జ్ఞానానికి, అజ్ఞానానికి మధ్య ఉన్నది ‘అ’భేదమే కదా అనుకుంటాం కానీ, ఆ రెండింటికీ మధ్య ఏడు సముద్రాలంత దూరం ఉంది. అజ్ఞానమనే చీకటి ఒడ్డు నుంచి, జిజ్ఞాస అనే అలల మీదుగా, జ్ఞానమనే వెలుగుల తీరం వైపు సాగే ప్రయాణంలో ఆనందమే మనకు తెప్పవుతుంది. అందుకే జ్ఞానానందమనే మాట పుట్టింది. అయితే, ఆ ఆనందాన్ని అంటిపెట్టుకుని ఒక విషాదమూ ఉంటుంది.
అది ఏమిటంటే... మన ఊహకు అందనంత వయసున్న ఈ అనంతవిశ్వంలో భూమి ఒక గోళీకాయ కన్నా కూడా చిన్నదనుకుంటే, దానిపై జీవించే మనిషి నలుసుపాటి కూడా చేయడు. అతని అస్తిత్వాన్ని కాలం కొలమానంతో కొలిస్తే అది కొన్ని క్షణాలను మించదు. కనుక అనంతవిశ్వం గురించిన జ్ఞానం సంగతలా ఉంచి, ఈ భూమి గురించి, ఈ భూమి మీద తన మనుగడ గురించిన జ్ఞానం మొత్తాన్నే ఒక మనిషి తన జీవితకాలంలో సంగ్రహించుకోవడం అసాధ్యం. అదీ అసలు విషాదం.
మనిషిలో మెదడు ఎప్పుడు వికసించిందో అప్పుడే అతనిలో విశ్వం గురించిన జ్ఞానాన్వేషణ మొదలై, వేలసంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. చంద్రుడి వృద్ధి, క్షయాలను అనుసరించి కాలగణనాన్నీ, ఋతుభ్రమణాన్ని అనుసరించి వేటజంతువుల గుర్తింపునూ మనిషి ప్రారంభించి వాటిని ఒక పొడవాటి ఎముకపై నమోదు చేయడం నక్షత్రాలు, రాశులతో ముడిపడిన జ్యోతిర్విజ్ఞానానికి నాంది అయిందంటారు. ఆపైన మొక్కల సేకరణ నుంచి, పెరటిసాగుకు; అక్కడి నుంచి వ్యవసాయానికి సాగే క్రమంలో ఆహారవిజ్ఞానాన్ని బహుముఖాలుగా విస్తరించుకుంటూ వెళ్ళాడు.
రాతిపనిముట్ల తయారీలో సాంకేతికజ్ఞానాన్ని, ఏదో అతీతశక్తి ఈ విశ్వాన్ని సృష్టించి నడిపిస్తోందన్న ఊహ నుంచి మత, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని; నియమ నిబంధనలు, కట్టుబాట్లతో కలసి జీవించడం నుంచి సంస్కృతిని సంతరిస్తూ, నిర్మిస్తూ వచ్చాడు. ఇందులో ప్రతిదీ జ్ఞానాన్వేషణలో మేలి మలుపే; జ్ఞానపు నిచ్చెన నధిరోహించడంలో నిశ్చయాత్మకమైన మెట్టే. నగరాల నిర్మాణం మీదుగా నాగరికతాదిశగా సాగిన ఈ యాత్రలో ఇంతవరకు మనిషి ఎక్కడా మడమ తిప్పింది లేదు; ఆకాశమే హద్దుగా ఆ యాత్ర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయినా సరే, సంపూర్ణజ్ఞానం మనిషికి ఎప్పటికీ అందని ఎండమావిలా ఊరిస్తూనే ఉంది. కనిపించని జ్ఞానచంద్రుడి చీకటిపార్శ్వం అదే.
సంకేతాల నుంచి లిపిని అభివృద్ధి చేసుకుని జ్ఞానాన్ని పుస్తక రూపంలో భద్రపరచడం ఈ క్రమంలో మరొక మెరుపుల మజిలీ. మొదట్లో విశ్వసృష్టి, దేవుడు, మతం, ఆధ్యాత్మికత, శాస్త్ర విజ్ఞానం, సాంకేతికజ్ఞానం వగైరా వింగడింపు లేకుండా తనకు తెలిసిన జ్ఞానం మొత్తాన్ని, తనకు తెలిసిన ప్రక్రియలో ఒకేచోట రాశిపోసిన ఉత్సాహం మనిషిది. అందుకే గణితశాస్త్రాన్ని కూడా పద్యాల్లో చెప్పిన పావులూరి మల్లన్నలు మన దేశంలో, మన సాహిత్యంలో కనిపిస్తారు.
తర్వాత తర్వాత జ్ఞానం అనేక శాఖలు గల మహావృక్షంగా ఎదిగిపోయి, ఒక మనిషి తన జీవితకాలంలో ఏ ఒక్క శాఖనూ పూర్తిగా తేరి చూసే వీలుకుండా నిలువుగా అడ్డంగా విస్తరించిపోయింది. తన కళ్ళ ముందే ఉన్న, తన నిత్యజీవనంతో ముడిపడి ఉన్న, తన అనుభవంలోకి వచ్చే అనేక విషయాల ఆనుపానులు తెలియకుండానే మనిషి తన జీవితకాలాన్ని ముగించవలసి రావడం కన్నా పెనువిషాదం ఇంక ఏముంటుంది?
ప్రసిద్ధ కథారచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య ‘ఇంగువ’ అనే కథలో ఈ విషాదాన్నే ఒకింత హాస్యగంభీరస్ఫోరకంగా చిత్రిస్తారు. అందులో రాజశేఖరం అనే వ్యక్తిని ఇంగువ ఎలా తయారవుతుందనే ప్రశ్న చిరకాలంగా వేధిస్తూ ఉంటుంది. అతను వృద్ధాప్యంలో మంచం పడతాడు. ఒక మిత్రుడు అతణ్ణి చూడడానికి వెడతాడు. రాజశేఖరం అతి కష్టం మీద నోరు తెరచి అదే ప్రశ్న అడుగుతాడు. దానికి సమాధానం తెలుసుకోకుండానే జీవితం చాలిస్తానేమోనన్న బెంగ అతని ముఖంలో కనిపిస్తుంది.
మిత్రుడు వెంటనే వెళ్ళి ఇంకో మిత్రుని కలసి సమాధానం కనుక్కొని తిరిగి వస్తాడు. కానీ అప్పటికే రాజశేఖరం కన్నుమూస్తాడు. ఇప్పటిలా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చి, గూగుల్ శోధించి ఉంటే, ‘ఫెరులా’ అనే మొక్క నుంచి పుట్టే జిగురే గట్టిపడి ఇంగువగా తయారవుతుందనీ, ‘అసాఫోటిడా’ అనేది దాని శాస్త్రీయ నామమనీ, ఈ మొక్క ఎక్కువగా ఇరాన్ ఎడారుల్లో, అఫ్ఘానిస్తాన్, ఉజ్బెకిస్తాన్ పర్వతప్రాంతాలలో సాగవుతుందనీ రాజశేఖరం తెలుసుకుని ఉండేవాడు.
అలాగని అతనికా అదృష్టం లేకపోయిందనడానికీ వీల్లేదు. ఇంటర్నెట్ ఆధారిత బహుళ మాధ్యమాలతో సమాచారవిప్లవం కొత్తపుంతలు తొక్కిందనుకునే ఈ రోజున కూడా చిన్న చిన్న సందేహాలు తీరకుండానే దేహం చాలించే రాజశేఖరాలు ఉంటూనే ఉన్నారు. జ్ఞానతీరానికి ఏ కొంచెమైనా దగ్గరవడానికి ఏ అత్యాధునిక సాధనాలూ సాయపడడం లేదు. పరిమిత జీవితకాలం అతని నిస్సహాయతను ఇప్పటికీ గుర్తుచేసి వెక్కిరిస్తూనే ఉంది.
మరోవైపు సమాచార ఉల్బణం నుంచి నిక్కమైన సమాచారానికి బదులు అసత్యాలు, అర్ధసత్యాలు, వక్రీకరణలు పుట్టుకొచ్చి జ్ఞానాన్వేషణను అజ్ఞానాన్వేషణగా మార్చివేశాయి. అలా వ్యాప్తిలోకి వచ్చినదే ‘ఫేక్’ లేదా నకిలీ సమాచారమనే మాట. నేటి రాజశేఖరాలను వేధిస్తున్నది కేవలం సమాచార రాహిత్యం కాదు, నిజమో, అబద్ధమో తెలియని సమాచార సందిగ్ధం. జ్ఞాన, అజ్ఞానాల మధ్య ఆ మాత్రపు అక్షరభేదాన్ని కూడా తుడిచేసి పూర్తి అభేదాన్ని స్థాపించే యుగంలో ఉన్నాం. అదీ విషాదం!
సందిగ్ధ జ్ఞానం
Published Mon, Nov 18 2024 12:30 AM | Last Updated on Mon, Nov 18 2024 6:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment