ఫ్యానుకు లైటు!
భలే బుర్ర
అవసరమే ఆవిష్కరణలకు తల్లి. అదే మన మెదడుకు పదును పెడుతుంది. అదే మనలోని శాస్త్రవేత్తను మేల్కొలుపుతుంది. వనరులతో పనిలేదు, పెద్దగా డబ్బూ దస్కం కూడా అక్కర్లేదు. పెద్దపెద్ద డిగ్రీలూ వగైరా అవసరం లేదు. కాస్త తెలివితేటలుంటే చాలు, జటిల సమస్యలకు కూడా తేలికపాటి పరిష్కారాలను వెదుక్కోగలం. శాస్త్రవేత్తల ఘనతను కాదు, సామాన్యుల తెలివిని పరిశీలిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. ఒక సామాన్యుడి తెలివికి ఇదొక ఉదాహరణ.
ఈ ఫొటోలో కనిపిస్తున్న ఆసామి పేరు మహేశ్వరన్. బెంగళూరు వీధుల్లో కాల్చిన మొక్కజొన్నలు అమ్ముతూ పొట్ట పోసుకుంటూ ఉంటాడు. పగలంతా ఈ వ్యాపారానికి పెద్ద గిరాకీ ఉండదు. సాయంత్రమైతేనే కస్టమర్ల సందడి మొదలవుతుంది. బొగ్గుల మంటపై మొక్కజొన్న కండెలను కాలుస్తూ, వేడివేడిగా కస్టమర్లకు అందించాలి. వాళ్లిచ్చే డబ్బులు తీసుకుని, చిల్లర లెక్క తప్పకుండా తిరిగివ్వాలి. చీకటి ముసురుకునే సమయంలో, సరైన వీధిదీపాలు లేని ప్రాంతాల్లో ఇదంతా మా చెడ్డ ఇబ్బంది. బండి మీద ఒక లైట్ అయినా ఏర్పాటు చేసుకోకపోతే పని జరగదు. అది మాత్రమేనా? బొగ్గులు రాజేసేందుకు జబ్బలు పీకేలా విసనకర్రతో విసురుతూ ఉండాలి, మరోపక్క కస్టమర్లనూ సంభాళిస్తూ ఉండాలి.
చాలాకాలం ఈ సమస్యతో వేసారిపోయిన మహేశ్వరన్‌కు ఉన్నట్లుండి బుర్రలో బల్బు వెలిగింది. అంతే! ఉన్న వనరులతోనే తన అవసరాలకు తగిన టూ ఇన్ వన్ పరికరాన్ని రూపొందించుకున్నాడు. ఒక చిన్న బార్‌లైట్ ఫ్రేమ్‌కి, పాతబడ్డ టేబుల్ ఫ్యాన్‌ని కూడా ఫిక్స్ చేసి బండి మీద అమర్చుకున్నాడు. ఆ ఫ్యాన్ గాలితో నిప్పులు రాజేసి పొత్తులు కాలుస్తాడు. లైటు వెలుగులో డబ్బులు లెక్కపెట్టుకుంటాడు. వెలుగు, గాలి ఏకకాలంలో ఇచ్చే ఈ పరికరాన్ని బెంగళూరు జనాలు అబ్బురంగా చూస్తున్నారు.