- డీసీసీబీపై కన్నేసిన టీఆర్ ఎస్
- యడవెల్లి విజయేందర్‌రెడ్డి రాజీనామాకు అధికారిక ఆమోదమే తరువాయి
- ఇక తప్పని ఎన్నిక.. చైర్మన్ పోస్టు కోసం ఇప్పటికే ‘వర్గ’ పోరు
సాక్షిప్రతినిధి, నల్లగొండ: సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్‌కు జిల్లాలో మిగిలిన ప్రధానపోస్టులు రెండు. అంతకు ముందే జరిగిన సహకార ఎన్నికల్లో డీసీసీబీ చైర్మన్, స్థానిక ఎన్నికల్లో జిల్లాపరిషత్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ నిలబెట్టుకుంది. ఈ రెండింట ఆ పార్టీకి తిరుగులేని మెజారిటీ ఉంది. అయితే సహకార ఎన్నికలు పార్టీల ప్రాతిపదికన జరిగినవి కావు. దీంతో డెరైక్టర్లు తమ ఇష్టమున్న పార్టీ తరఫున పనిచేసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ సొంతింటి రాజకీయాలతో చివరకు తన చేతిలో ఉన్న ప్రధానమైన డీసీసీబీని చేజేతులా వదులుకుంటోం దన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.
ఇక్కడ జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న అధికార టీఆర్‌ఎస్ పార్టీ డీసీసీబీపైనా నజర్ పెట్టినట్లు చెబుతున్నారు. రెండోసారి చైర్మన్‌గా ఎన్నికైన విజయేందర్‌రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ల నుంచి తీవ్రమైన ఒత్తిడే ఉంది. సహకార ఎన్నికలకు ముందు పార్టీలో అంతర్గతంగా చేసుకున్న ఒప్పందం మేరకు విజయేందర్‌రెడ్డిని దీర్ఘకాలిక సెలవుపై పంపించి, వైస్‌చైర్మన్‌గా ఉన్న ముక్తవరపు పాండురంగారావును ఇన్ చార్జ్ చైర్మన్‌గా చేయాలన్నది ఆ ఒప్పంద సారాంశం. ఈ మేరకు విజయేందర్‌రెడ్డి తప్పని పరిస్థితుల్లో ఆరు నెలల పాటు సెలువులో వెళ్లిపోయారు. ఈలోగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. దీంతో ఆయన తిరిగి తన బాధ్యతల్లో చేరిపోయారు. అయినా, ఒప్పందం మేరకు పక్కకు తప్పుకోవాల్సిందేనని ఓ మాజీ మంత్రి ఒత్తిడి పెట్టడంతో ఆయన రాజీనామా చేశారు. మంగళవారం ఆయన ఈ మేరకు రాష్ట్ర సహకార శాఖ అధికారులకు తన రాజీనామా లేఖను సమర్పించారు. ఇది ఆమోదం పొందడమే మిగిలింది.
చైర్మన్ రాజీనామా ఆమోదం పొందితే మళ్లీ ఎన్నిక జరపాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ వెలువడే వరకు మాత్రమే ఇన్‌చార్జ్ చైర్మన్‌గా పాండురంగారావుకు అవకాశం ఉంటుంది. ఆయననే తిరిగి చైర్మన్‌గా ఎన్నుకోవాలంటే డెరైక్టర్లలో మెజారిటీ ఉండాలి. వాస్తవానికి డీసీసీబీ డెరైక్టర్లు అంతా (19) కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. కానీ, వీరిలో భువనగిరి ప్రాంతానికి చెందిన ఓ డెరైక్టర్ చైర్మన్ పోస్టుపై ఆశ పెంచుకున్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రులు చెప్పినట్లు నడుచుకున్న డెరైక్టర్లు ఇప్పుడు మళ్లీ వారి మాట విని, పార్టీ సూచించే అభ్యర్థినే ఎన్నుకుంటారా అన్నది ప్రశ్నార్థకమే. ఇప్పటికే కాంగ్రెస్ డెరైక్టర్లలో వర్గపోరు ఉంది. ఈ
సారి చైర్మన్ పదవిని ఎట్టి పరిస్థితుల్లో ఆయకట్టేతర ప్రాంతానికి ఇవ్వాలన్నది వీరి డిమాండ్. డీసీసీబీలో కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ పరిణామాలను గమనిస్తున్న అధికార టీఆర్‌ఎస్ పార్టీ.. డెరైక్టర్లలో కొందరిని తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. 19 మంది డెరైక్టర్లలో కనీసం 10 మంది మద్దతు కూడగ ట్టగలిగితే డీసీసీబీపై టీఆర్‌ఎస్ జెండా ఎగరేయవచ్చన్న వ్యూహంతో ఉన్నారు. మునుగోడు, ఆలేరు నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు డెరైక్టర్లు మధ్యలో ఓసారి అవిశ్వాసం పెట్టాలన్న ఆలోచన కూడా పెట్టారు. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు, డెరైక్టర్లలో ఉన్న వర్గపోరు ద్వారా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో గులాబీ నేతలు ఉన్నట్లు చెబుతున్నారు. డీసీసీబీ రాజకీయం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
‘చే’జారేనా..?
Published Thu, Sep 18 2014 1:16 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement