వార్డులో వైఎస్ఆర్సీపీ మద్దతుదారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 90 వార్డులకు ఆదివారం పోలింగ్ జరిగింది. పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన వృద్ధులు, తొలిసారి ఓటు వేస్తున్న యువజనులు ఫ్యాన్‌కే వేశామని ఎక్కువగా చెప్పడం పలు చోట్ల కనిపించింది. మహిళా ఓటర్లు సైతం ఇదే విషయం చెప్పారు. దీనికితోడు ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ పరిస్థితి ప్రజల్లో విశేష ఆదరణ ఉన్న వైఎస్ఆర్సీపీకే లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఆమదాలవలస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీల్లో ఆ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత కనిపించగా.. పాలకొండ, పలాసల్లో టీడీపీ కొంత పోటీ ఇచ్చినట్లు కనిపించినా అత్యధిక వార్డుల్లో వైఎస్ఆర్సీపీయే విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఇలాంటి అంచనాలనే ఉన్నతాధికారులకు పంపినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా పోలింగ్ సరళిని చూసి టీడీపీ శ్రేణులు జావగారిపోతున్నాయి. గట్టి పోటీ ఇచ్చామని భావిస్తున్న ఆ పార్టీ నాయకులు తాజా పరిస్థితులతో డీలా పడిపోతున్నారు. వీటి ప్రభావం ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ అవకాశాలపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని దిగులు చెందుతున్నారు. -
ఫ్యాన్ జోరు.. తమ్ముళ్ల బేజారు
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : భీమవరం మునిసిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గాలి బాగా వీస్తోంది. ఏ వార్డులో చూసినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎదురు లేకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతుండగా టీడీపీ అభ్యర్థుల్లో నిస్సత్తువ ఆవహించింది. ఏం చేస్తాం.. పోటీలోకి దిగాం కదా.. తప్పదు.. అనుకుంటూ నీరసంగా ప్రచారాన్ని నిర్వహించారు. మునిసిపాలిటీలో వరుసగా రెండుసార్లు టీడీపీనే గెలిపిస్తున్నామని, అయితే అభివృద్ధి చేయడంలో వారు విఫలమయ్యారని ప్రజలు విమర్శిస్తున్నారు. వైసీపీని గెలిపించుకుంటే పట్టణం అభివృద్ధి చెందుతుందని వారు భావిస్తున్నారు. మరోవైపు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ ఒక పక్క అన్ని వార్డుల్లోనూ సుడిగాలి ప్రచారం చేయడంతో ట్రెండ్ పూర్తిగా మారిపోరుుంది. ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్యే అంజిబాబును టీడీపీలోకి చేర్చుకోవడంపై ఆ పార్టీ శ్రేణులు అసంతృప్తికి గురయ్యాయి. మొన్నటి వరకు ఎవరితో అయితే పోరాడామో.. ఇప్పుడు ఆ నేతతో సర్దుకుపోయి పనిచేయడం తమ వల్ల కాదంటూ ఆ పార్టీ శ్రేణులు సహాయనిరాకరణ చేస్తున్నాయి. దీంతో టీడీపీ అభ్యర్థులు విజయావకాశాలపై ఆశలు వదులుకున్నారు. టీడీపీ అభ్యర్థులను ఏదోవిధంగా గెలిపించుకోవాలని భావించిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు మెంటే పార్థసారధి మారిన పరిస్థితుల నేపథ్యంలో అంత ఉత్సాహం చూపించడం లేదు. మాజీ ఎమ్మెల్యే అంజిబాబు టీడీపీ కండువా వేసుకోవడంపై పార్థసారధి ఆయన కినుక వహించారు. అసెంబ్లీ టిక్కెట్ అంజిబాబుకే ఖరారైన నేపథ్యంలో ఆయన మండిపడుతున్నారు. ఈ పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా మారడంతో ఆ పార్టీ విజయం ఖయమని చెబుతున్నారు.