DCC
-
ఆ మూడు స్థానాల్లో ఎవరు?
సాక్షి, హైదరాబాద్: అధికారికంగా ప్రకటించకుండా మిగిలిపోయిన 3 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ 3 స్థానాల విషయంలో నిర్ణయం జరిగిపోయినప్పటికీ ఫైల్ మీద సంతకం పెట్టకపోవడంతో ఆగిపోయినట్లు తెలుస్తోంది. గాందీభవన్ వర్గాల్లో చర్చ ప్రకారం.. ఖమ్మంకు పొంగులేటి ప్రసాదరెడ్డి, కరీంనగర్‌కు వెల్చాల రాజేందర్రావు, హైదరాబాద్‌కు సమీర్ వలీవుల్లా లను అభ్యర్థులుగా నిర్ణయించారు. నేడో, రేపో ఉత్తర్వులు వెలువడు తాయని తెలుస్తోంది. ఆ 3... కారణాలు అనేకం వాస్తవానికి, కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించడం మార్చిలోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి మూడు దఫాల్లో 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కానీ, పలు కారణాల రీత్యా ఈ 3 చోట్ల అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఇందుకు అనేక కారణాలున్నాయని గాందీభవన్ వర్గాలంటున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రుల మధ్య పోటీ, సామాజిక సమీకరణలు పీటముడి వేయగా, కరీంనగర్లో కూడా సామాజిక సమీకరణలే కారణమయ్యాయని, హైదరాబాద్‌లో అభ్యర్థి ఎంపికకు రాజకీయ కారణాలున్నాయని చెబుతున్నాయి. ఖమ్మంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాదరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్, కమ్మ సామాజిక వర్గానికి చెందిన జెట్టి కుసుమ కుమార్, వంకాయలపాటి రాజేంద్రప్రసాద్‌ల పేర్లు వినిపించాయి. ఖమ్మంలో అభ్యర్థి ఎంపిక కోసం ఆ పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. అన్ని కోణాల్లో చర్చించిన తర్వాత పొంగులేటి ప్రసాదరెడ్డి పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. వెలమలకు కూడా.. కరీంనగర్ టికెట్ ఎవరికన్న విషయంలో పార్టీ హైకమాండ్ ఆది నుంచి సామాజిక కోణంలోనే ఆలోచిస్తోంది. ఇక్కడ మొదటి నుంచీ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డితోపాటు వెలమ సామాజిక వర్గానికి చెందిన వెల్చాల రాజేందర్రావు పేరు మాత్రమే పరిశీలించారు. అయితే, రాష్ట్రంలోని ఒక స్థానాన్ని వెలమలకు కేటాయించాలన్న యోచనతో రాజేందర్రావు వైపు మొగ్గు చూపినట్టు తెలిసింది. ఈ సమాచారాన్ని జిల్లా కాంగ్రెస్ నేతలకూ తెలియజేయడంతో పార్టీ అభ్యర్థిత్వాన్ని అనధికారికంగానే డీసీసీ ఖరారు చేసింది. గురువారం నాటి కార్యక్రమానికి పార్టీ అభ్యర్థి రాజేందర్‌రావుతోపాటు మంత్రి పొన్నం ప్రభాకర్ వస్తారని, వారికి ఘనంగా స్వాగతం పలకాలంటూ పార్టీ శ్రేణులకు సందేశం పంపింది. రాజకీయ కారణాలతోనే ఆలస్యం హైదరాబాద్‌లో కేవలం రాజకీయ కారణాలతోనే అభ్యర్థిత్వం ఆలస్యమైంది. ఎంఐఎం విషయంలో అనుసరించాల్సిన ధోరణి, బీజేపీని నిలువరించే ప్రయత్నాల్లో భాగంగా చివరివరకు హైదరాబాద్ అభ్యర్థిని ఖరారు చేయలేదని తెలుస్తోంది. అయితే, ఇక్కడ అభ్యర్థిత్వం కోసం చాలామంది పోటీపడ్డారు. ఫిరోజ్‌ఖాన్, అజారుద్దీన్, సమీర్ వలీవుల్లా, అలీ మస్కతి లాంటి నాయకుల పేర్లు ఈ జాబితాలో వినిపించినా, చివరకు హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సమీర్ వలీవుల్లాను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అలీ మస్కతి పేరును చివరి వరకు పరిశీలనలోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ మూడు స్థానాల విషయంలో అధిష్టానం ఓ కొలిక్కి రావడం, పోలింగ్‌కు మరో 25 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో నేడో, రేపో తుది జాబితా రానుందని తెలుస్తోంది. -
కొండా వర్గీయుడిపై ఇనుగాల వర్గీయుల దాడి
వరంగల్: వరంగల్ అబ్నూస్ ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగిన డీసీసీ సమావేశంలో కొండా వర్గీయుడు గాడిపెల్లికి చెందిన సీనియర్ నాయకుడు కడిదెల కట్టస్వామిపై ఇనుగాల వర్గీయులు ధర్మారానికి చెందిన దుపాకి సంతోశ్‌తో సహా పలువురు దాడికి పాల్పడ్డారు. కార్యకర్తలు సమన్వయం పాటించాలని వేదికపై ఉన్న నాయకులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. సమావేశం నుంచి వెళ్తున్నప్పటికీ వెంటపడి దాడి చేయడంతో కట్టస్వామి షర్టు చినిగిపోయింది. అక్కడే ఉన్న వరదరాజేశ్వర్‌రావు అడ్డుకుని హెచ్చరించడంతో గొడవ సద్దుమణిగింది. తెలిసిన సమాచారం మేరకు గత కొద్ది రోజులుగా ఇనుగాల వాట్సాప్ గ్రూప్‌లో కొండా అభిమాని కట్టస్వామి పోస్టింగ్‌లు పెట్టడంపై దుపాకి సంతోశ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సమావేశంలో కట్టస్వామి ఎదురుపడడంతో దుర్భాషలాడుతూ సంతోశ్ బృందం దాడికి పాల్పడినట్లు తెలిసింది. సమావేశానికి తూర్పు నేతల గైర్హాజర్.. వరంగల్‌లోని అబ్నూస్ ఫంక్షన్ హాల్లో బుధవారం వరంగల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో తూర్పు నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గైర్హాజర్ అయ్యారు. డీసీసీ పదవీ రేసులో ఉన్న కొండా వర్గీయులకు పదవి దక్కక పోవడంతో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖలతో పాటు వారి వర్గీయులు సమావేశానికి దూరంగా ఉన్నారు. తూర్పులో పార్టీ శ్రేణులు దాదాపు ఈసమావేశంలో కానరాకుండా పోయారు. ఎల్బీనగర్లో సమావేశం నిర్వహించినా మైనార్టీలు రాకపోవడం, కొండా వర్గీయులు కనిపించపోవడం చర్చనీయాంశంగా మారింది. వరంగల్ తూర్పు టిక్కెట్టు రేసులో ఎర్రబెల్లి స్వర్ణ ఉన్నందునే కోపంతో కొండా దంపతులు హాజరు కాలేదని చర్చ సాగింది. -
రాజగోపాల్ రెడ్డి మద్దతుదారులపై కాంగ్రెస్ వేటు
నల్గొండ: సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత.. మునుగోడులో దిద్దుబాటు చర్యలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ఉన్న నాలుగు మండలాల అధ్యక్షులు, ఓ టౌన్ అధ్యక్షుడిపై వేటు వేసింది. టీపీసీసీ ఆదేశాల మేరకు రాజగోపాల్ రెడ్డి మద్దతుదారులను తొలగించినట్లు వెల్లడించారు డీసీసీ అధ్యక్షుడు. చర్యలు తీసుకున్న వారిలో మునుగోడు- పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, చండూరు- పల్లె వెంకన్న, నాంపల్లి- పూల వెంకటయ్య, మర్రిగూడ- రాందాస్ శ్రీనివాస్ సహా ఓ టౌన్ అధ్యక్షుడున్నారు. ముందుగా ఆరుగురు మండలాధ్యక్షులపై చర్యలు తీసుకున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. చౌటుప్పల్- మోదుగుల రమేష్, సంస్థాన్ నారాయణ పురం- కరెంట్ శ్రీనివాస్‌లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదీ చదవండి: Komatireddy Rajagopal Reddy: కాంగ్రెస్‌కు రాజగోపాల్‌రెడ్డి గుడ్‌బై! నా నిర్ణయం తప్పయితే క్షమించండి.. -
శాటిలైట్ కనెక్టివిటీతో పల్లెలకు టెలికం సేవలు
న్యూఢిల్లీ: టెలికం నెట్‌వర్క్స్‌లో శాటిలైట్ కనెక్టివిటీ వినియోగించేందుకు డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆప్టికల్ ఫైబర్ వేయలేని ప్రాంతాల్లో టెలికం సేవలు అందించేందుకు, కఠిన భూభాగాల్లో మొబైల్ టవర్ల అనుసంధానానికి శాటిలైట్ కనెక్టివిటీ ఉపయోగపడుతుంది. 16 రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు అందించేందుకు ప్రతిపాదించిన భారత్‌నెట్ ప్రాజెక్ట్‌కు సైతం డీసీసీ ఆమోదం లభించింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.19,041 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌తో ఈ ప్రాజెక్టుకు చేపట్టనున్నారు. దీని కోసం వారం రోజుల్లో టెండర్లను టెలికం శాఖ పిలవనుంది. భారతీ గ్రూప్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ వన్‌వెబ్‌లో పెట్టుబడులు పెట్టినందున తాజా నిర్ణయం భారతి ఎయిర్‌టెల్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది. -
ఎయిర్టెల్, వొడా, ఐడియాలకు రూ.3,050 కోట్ల పెనాల్టీ!
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో నెట్వర్క్ కాల్స్‌కు ఇంటర్ కనెక్షన్ పాయింట్లను సమకూర్చనందుకు గాను భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు భారీ పెనాల్టీ భారం పడింది. టెలికం శాఖ అత్యున్నత నిర్ణయాల విభాగం డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ) పెనాల్టీ విధించే నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. అయితే, టెలికం రంగంలో తీవ్ర ఆర్థిక సమస్యల నేపథ్యంలో రూ.3,050 కోట్ల జరిమానాను అమలు చేసే ముందు దీన్ని సవరించే విషయంలో ట్రాయ్ సూచనలను తీసుకోవాలని కమిషన్ నిర్ణయించింది. టెలికం రంగంలోకి కొత్తగా ప్రవేశించిన జియోకు ఇంటర్కనెక్షన్ పాయింట్లను ఇచ్చేందుకు నిరాకరించిన భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలపై రూ.3,050 కోట్ల పెనాల్టీని విధించాలని 2016 అక్టోబర్‌లో ట్రాయ్ సిఫారసు చేసింది. ఇందులో ఎయిర్టెల్, వొడాఫోన్లకు రూ.1,050 కోట్ల చొప్పున, ఐడియాపై రూ.950 కోట్ల జరిమానా అమలు చేయాల్సి ఉంది. వొడాఫోన్, ఐడియాలు విలీనమై ఒకే సంస్థగా ఏర్పడడంతో ఇప్పుడు ఉమ్మడి జరిమానాను వొడాఫోన్ ఐడియా చెల్లించాల్సి ఉంటుంది. పోటీ సంస్థలు సరిపడా ఇంటర్ కనెక్షన్ పాయింట్లను సమకూర్చకపోవడంతో తమ నెట్‌వర్క్‌కు సంబంధించి 75 శాతం కాల్స్ ఫెయిల్ అవుతున్నాయంటూ జియో చేసిన ఫిర్యాదు ఆధారంగా ట్రాయ్ నాడు చర్యలకు ఆదేశించింది. అయితే, నాణ్యమైన సేవలను తన కస్టమర్లకు అందించనందుకు రిలయన్స్ జియోపై కూడా పెనాల్టీ విధించాల్సి ఉంటుందని, నాణ్యమైన సేవలందించే ప్రాథమిక బాధ్యతను ఇతరులపై మోపవచ్చా? అంటూ డీసీసీలో భాగమైన ఓ శాఖా కార్యదర్శి ప్రశ్నించగా... దీన్ని డీసీసీ సభ్యులు కొట్టిపారేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
డీసీసీలూ... పేర్లు పంపండి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కొత్త డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) నిర్ణయించింది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదుగురి పేర్లను తమకు పంపాలని డీసీసీ అధ్యక్షులకు సూచించింది. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో పీఈసీ సమావేశమైంది. ఈ భేటీకి కమిటీ సభ్యులు జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, డి.కె.అరుణ, రాజగోపాల్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, కుసుమకుమార్, షబ్బీర్‌అలీ, వి.హనుమంతరావు, దామోదర రాజనర్సింహ, చిన్నారెడ్డి, సంపత్, వంశీచంద్‌రెడ్డి, మధుయాష్కీ, కనుకుల జనార్దనరెడ్డి, సుధీర్‌రెడ్డి, నేరెళ్ల శారద, అనిల్‌కుమార్‌యాదవ్, బల్మూరి వెంకట్రావు, ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శులు శ్రీనివాసకృష్ణన్, బోసురాజు, సలీం అహ్మద్ హాజరయ్యారు. సమావేశంలో భాగంగా లోక్‌సభ స్థానాల వారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. ఒక్కో నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో పోటీకి అర్హులైన నేతల నుంచి వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిశీలించాలని నిర్ణయించారు. ఈ దరఖాస్తులను వడపోసే బాధ్యతలను డీసీసీ అధ్యక్షులకు అప్పగించారు. వచ్చిన దరఖాస్తుల వివరాలను డీసీసీ అధ్యక్షులకు పంపాలని, వీలైనంత త్వరలో ఆయా జిల్లాల అధ్యక్షులు ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదుగురు వరకు నేతల జాబితాను పీఈసీకి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపాదిత అభ్యర్థి పార్టీలో ఎంతకాలంగా ఉన్నారు.. ఆయన్ను లోక్‌సభకు పంప డానికి అర్హతలను కూడా డీసీసీ అధ్యక్షులు తమ జాబితాతో పాటు తెలపాలని సూచించా రు. డీసీసీల నుంచి ప్రతిపాదిత జాబితా వచ్చా క మరోమారు సమావేశమై ఏఐసీసీకి పంపే జాబితాను ఖరారు చేయాలని నిర్ణయించారు. 25న జరిగే అవకాశం... డీసీసీ అధ్యక్షులు తమ జాబితాలు పం పేందుకు నాలుగైదు రోజుల సమయం పట్ట నుండటం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతుండటం, కుంతియా కుమా రుని వివాహం ఉండటంతో ఈ నెల 25న మరోమారు పీఈసీ భేటీకి నిర్ణయించారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థుల షార్ట్‌లిస్ట్ జాబితా ను 25న రూపొందించి, దీనిపై స్క్రీనింగ్ కమిటీ చర్చించిన తర్వాత ఈనెలాఖరులో పు కసరత్తు పూర్తి చేయనున్నట్టు సమాచారం. -
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం
వరంగల్ : టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్వర్యంలో చేçపడుతున్న రెండో విడత ‘ప్రజా పరిరక్షణ చైతన్య బస్సుయాత్ర’ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈనెల 3న ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. హన్మకొండలోని కాంగ్రెస్ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 3న (మంగళవారం) సాయంత్రం బస్సుయాత్ర భూపాలపల్లికి చేరుకుంటుందన్నారు. 4న మధ్యాహ్నం 2గంటలకు స్టేషన్ ఘనపూర్, అదే రోజు సాయంత్రం 6గంటలకు పాలకుర్తిలో యాత్ర కొనసాగుతుందన్నారు. 5వ తేదీ సాయంత్రం 6గంటలకు నర్సంపేటలో కొనసాగించి వరంగల్‌లో రాత్రి బస చేస్తారని తెలిపారు. 6న పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలలో, 7వ తేదీన కొత్తగూడెం జిల్లా ఎల్లందు టేకులపల్లి, పినపాక మండలంలో యాత్ర కొనసాగుతుందన్నారు. 8న డోర్నకల్, మహబూబా బాద్‌లో యాత్ర నిర్వహిస్తారన్నారు. 9వ తేదీ ఉదయం భద్రాచలం వెంకటాపురంలో బిల్ట్ కార్మికులతో పీసీసీ బృందం చర్చిస్తుందని తెలిపారు. సాయంత్రం 5గంటలకు ములుగు సభలో పాల్గొంటారని, 10వ తేదీ సాయంత్రం 4 గం టలకు వర్ధన్నపేటలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అనంతరం బస్సు యాత్ర ముగుస్తుందన్నారు. బస్సుయాత్రను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విజయరామారావు, వేం నరేందర్‌రెడ్డి, కొండేటి శ్రీధర్, సీతక్క, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, నాయకులు ఇనుగాల వెంకట్రాంరెడ్డి, నమిండ్ల శ్రీనువాసు, రవళీ, రహత్ పర్వీన్, మహ్మద్ అయూబ్, కొత్తపెల్లి శ్రీనివాస్, బిన్ని లక్ష్మన్, రమణారెడ్డి, రోహిత్సింగ్ఠాకూర్, మండల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ బస్సు యాత్ర సందర్భంగా ఏర్పాటు చేయనున్న సభ జరిగే కేడీసీ మైదానాన్ని నాయకులు సందర్శించి పరిశీలించారు. -
కలవని మనసులు..!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతల్లో ఇకనైనా సఖ్యత కుదురుతుందా? గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికి ‘ఐ’క్యతారాగం వినిపిస్తారా? ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నేతల మధ్య చెలరేగిన విబేధాలు సద్దుమణుగుతాయా? అంటే.. కష్టమే అనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే. సీనియర్ కాంగ్రెస్ నేతలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు గ్రూపులుగా సాగుతుంటే.. ఏమీ పట్టని సీనియర్లు మరో గ్రూపు కింద జతకట్టేలా ఆ పార్టీ రాజకీయాలు తెరమీద కనిపిస్తున్నాయి. ప్రధానంగా మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ పొన్నం ప్రభాకర్ మధ్యన మొదలైన విబేధాలు రెండు గ్రూపులుగా కనిపిస్తున్నాయి. 13 నియోజకవర్గాలకు చెందిన పలువురు ఈ రెండు గ్రూపుల్లో కొనసాగుతుండగా... పార్టీ హైకమాండ్ ఆదేశాలు.. పార్టీ కార్యక్రమాలపరంగా ఈ రెండు గ్రూపులకు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కటకం మృత్యుంజయం కేంద్రబిందువు అవుతున్నారు. సీఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి నియోజకవర్గాన్ని చక్కదిద్దుకునే పనితోపాటు అధిష్టానం సూచనల మేరకు కార్యక్రమాలు చేస్తూ అందరితో కలిసిపోతున్నారు. 2014 ఎన్నికలో పోటీ చేసిన నేతలు, పార్టీ జాతీయ, రాష్ట్ర, జిల్లా కమిటీల్లో ఉన్న పలువురు సమయం, సందర్భాన్ని బట్టి గ్రూపులలో ‘ఇటుఅటు’గా వ్యవహరిస్తూ పార్టీలో నెట్టుకొస్తున్నారు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు సాగుతుండగా... తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సు చైతన్యయాత్ర ఉమ్మడి కరీంనగర్లో మూడు రోజులు సాగనుంది. ఈ నేపథ్యంలోనైనా ఆ పార్టీ నేతలు కలిసినడిచేనా..? అన్న చర్చ సాగుతోంది. 6, 7, 8 తేదీల్లో బస్సుయాత్ర.. రూట్‌మ్యాప్‌పై ఇంకా తర్జనభర్జన మరో రెండురోజుల్లో నిజామాబాద్ జిల్లానుంచి బస్సు చైతన్యయాత్ర జిల్లాలో ప్రవేశించనుంది. మూడురోజులపాటు జిల్లాలో ఈ యాత్ర సాగనుండగా, ప్రతిష్టాత్మకమైన బస్సు చైతన్యయాత్ర రూట్‌మ్యాప్‌కు తుదిరూపు రాలేదు. ఈ రూట్‌మ్యాప్ విషయంలో ఆ పార్టీ సీనియర్ల మధ్య ఉన్న గ్రూపు రాజకీయాల ప్రభావం ఉందన్న చర్చ కేడర్‌లో వినిపిస్తోంది. సాధారణంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడురోజుల యాత్ర పూర్వ కరీంనగర్లో అన్ని జిల్లాలు, కనీసం అన్ని నియోజకవర్గాలను కలిపేది విధంగా సాగాలని ఆశావహులు కోరుకుంటారు. మెట్పల్లి, సిరిసిల్ల, ఇల్లంతకుంట, మానకొండూరు, హుస్నాబాద్, హుజూరాబాద్‌కు చేరుకునేలా కొందరు ప్రతిపాదిస్తే... మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, కొడిమ్యాల, మల్యాల, కరీంనగర్, మానకొండూరు, హుజూరాబాద్‌ను మరికొందరు ప్రతిపాదించడమే ఇందుకు ఉదాహరణ. ఈ రెండు ప్రతిపాదనల్లో కూడా పెద్దపల్లి జిల్లా రామగుండం, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల ఊసులేదు. వీటిపైనా అనేక పార్టీ నేతలు, క్యాడర్లో అపొహలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం సాయంత్రం డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అధ్యక్షతన కరీంనగర్ పార్టీ కార్యాలయంలో సీనియ ర్ నాయకులు కొందరు సమావేశమయ్యారు. సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ విప్ ఆరెపల్లి మోహ న్, రేగులపాటి రమ్యరావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కవ్వంపల్లి సత్యనారాయణ, బొమ్మ శ్రీరాం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బస్సు చైతన్యయాత్ర, రూట్‌మ్యాప్‌లపై కొంతసేపు చర్చించినట్లు సమాచారం. ఆదివారంగానీ, సోమవారంగానీ రూట్‌మ్యాప్‌పై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రతిష్టాత్మకంగా బస్సు చైతన్యయాత్ర.. కమిటీల్లో జిల్లాకు చెందిన ఎనిమిది మంది.... టీపీసీసీ బస్సు చైతన్యయాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప్రజా చైతన్యయాత్రను 6, 7, 8 తేదీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు రోజులపాటు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో బస్సుయాత్ర సక్సెస్‌కు 49 మంది సీనియర్ నేతలతో రాష్ట్రస్థాయిలో వేసిన ఆర్గనైజింగ్, మీడియా కమిటీలలో అత్యధికంగా జిల్లాకు చెందిన ఎనిమిది మందికి ప్రాధాన్యత కల్పించారు. జిల్లాలో ఉన్న గ్రూపు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ అధిష్టానం అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం కలిగేలా వ్యవహరించింది. ఈ మేరకు టీపీసీసీ 31 మందితో నియమించిన ఆర్గనైజింగ్కమిటీలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద, టీపీసీసీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్, హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పాడి కౌశిక్‌రెడ్డి, రామగుండం నియోజకవర్గానికి చెందిన మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌ను నియమించారు. 18మందితో కూడిన మీడియా కమిటీలో జిల్లా నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధులుగా పనిచేస్తున్న రేగులపాటి రమ్యరావు, కొనగాల మహేష్, మాజీ ఎమ్మెల్సీ బి.కమలాకర్‌రావును నియమించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలకు నూతనోత్తేజం నింపేందుకు టీపీసీసీ ఈ యాత్రను తలపెట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ రూట్‌మ్యాప్ ఖరారు కాకపోగా, టీపీసీసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ ప్రజాచైతన్య యాత్రను ఏ మేరకు విజయవంతం చేస్తారనేది కేడర్‌లో చర్చనీయాంశంగా మారింది. -
కొత్త డీసీసీలు లేనట్లే
► ఇక నియామకమే అన్న తరుణంలో వాయిదా వేసిన అధిష్టానం ► సభ్యత్వం, సంస్థాగత నిర్మాణం తరువాతే అధ్యక్షుల నియామకం ► అప్పటిదాకా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా మహేశ్వర్‌రెడ్డి కొనసాగింపు సాక్షి, నిర్మల్: జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత కాంగ్రెస్ పార్టీలో కొత్త జిల్లాలకు జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) నియామకంలో దోబూచులాట కొనసాగుతోంది. త్వరలో డీసీసీ, బ్లాక్ కాంగ్రెస్ కమిటీల నియామకం జరుగుతుందని చెప్పడం, ఆ తరువాత వాయిదా వేయడం జరుగుతూ వస్తోంది. ఇటీవల మాత్రం నియామకాలు దాదాపు ఖరారయ్యే దశకు వచ్చినట్లు పార్టీలో చర్చ సాగింది. దీంతో ఆశావహుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. ఇలా డీసీసీలపై ప్రకటన ఎప్పుడు వెలువడుతుందని శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో తాజాగా అధిష్టానం ఈ ప్రక్రియను తాతాల్కికంగా వాయిదా వేసింది. దీంతో ఆశవాహుల పదవీ కాంక్షపై నీళ్లు చల్లినట్లైంది. సభ్యత్వం, సంస్థాగత నిర్మాణం తరువాతే కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం తరువాతే జిల్లాలకు డీసీసీలను నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఎం.రామచంద్రన్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సభ్యత్వ నమోదు పూర్తి చేసి సంస్థాగతంగా నిర్మాణం చేయాలనే పార్టీ ఎన్నికల కమిటీ నిర్ణయం మేరకు అధిష్టానం ఈ చర్యలకు దిగినట్లు పేర్కొంటున్నారు. సభ్యత్వ సేకరణ ఇదివరకే జరిగినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కేవలం 16 లక్షలు సభ్యత్వమే జరగడంతో దానిని మరింత పెంచాలని నిర్ణయించారు. అదేవిధంగా బూత్ లెవల్ నుంచి గ్రామ, మండల, బ్లాక్ కాంగ్రెస్, టీపీసీసీ, ఏఐసీసీ సభ్యుల నియామకాలు జరిపి సంస్థాగత నిర్మాణం చేసిన తరువాతే డీసీసీ అధ్యక్షులను నియమించాలని అధిష్టానం నిర్ణయించినట్లు చెబుతున్నారు. సెప్టెంబర్ 20 వరకు ఈ ప్రక్రియ పూర్తి చేసి డీసీసీలను నియమించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు. పలువురు ఆశవాహులు ఉమ్మడి జిల్లాకు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. జిల్లా ఇన్చార్జిగా సబితాఇంద్రారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత ఆయా జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకాల విషయంలో పార్టీ పరంగా గాంధీభవన్‌లో చర్చలు జరిగాయి. తెలంగాణ ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో జిల్లాల వారీగా చర్చలు చేశారు. మొదట్లో డీసీసీ అ«ధ్యక్షుడిగా నియమితులయ్యే వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని అధిష్టానం పేర్కొనడంతో పార్టీ నాయకుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. కాగా, తాజాగా ఆ నిబంధన విషయంలో అధిష్టానం దిగివచ్చింది. డీసీసీ అధ్యక్షులు కూడా ఎన్నికల్లో పోటీ చేయవచ్చునని ప్రకటించడంతో ఇప్పుడు జిల్లాల్లో పలువురు ప్రధాన నేతలు కూడా పదవిపై ఆశలు పెంచుకున్నారు. కాగా, అంతకుముందు పలువురు ఉమ్మడి జిల్లా నేతలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డినే ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగించాలని అ«ధిష్టానాన్ని కోరారు. అయితే జిల్లాల వారీగా ఎప్పటికైనా అధ్యక్షుల నియామకం చేయాల్సిందేనని, ఈ నేపథ్యంలో మహేశ్వర్‌రెడ్డిని ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా నియమించే విషయంలో అధిష్టానం వద్ద చర్చలు సాగినట్లు నాయకులు పేర్కొంటున్నారు. అదే సమయంలో నిర్మల్ జిల్లాకు రామారావుపటేల్, తక్కల రమణారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాకు భార్గవ్‌దేశ్‌పాండే, గండ్రత్ సుజాత, నరేశ్‌జాదవ్, మంచిర్యాల జిల్లాకు అరవిందరెడ్డి, ప్రేమ్‌సాగర్, కుమురంభీంకు ఆత్రం సక్కు, సిడాం గణపతి పేర్లు పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి మహేశ్వర్రెడ్డికే పగ్గాలు సెప్టెంబర్ చివరిలో లేనిపక్షంలో అక్టోబర్‌లో కొత్త జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించే అవకాశాలు ఉన్నాయి. అప్పటివరకు ఉమ్మడి జిల్లాలో మహేశ్వర్‌రెడ్డి చేతిలోనే పగ్గాలు ఉండనున్నాయి. ఇదిలాఉంటే జూన్‌లో హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలలో ఎవరైనా ఈ సభకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంటున్నారు. దీంతో ఈ సభను విజయవంతం చేసేందుకు పార్టీ అధిష్టానం పాతకాపులపైనే నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా పరంగా ఇదివరకు నిర్మల్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను రాహుల్‌గాంధీ పరామర్శించే పర్యటనను విజయవంతం చేయడంతో పాటు ఆదిలాబాద్, నిర్మల్‌లో రైతులు, విద్యార్థుల కోసం నిరాహార దీక్షలు చేపట్టి భారీ సభలు నిర్వహించిన దృష్ట్యా మహేశ్వర్రెడ్డిపైనే భరోసా ఉంచి జిల్లా నుంచి సభకు పెద్ద ఎత్తున శ్రేణులను సమీకరించే బాధ్యత ఉంచినట్లు తెలుస్తోంది. -
బీజేపీ, టీడీపీలకు రోజులు దగ్గర పడ్డాయి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : బీజేపీ, టీడీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని.. ఆపార్టీ నాయకులను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని మాజీ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ షాజహాన్‌బాషా పేర్కొన్నారు. శుక్రవారం డీసీసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలు రోడ్డున పడ్డారన్నారు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఆర్బీఐ, ఆర్థిక మంత్రి సలహాలు, సూచనలు తీసుకోకపోవడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. సుప్రీం కోర్టు 700 మంది నల్లకుబేరుల పేర్ల జాబితాను ప్రకటించినప్పటికీ ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. తాను చెబితేనే రూ 500,1000 నోట్లు రద్దు చేశారని గొప్పలు చెప్పుకున్న సీఎం చంద్రబాబు రాష్ట్రానికి కావాల్సినంత నగదును రప్పించడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. 50 రోజుల వరకు కష్టాలుంటాయని చెప్పిన ప్రభుత్వాలు..ఈ తర్వాత కష్టపెడితే 51వ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఆ«ధ్వర్యంలోబ్యాంకుల వద్ద ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ïడీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, పీసీసీ జనరల్ సెక్రటరీ సత్తార్, జాయింట్ సెక్రటరీ చంద్రశేఖర్‌రెడ్డి, సేవాదళ్ ఛైర్మన్ చార్లెస్, విజయభాస్కర్, జోడు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
డీసీసీ అధ్యక్షుడిగా పంతం నానాజీ
కాకినాడ : జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పంతం నానాజీ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎ¯ŒS.రఘువీరారెడ్డి శుక్రవారం సాయంత్రం నియామక ఉత్తర్వులు జారీచేశారు. ఇంతవరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసిన కందుల దుర్గేష్ ఇటీవల పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో పంతం నానాజీని నియమించారు. 1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నానాజీ జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, కాకినాడ నగర అధ్యక్షుడిగా, పీసీసీ కార్యదర్శిగా పలు పదవులు నిర్వర్తించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ హస్త కళల అభివృద్ధి సంస్థ చైర్మ¯ŒSగా పనిచేశారు. ప్రస్తుతం పీసీసీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ పటిష్టతే లక్ష్యంగా సీనియర్ నాయకుల సూచన మేరకు పనిచేస్తానన్నారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి పార్టీ ప్రతిష్ట ఇనుమడింప చేస్తానన్నారు. -
నూతన జిల్లాల పేరుతో మోసం
గుండాల : ప్రజా సమస్యలను పక్కనబెట్టి నూతన జిల్లాల ఏర్పాటు పేరుతో ప్రజలను మోసగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్ ఆరోపించారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ వసతి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాభిప్రాయం మేరకు నూతన జిల్లాలు, నూతన మండలాలు ఏర్పాటు చేస్తామని ప్రకటనలు చేస్తూనే అశాస్త్రీయంగా, అస్తవ్యస్తంగా నూతన జిల్లాల ఏర్పాటు కొనసాగుతుందన్నారు. భువనగిరితో 70 సంవత్సరాల శాస్త్రీయ సంప్రదాయ సంబంధాలు కలిగిన గుండాల మండలాన్ని ఆలేరు నియోజకర్గం నుంచి జనగామలో కలపడం సిగ్గుచేటని విమర్శించారు. గుండాల మండలంలోని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు వార్డు సభ్యుల నుంచి మొదలు కొని ఎంపీపీ, జెడ్పీటీసీల వరకు రాజీనామా చేసి ఆమోదింపజేసుకుంటేనే ప్రభుత్వంలో చలనం కలిగి గుండాల మండలాన్ని యాదాద్రిలో కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులచే రాజీనామాలు చేయించి ఆమోదింప చేయించుకునే బాధ్యత తమదేనన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అ«ధ్యక్షుడు బబ్బూరి సుధాకర్, డీసీసీబీ డైరెక్టర్ దుంపల శ్రీనువాస్, తుర్కలషాపురం సర్పంచ్ పురుగుల మల్లయ్య, ఎంపీటీసీ సభ్యులు బూడిద రాములు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు రాజరత్నం, నాయకులు బండారు వెంకటేష్, బిక్షం, తదితరులు ఉన్నారు. -
ప్రజలను మోసగిస్తున్న టీఆర్ఎస్ సర్కార్
ఆలేరు : రాష్ట్రంలోని టీఆర్ఎస్ సర్కార్ సాధ్యంకాని హామీలతో ప్రజలను మోసం చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ ఆరోపించారు. ఆలేరులోని ఇందిరాకాంగ్రెస్ భవనంలో ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు, డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో అవగాహన లేక హామీ ఇచ్చానని ఇటీవల సీఎం కేసీఆర్ పేర్కొనడం ఇందుకు నిదర్శనమన్నారు. జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. గతేడాది పంటలను నష్టపోయిన రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.972 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తే ఆ నిధులను ప్రభుత్వం వేరే పనులకు మళ్లించడం సిగ్గుచేటన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రభుత్వం పరిహారం అందించాలని కోరారు. ప్రభుత్వం చేసే తప్పిదాలను గ్రామస్థాయి నుంచి ఎండగడుతామని హెచ్చరించారు. సమావేశంలో జనగాం ఉపేందర్‌రెడ్డి, జూకంటి రవీందర్, కొలుపుల హరినాథ్, ఎంఎస్ విజయ్‌కుమార్, నీలం పద్మ, ఎండీ.జైనోద్దీన్, కె.సాగర్‌రెడ్డి, ఎంఏ.ఎజాజ్, జూకంటి ఉప్పలయ్య, నీలం వెంకటస్వామి, ఇల్లెందుల మల్లేశ్, గ్యాదపాక నాగరాజు, సిరిగిరి సాగర్, భీజని మధు పాల్గొన్నారు. -
రైతుల సమస్యలను విస్మరిస్తున్న ప్రభుత్వం
యాదగిరిగుట్ట : రైతన్నల సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తుందని డీసీసీ అధ్యక్షులు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. యాదగిరిగుట్టలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బతుకమ్మ, పుష్కరాలు, బోనాల పండుగలకు రూ. కోట్లు ఖర్చు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, రాష్ట్రంలో అన్నదాతలు రుణామాఫీలు చేయడంలో వెనుకడుగు ఎందుకు వేస్తుందని ప్రశ్నించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా పాలన చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా రాష్ట్రంలో సగం మంది రైతుల రుణాలు మాఫీ చేయలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసే మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు శాస్త్రీయ పద్ధతిలో చేయాలని ప్రభుతాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీర్ల అయిలయ్య, గుండ్లపల్లి భరత్‌గౌడ్, ఎంపీటీసీ సాధూనేని మ«ధుకర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కానుగు బాలరాజు గౌడ్, శివరాత్రి దానయ్య, గడ్డమీది మాధవులు, బాలయ్య, గుజ్జ శ్రీనివాస్, పెలిమెల్లి చిన్నవెంకట్, కరణ్‌గౌడ్ తదితరులున్నారు. -
ప్యాకేజీ పేరిట బీజేపీ, టీడీపీల వంచన
డీసీసీ అధ్యక్షుడు కందుల ధ్వజం ప్రత్యేకహోదా కోసం నిరశన దీక్ష రాజమహేంద్రవరం సిటీ : ప్యాకేజీల పేరుతో బీజేపీ, టీడీపీలు రాష్ట్ర ప్రజలను మోసం చేశాయని డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ విమర్శించారు. ప్రత్యేక హోదా సాధనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. శనివారం ప్రత్యేక హోదా సాధనకు ఆయన రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్లో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాప్రయోజనాలే తమను ముఖ్యమని, అందుకే తన పుట్టినరోజు వేడుకలను త్యజించి హోదా కోసం నిరసన వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. ప్రత్యేక హోదా చచ్చిపోయిందన్న సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ వాఖ్యలను ఆయన విజ్ఞతకే వదలివేస్తున్నానన్నారు. భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి రావాలంటే ప్రత్యేక హోదా ఇచ్చి ప్రజల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించుకోవాలన్నారు. ప్రత్యేక హోదా కోసం పోస్ట్‌కార్డుల ఉద్యమంగా చేపట్టి, కార్డులు వేసేందుకు బాక్స్ ఏర్పాటు చేశారు. సాయంత్రం కాంగ్రెస్ నాయకులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. దుర్గేష్ నిరశన దీక్షకు వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, సిటీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివరామసుబ్రమణ్యం, కాంగ్రెస్ శిక్షణా శిబిరాల రాష్ట్ర ౖచెర్మన్ రామినీడి మురళి, కాంగ్రెస్ నాయకులు ఎన్వీ శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బోడా వెంకట్,కార్పొరేటర్ రాయుడు సతీష్ తదితరులు సంఘీభావం తెలిపారు. -
జనగామలో కలపడం సరికాదు
రాజాపేట : ఆలేరు, రాజాపేట, గూండాల మండలాలను జనగామలో కలిపితే ప్రజా ఉద్యమమే నిర్వహింస్తామని డీసీసీ ప్రసిడెంట్ బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. శనివారం మండలంలోని పాముకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆలేరు, రాజాపేట, గూండాల మండలాల ప్రజలు, రైతులు గత కొన్న సంవత్సరాల నుంచి భువనగిరి డివిజన్‌తో అనుబంధాన్ని కలిగి ఉంన్నారని, నేడు ఈ మండలాలను జనగామలో కలిపేందుకు చూస్తున్న ప్రభుత్వ ఆలోన సరైందికాదన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ గంగలో కలిసాయని, ఎప్పటికప్పుడు కాకి లెక్కలు చెబుతూ కాలం వెళ్లదీస్తు ప్రజలను మభ్యపెడుతున్నాడని విమర్శించారు. కరువుతో రైతులు అప్పులపాలు అవతున్నారని, వారిని వెంటనే అదుకోవాలని కోరారు. మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నీలం పద్మ, మండల పార్టీ అధ్యక్షుడు నెమిల మహేందర్‌గౌడ్, మహిళా అధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, నాయకులు రాంరెడ్డి, ఎన్.వెంకటస్వామి, ఏ.బాలయ్య, పి.యాదయ్య, శ్రీరాములు పాల్గొన్నారు. -
వైఎస్సార్ ప్రాజెక్టులనే రీడిజైన్ చేస్తున్న సీఎం
మోత్కూరు : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. శుక్రవారం మోత్కూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాజశేఖర్‌రెడ్డి సుమారు 75 ప్రాజెక్టులు చేపట్టారని తెలిపారు. వీటిలో కొన్ని ప్రాజెక్టులు పూర్తికాగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు రీడిజైన్ చేసి రాజశేఖర్‌రెడ్డి పేరు మరిపించడానికి కేసీఆర్ కుట్రచేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో ఎంపీటీసీలు కూరిమిళ్ల ప్రమీళ, ముద్దం జయశ్రీ, మాజీ సర్పంచ్‌లు కె.వెంకటేశ్వర్లు, గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి, కల్యాణ్‌చక్రవర్తి, బుంగపట్ల యాకయ్య, ఎండి. అయాజ్, జహంగీర్‌పాషా తదితరులు ఉన్నారు. -
డీసీసీ అధ్యక్షుడిగా ధనేకుల
విజయవాడ సెంట్రల్ : కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పెనమలూరుకు చెందిన ధనేకుల మురళీకృష్ణను నియమిస్తూ ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. మురళీకృష్ణ పెనమలూరు నుంచి 1987లో ఎంపీపీగా, 2000లో జెడ్పీటీసీ సభ్యుడిగా కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. పెనమలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌లో పీఆర్పీపీ విలీనం నేపథ్యంలో తిరిగి సొంతగూటికి చేరారు. ప్రస్తుతం ఏపీసీసీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. మురళీకృష్ణ రాజ్యసభ సభ్యుడు చిరంజీవితో సన్నిహిత సంబధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన్ను డీసీసీ అధ్యక్షుడిగా నియమించినట్లు తెలిసింది. సామాజిక కోణంలో కూడా ఇప్పటివరకు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కడియాల బుచ్చిబాబు స్థానాన్ని భర్తీ చేసేందుకు మురళీకృష్ణ తెరపైకి తెచ్చినట్లు భావిస్తున్నారు. -
సీఎం కేసీఆర్‌ది సెంట్మెంట్ పాలన
♦ కాళేశ్వరం నీళ్లు తర్వాత.. ముందు పంట రుణాలు మాఫీ చేయి.. ♦ ఒకేసారి రుణమాఫీ చేసిన ఘనత వైఎస్సార్‌దే ♦ కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముదిరెడ్డి కోదండరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ ♦ యాచారంలో ఎండిపోయిన మొక్కజొన్న పంటల పరిశీలన యాచారం: తెలంగాణలో సీఎం కేసీఆర్ సెంట్మెంట్ పరిపాలన చేస్తున్నారని, మాయమాటలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నాడని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముదిరెడ్డి కోదండరెడ్డి మండిపడ్డారు. గురువారం డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌తో కలిసి యాచారం, చౌదర్పల్లి తదితర గ్రామాల్లో ఎండిపోయిన మొక్కజొన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం నీళ్లు తెచ్చేది దేవుడెరుగు.. ముందు పూర్తిగా రుణమాఫీ చేసి రైతుల కాళ్లు కడిగి ఓట్లేసిన వారి రుణం తీసుకోవాలని సూచించారు. బ్యాంకుల్లో అప్పులివ్వకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి రుణాలు తెచ్చి అప్పులపాలవుతున్నారన్నారు. తెలంగాణలో 37 లక్షల మంది రైతులు, మూడున్నర లక్షల మహిళా రైతులు రుణమాఫీ పూర్తి అమలు కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. దేశ చరిత్రలో ఒకేసారి రుణమాఫీ వర్తింపజేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కే దక్కిందన్నారు. తెలంగాణలో మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇస్తానన్న రూ. ఆరు లక్షల పరిహారం కేవలం 230 మందికే ఇచ్చి చేతులుదులుపుకున్నారన్నారు. ఆలస్యంగా కురిసిన వర్షాలకు మొక్కజొన్న పంట పూర్తిగా ఎండిపోయిందని, అధికార యంత్రాంగం తక్షణమే సర్వే చేసి ఎండిపోయిన పంటకు ఎకరారు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇన్పుట్ సబ్సిడీ తక్షణమే ఇవ్వాలి: క్యామ మల్లేష్ గతేడాది రైతులకు అందజేయాల్సిన ఇన్పుట్ సబ్సిడీని తక్షణమే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ డిమాండ్ చేశారు. జిల్లాలోని వేలాది మంది రైతులకు రూ.80 కోట్లకు పైగా ఇన్పుట్ సబ్సిడీ అందించాల్సి ఉందన్నారు. వరుసగా మూడేళ్లు జిల్లా తూర్పు డివిజన్లో వర్షాల్లేక తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తక్షణమే రైతాంగాన్ని ఆదుకోవడం కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బోరుబావులు ఎండిపోయి, కృష్ణాజలాలు సరిపడా సరఫరా కాక ప్రజలకు సైతం తాగునీరు అందని దుస్థితి ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధికార ప్రతినిధి అన్వష్రెడ్డి, ఇబ్రహీంపట్నం డివిజన్ కిసాన్ సెల్ అధ్యక్షుడు కాలె మల్లేష్, ఇబ్రహీంపట్నం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పడాల శంకర్‌గౌడ్, యాచారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దెంది రాంరెడ్డి, నక్కర్తమేడిపల్లి, గడ్లమల్లయ్యగూడ సర్పంచ్‌లు పాశ్ఛ భాషా, నర్రె మల్లేష్, టీడీపీ మండల అధ్యక్షుడు గౌర మల్లేష్, నాయకులు లక్ష్మయ్యగౌడ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం
ఆలేరు : రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను దగా చేస్తుందని డీసీసీ అధ్యక్షులు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. ఆలేరులో మంగళవారం జరిగిన మండల కాంగ్రెస్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నో ఆశలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఆశలు ఆడియాసలయ్యాయని విమర్శించారు. పుష్కరాలు, పండుగలు, వేడుకల పేరిట ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందన్నారు. ప్రజాధనాన్ని అడ్డగోలుగా ఖర్చు పెట్టి వేల కోట్ల రూపాయలను అప్పుగా తెచ్చి రాష్ట్రాన్ని దివాల తీస్తున్నారని విమర్శించారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలో ప్రభుత్వం వివక్ష కనబరుస్తుందని, పంటలు ఎండిపోతున్న ప్రభుత్వానికి పట్టకపోవడం సిగ్గుచేటన్నారు. త్వరలో రైతు సమస్యలపై ఆమరణ నిరాహార దీక్ష చేపడుతామని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదన్నారు. డీసీసీబీ మాజీ డైరెక్టర్ జనగాం ఉపేందర్‌రెడ్డి అ«ధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కొలుపుల హరినా«ద్, కె సాగర్‌రెడ్డి, నీలం పద్మ, ఎండి జైనోద్దీన్, ఎగ్గిడి యాదగిరి, ఎంఎస్ విజయ్‌కుమార్, జంపాల దశరధ, పిల్లలమర్రి శంకరయ్య, ఎంఎ ఎజాజ్, నీలం వెంకటస్వామి, కందుల శంకర్, జూకంటి ఉప్పలయ్య, ఎలగల కృష్ణ, దూసరి విజయ, బేతి రాములు, బండి నాగయ్య, ముదిగొండ శ్రీకాంత్, పత్తి వెంకటేశ్, పల్లె సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
జనగామ జిల్లా ఇక్కడి ప్రజల హక్కు
నర్మెట : జనగామ జిల్లా ఈ ప్రాంత ప్రజల హక్కు అని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. జనగామను జిల్లా చేయాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బొత్తలపర్రె–బొంతగట్టునాగారంలోని ఏడుపోచమ్మ దేవాలయం వద్ద నుంచి నర్మెట వరకు సోమవారం పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ జనగామను 11వ జిల్లాగా ఏర్పాటు చేస్తానని ప్రగల్భాలు పలికి మాట తప్పుతున్నారన్నారు. ప్రత్యేక తెలంగాణ లో ఎంసెట్–2 లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలు బయటపడకుండా ఉండేందుకే జిల్లాల పునర్విభజన తెరపైకి తెచ్చారని చెప్పారు. అనంతరం తహసీల్దార్ నర్సయ్యకు పలు వినతులతో కూడినపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు బనుక శివరాజ్‌యాదవ్, కీసర దిలీప్‌రెడ్డి, మంసంపల్లి లింగాజీ, తేజావత్ గోవర్ధన్, బొక్క సుజయ్, మండల అధ్యక్షుడు భూక్య జూంలాల్, అర్జుల సుధాకర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కళ్యాణం లలిత ము రళి, ఎంపీటీసీ సంపత్, గాదర సందీప్, వేముల అంజయ్య తదితరులు ఉన్నారు. -
పథకాలన్నీ కాంగ్రెస్‌వే :భిక్షమయ్యగౌడ్
యాదగిరిగుట్ట : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినవేనని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. సోమవారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకే కొత్తపేర్లతో ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నారని విమర్శించారు. తొలి సారిగా రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నిధులు ఏ మాత్రం ప్రకటించకున్నా తనపై సీబీఐ కేసులు బయటకి రాకుండా ఉండడానికే సీఎం ప్రధానిని పొగడ్తలతో ముంచెత్తారని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ సాధించిన శక్తులే కేసీఆర్ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడుతున్నాయన్నారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్‌గౌడ్, గుండ్లపల్లి నర్సింహగౌడ్, గుడ్ల వరలక్ష్మీ, కలకుంట్ల బాలనర్సయ్య, పెలిమెల్లి శ్రీధర్‌గౌడ్, తంగళ్లపల్లి సుగుణాకర్, కానుగు బాలరాజు, షంషీర్‌పాషా, బొజ్జ సాంబేష్ ఉన్నారు. -
ప్రజల పక్షాన ఉద్యమిస్తాం : భిక్షమయ్యగౌడ్
చిట్యాల : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలిచి గ్రామగ్రామాన ఉద్యమిస్తామని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ పేర్కొన్నారు. చిట్యాలలో శనివారం ఆయన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలను విస్మరించారన్నారు. నేటికీ రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదని, రైతుల ఆత్మహత్యలు ఆగటం లేదని, విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్ అందటం లేదని, ప్రాజెక్టుల నిర్మాణాలు ముందుకు సాగటం లేదని దుయ్యపట్టారు. ఈ సమావేశంలో ఆ పార్టీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, ఎంపీటీసీలు మెండె సుజాత, జిట్ట పద్మ తదితరులు పాల్గొన్నారు. -
హామీలను విస్మరించిన సీఎం
తుర్కపల్లి : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రోజుకో రకం మాటలతో ఇటు రైతులను, ప్రజలను మభ్య పెడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. గురువారం తుర్కపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో అయన మాట్లాడారు. పార్లమెంట్లో అమలు చేసిన 2013 చట్టాన్ని కాదని, 123 జీఓ విడుదల చేయడంపై హైకోర్టు మొట్టికాయలే యడం ప్రభుత్వ భంగపాటు కాదా అని అన్నారు. రైతుల నుంచి భూసేకరణ ప్రజస్వామ్య పద్ధతిలో జరగాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బబ్బూరి రవీంధ్రనా«ద్గౌడ్, ధానవత్ శంకర్‌నాయక్, ఎంపీటీసీ సభ్యులు బద్దూనాయక్, రాజయ్య, నాయకులు ఎలగల రాజయ్య, గడ్డమీది సత్యనారాయణ, పత్తిపాటి హన్మంత్‌రావు, బోరెడ్డి హన్మంత్‌రెడ్డి, బోరెడ్డి మహిపాల్‌రెడ్డి, భూక్య రాజారాం పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రజాకారుల పాలన
ఆత్మకూరు(ఎం) : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలన చూస్తుంటే రజాకారుల పాలన తలపిస్తుందని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్ విమర్శించారు. శనివారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులకు ఏనాడు వ్యతిరేకం కాదన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రతి పక్షాల నాయకులను అరెస్టు చేసి భయభ్రాంతులకు గురిచేస్తుందన్నారు. దళితులకు మూడు ఎకరాల భూపంపిణీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంసెట్–2 పరీక్ష లీకేజీకి ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి, సంబంధిత ఇద్దరు మంత్రులు పదవులకు రాజీనామా చేయాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొడిత్యాల నరేందర్ గుప్తా, సింగిల్ విండో చైర్మన్ జిల్లాల శేఖర్‌రెడ్డి, నాయకులు యాస లక్ష్మారెడ్డి, కందడి అనంతరెడ్డి, ముద్దసాని సిద్దులు, కట్టెకోల హన్మంతు గౌడ్, బొడిగె భిక్షపతి, యాదగిరి ఉన్నారు. -
ప్రత్యేక హోదా బిల్లుకు మద్దతు ఇవ్వకపోవడం దారుణం
ఆగస్టు 5న చర్చల్లోనైనా మద్దతు ఇవ్వలంటూ ధర్నా డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం సిటీ : ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనకు పార్లమెంట్లో కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన బిల్లుకు టీడీపీ, బీజేపీలు మద్దతు తెలపక పోవడడం దారుణమని, ఇప్పటికైనా స్పందించి ప్రత్యేక హోదా సాధనకు పార్టీలకు అతీతంగా కృషి చేయాల్చి ఉందని డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ డిమాండ్ చేశారు. శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం కంబాలచెరువు సెంటర్లో చేపట్టిన ఆందోళనలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఇప్పటికైనా హోదా తెచ్చేందుకు సానుకూలంగా ఉంటే ఆగస్టు 5న మరోసారి పార్లమెంట్లో బిల్లు చర్చకు రానుందని, అప్పుడైనా ఇరుపార్టీలు దాటవేత ధోరణిమాని మద్దతు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాయుడు సతీష్, దాసి వెంటకరావు, కొళ్ళి మళ్ల రఘు, ముళ్ళ మాధవ్, గోలిరవి ,చిక్కాల బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఓటేయకపోతే ఎంపీల ఇంటి ఎదుట ధర్నా
కర్నూలు(ఓల్డ్‌సిటీ): రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశ పెట్టే ప్రై వేటు బిల్లుకు అనుకూలంగా ఓటేయ్యని ఎంపీల ఇళ్ల ఎదుట ధర్నా చేస్తామని డీసీసీ అధ్యక్షుడు బీవై రామయ్య హెచ్చరించారు. గురువారం స్థానిక కళావెంకట్రావ్ భవనంలో ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధనకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాలు, మట్టి సత్యాగ్రహం కార్యక్రమాలు ప్రధాని కార్యాలయాన్నే కుదిపేశాయన్నారు. శుక్రవారం కేవీపీ ప్రవేశ పెట్టే బిల్లులకు ఏపీ ఎంపీలు అనుకూలంగా ఓటింగ్ చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. జిల్లాలోని ఇద్దరు ఎంపీలు, రాజ్యసభ సభ్యుడు బిల్లుకు మద్దతు ఇవ్వాలన్నారు. ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది మొదట్నుంచీ కప్పదాటు వ్యవహారమేనని విమర్శించారు. ప్రై వేట్ బిల్లుకు మద్దతు తెల్పుతామని రెండు నెలల క్రితమే చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం మాట మార్చి, దేశంలో ఎప్పుడైనా ప్రై వేట్ బిల్లు చట్టమైందా అని మాట్లాడటం ఆయనకే చెల్లిందన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, పీసీసీ కార్యదర్శి సర్దార్ బుచ్చిబాబు, జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, కాంగ్రెస్ నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, నారాయణరెడ్డి, తిప్పన్న, సలాం, ఖలీల్‌బాష, శ్రీనివాసరెడ్డి, విజయభాస్కరరెడ్డి, ఎస్సీసెల్ సత్యరాజు తదితరులు పాల్గొన్నారు. -
తీరు మారలేదు!
- డీసీసీ సమావేశంలో నేతల మధ్య మాటల తూటాలు - సీనియర్ల తీరును తప్పుబట్టిన శ్రేణులు సాక్షి, రంగారెడ్డి జిల్లా: అధికారం కోల్పోయినా కాంగ్రెస్ నేతల తీరు మారలేదు. సీనియర్ల మధ్య గ్రూపులు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం జరిగిన జిల్లా కాంగ్రెస్ కమిటీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఇది స్పష్టంగా కనిపించింది. వ్యంగ్యాస్త్రాలు.. పరోక్ష విమర్శలతో నేతలు ఒకరికొకరు చురకలంటించుకున్నారు. ఏకంగా ఏఐసీసీ పరిశీలకులు కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమక్షంలో నేతల మధ్య విభేదాలు బహిర్గతం కావడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీని విజయపథం వైపు నడపాలనే ప్రధాన అంశంతో సాగిన ఈ సమావేశం కాస్త నేతల విమర్శలు, ప్రతివిమర్శల మధ్యే ముగిసింది. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసుకుని టిక్కెట్లు తెచ్చుకోవడం కాదంటూ డీసీసీ అధ్యక్షుడిపై పరోక్ష విమర్శలకు దిగడంతో సభలో కొంత గందరగోళం జరిగింది. ఇంతలో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ కల్పించుకుంటూ టిక్కెట్లు ఎవరికివ్వాలనే నిర్ణయం ఢిల్లీలోనే తీసుకుంటారంటూ స్పందించారు. దీంతో ఇరువర్గాల మధ్య కొంత ఘర్షణవాతావరణం చోటుచేసుకుంది. సభ్యత్వ నమోదులో వెనుకబడడానికి కూడా నాయకత్వలోపమే కారణమని మల్రెడ్డి వ్యాఖ్యానించడం.. దీనికి కొనసాగింపుగా కొట్టేలా మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మాట్లాడడం సభలో వాతావరణాన్ని వేడెక్కించింది. చురుకైన నేతలకే పట్టం: కుంతియా పార్టీ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొనే నేతలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని ఏఐసీసీ కార్యదర్శి కుంతియా పేర్కొన్నారు. సోమవారం జరిగిన జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదులో కీలక పాత్ర పోషించిన వారికి పదవులతోపాటు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తామన్నారు. సభ్యత్వ నమోదును విజయవంతం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సభ్యత్వ నమోదుకు గడువు మే 15గా నిర్ణయించామన్నారు. డిసెంబర్లో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీని అధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 30న పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటన ఉందన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉందని, ఎన్నికల్లో ఓటమికి కారణాలు విశ్లేషించి సరిదిద్దుకోవాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, మాజీ మంత్రులు పి.సబితారెడ్డి, జి.ప్రసాద్‌కుమార్, మాజీ ఎంపీలు సర్వే సత్యనారాయణ, కె.రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, భిక్షపతియాదవ్, కూనశ్రీశైలం, సీనియర్ నాయకులు కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇక చాలు.. నన్ను తప్పించండి : తూడి దేవేందర్‌రెడ్డి
డీసీసీ రేసులో భిక్షమయ్యగౌడ్, చిరుమర్తి లింగయ్య, రాపోలు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గాంధీభవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి రామచంద్రకుంతియా, పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యల సమక్షంలో శుక్రవారం జరిగిన సమావేశంలో భాగంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ వ్యక్తిగత కారణాల వల్ల తాను పార్టీ జిల్లా బాధ్యతలను మోయలేనని, గతంలో తాను ఇచ్చిన రాజీనామాను ఆమోదించి, తనను బాధ్యతల నుంచి తప్పించాలని పార్టీ అధినాయకత్వాన్ని కోరారు. తూడి విజ్ఞప్తి పట్ల పార్టీ నాయకత్వం కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. తూడిని తప్పిస్తే మాజీ ఎమ్మెల్యేలు భిక్షమయ్యగౌడ్, చిరుమర్తి లింగయ్య, మునుగోడుకు చెందిన రాపోలు జయప్రకాశ్‌లలో ఒకరిని డీసీసీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా తూడి మాట్లాడుతూ ఎలాంటి వివాదాలకు తావు లేకుండా మూడేళ్ల పాటు జిల్లా పార్టీ బాధ్యతలు నిర్వర్తించానని, తనకు సహకరించిన, సహకరించని నాయకులందరికీ కృత జ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఎలాంటి చందాలు, పైరవీలకు అవకాశం లేకుండా పార్టీ బాధ్యతలు మోసానని, తాను బాధ్యతల నుంచి తప్పుకున్నా పార్టీకి పూర్తి స్థాయి సహకారం అందిస్తానని, అసంపూర్తిగా ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ భవనాన్ని కూడా పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. తూడి గురించి జానా మాట్లాడుతూ బాగా పనిచేశాడని కితాబిచ్చినట్టు సమాచారం. అయితే, తూడి తన ప్రసంగంలో భాగంగా పీసీసీ, ఏఐసీసీ నేతల పనితీరును కూడా ప్రశ్నించారు. మనం అధికారం కోసమే తెలంగాణ ఇచ్చామనే విధంగా జరిగిన ప్రచారం దెబ్బతీసింది. ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ఇచ్చామన్నది మరిచిపోయారు. పార్టీలో స్టేట్స్‌మెన్ తగ్గిపోయి లీడర్లే మిగిలారు. తెలంగాణ ప్రకటన చేసిన తర్వాత రాష్ట్రం ఇవ్వకుండా జాప్యం చేసి ఇరువైపులా నష్టపోయారు. అయినా టీఆర్ఎస్ అధినేత దీక్షకు స్పందించి రాష్ట్ర ప్రకటన చేయడమేంటి?* అని ఆయన ప్రశ్నించినట్టు సమాచారం. -
బాబూ! నీ రాజకీయ చిరునామా కాంగ్రెస్ భిక్షే
కాకినాడ : టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు రాజకీయంగా చిరునామాను ఇచ్చింది కాంగ్రెస్సేనన్న వాస్తవాన్ని మరిచి మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) నూతన అధ్యక్షుడు కందుల దుర్గేష్ విమర్శించారు. డీసీసీ సారథిగా కందుల సోమవారం కాకినాడలోని పార్టీ కార్యాలయం కళా వెంకట్రావు భవనంలో సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. తొలుత పార్టీ కార్యాలయం రిజిస్టర్లో సంతకం చేసిన అనంతరం ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపిన పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిని చంద్రబాబు అడ్రస్‌లేని పార్టీకి అధ్యక్షుడివనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్ఈజడ్ భూముల్ని వెనక్కి తీసుకుంటామన్న చంద్రబాబు ఇప్పుడు మాటమార్చి అక్కడ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయనడాన్ని తప్పుపట్టారు. ఇకపై తమపార్టీ ప్రజల సమస్యలపై పోరాడుతుందని, జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. రాజకీయ మార్పునకు నాందిగా పేరున్న తుని నుంచి ఈ నెల 19న గ్రామ పర్యటనలకు శ్రీకారం చుడతామన్నారు. ప్రతి నెలా 5న క్రమం తప్పకుండా డీసీసీ సమావేశం నిర్వహిస్తామన్నారు. అన్ని ప్రాంతాలు, సామాజిక వర్గాలకు సమాన ప్రాధాన్యమిస్తూ త్వరలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీ జిల్లా ఇన్చార్జి, మాజీ మంత్రి బాలరాజు మాట్లాడుతూ దుర్గేష్ నాయకత్వంలో పార్టీ బలోపేతం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ రత్నాబాయి, మాజీ ఎంపీ ఏజేవీ బుచ్చిమహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పంతం నానాజీ, పీసీసీ కార్యదర్శి ఎస్ఎన్ రాజా, పార్టీ నేతలు కామన ప్రభాకరరావు, డోకల మురళి, రామినీడు మురళి, ఆకుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కూలబడ్డ రథానికి కొత్త సారథి
సాక్షి ప్రతినిధి, కాకినాడ :రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్ననాడే జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దుర్దశ ప్రారంభమైంది. అది కాస్తా ఎన్నికల్లో ధరావతులు కోల్పోవడంతో పరిపూర్ణమైంది. ఆ పార్టీ జిల్లాలో తిరిగి కోలుకుంటుందా, నాయకులు, కార్యకర్తలను కమ్ముకున్న నైరాశ్యం తొలగుతుందా అన్న సందేహం సర్వత్రా వ్యక్తమైంది. ‘మరో పాతికేళ్ల వరకూ ఆ పార్టీకి పుట్టగతులుండవు’ అన్న వారూ ఉన్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం ఆ పార్టీ దుస్థితి ఏ స్థాయిలో ఉందంటే.. కాకినాడలోని పార్టీ జిల్లా కార్యాలయమైన కళా వెంకట్రావు భవన్ అప్పటి నుంచీ వెలవెలబోయింది. పార్టీ అంటే ప్రేమ పోని నలుగురైదుగురు కార్యాలయానికి వచ్చిన కాసేపు కబుర్లు, పత్రికాపఠనం చేసే వెళ్లడం తప్ప అటు తొంగి చూసే నాయకులు, కార్యకర్తలే కరువయ్యారు. అలాంటి కార్యాలయం సోమవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షునిగా మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ బాధ్యతల స్వీకరణ సందర్భంగా మళ్లీ కళకళలాడింది. బాధ్యతల స్వీకరణకు ముందే పార్టీ శ్రేణులు జెండాలు చేబూని ‘కాంగ్రెస్ జిందాబాద్’ అంటూ డీసీసీ కార్యాలయానికి తరలివచ్చారు. ఇక నాయకులు ‘ఎన్నాళ్ల కెన్నాళ్ల కెన్నాళ్లకు’ అంటూ ఒకరికొకరు ఆలింగనాలు చేసుకుంటూ, కరచాలనాలతో ఉత్సాహంగా కనిపించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందలమెక్కిన ప్రజాప్రతినిధులు మాత్రం ముఖం చాటేశారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా కందుల పార్టీకి పునర్వైభవం తీసుకు రావడానికి కృషి చేస్తానన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా కార్యవర్గం ఏర్పాటు వరకు బాధ్యత తనదేనని ప్రకటించారు. దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు వరవడిలో ప్రతి నెలా ఐదున డీసీసీ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇక ఈ నెల 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నియోజకవర్గాల వారీ సమావేశాలను తూర్పు సెంటిమెంట్‌తో తుని నుంచి ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. రుణాలపై ఇచ్చిన హామీనే ‘మాఫీ’ చేసిన చంద్రబాబు సర్కారుపై పోరాడతామన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేతలు, పార్టీ శ్రేణు లు ఆ పోరుకు ఎంతవరకు సిద్ధమవుతారో చూడాలి. ప్రస్తుతం ఆ పార్టీ ఉన్న స్థితి నుంచి అంగుళం మేర ఉన్నతస్థితికి చేర్చాలన్నా, దిక్కులేకుండా పోయిన వేళ దిశా నిర్దేశం అన్నా మాటలు కాదు. కందుల ముందున్నదంతా ముళ్లబాటేనేనని పరిశీలకులు భావిస్తున్నారు. పూర్వ వైభవం అటుంచి.. ఐఎన్టీయూసీలో రెండు వర్గాల మధ్య పోరును చక్కదిద్దడమే ఆయనకు తొలి పరీక్ష కానుంది. -
‘చే’జారేనా..?
- డీసీసీబీపై కన్నేసిన టీఆర్ ఎస్ - యడవెల్లి విజయేందర్‌రెడ్డి రాజీనామాకు అధికారిక ఆమోదమే తరువాయి - ఇక తప్పని ఎన్నిక.. చైర్మన్ పోస్టు కోసం ఇప్పటికే ‘వర్గ’ పోరు సాక్షిప్రతినిధి, నల్లగొండ: సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్‌కు జిల్లాలో మిగిలిన ప్రధానపోస్టులు రెండు. అంతకు ముందే జరిగిన సహకార ఎన్నికల్లో డీసీసీబీ చైర్మన్, స్థానిక ఎన్నికల్లో జిల్లాపరిషత్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ నిలబెట్టుకుంది. ఈ రెండింట ఆ పార్టీకి తిరుగులేని మెజారిటీ ఉంది. అయితే సహకార ఎన్నికలు పార్టీల ప్రాతిపదికన జరిగినవి కావు. దీంతో డెరైక్టర్లు తమ ఇష్టమున్న పార్టీ తరఫున పనిచేసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ సొంతింటి రాజకీయాలతో చివరకు తన చేతిలో ఉన్న ప్రధానమైన డీసీసీబీని చేజేతులా వదులుకుంటోం దన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీ డీసీసీబీపైనా నజర్ పెట్టినట్లు చెబుతున్నారు. రెండోసారి చైర్మన్‌గా ఎన్నికైన విజయేందర్‌రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ల నుంచి తీవ్రమైన ఒత్తిడే ఉంది. సహకార ఎన్నికలకు ముందు పార్టీలో అంతర్గతంగా చేసుకున్న ఒప్పందం మేరకు విజయేందర్‌రెడ్డిని దీర్ఘకాలిక సెలవుపై పంపించి, వైస్‌చైర్మన్‌గా ఉన్న ముక్తవరపు పాండురంగారావును ఇన్ చార్జ్ చైర్మన్‌గా చేయాలన్నది ఆ ఒప్పంద సారాంశం. ఈ మేరకు విజయేందర్‌రెడ్డి తప్పని పరిస్థితుల్లో ఆరు నెలల పాటు సెలువులో వెళ్లిపోయారు. ఈలోగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. దీంతో ఆయన తిరిగి తన బాధ్యతల్లో చేరిపోయారు. అయినా, ఒప్పందం మేరకు పక్కకు తప్పుకోవాల్సిందేనని ఓ మాజీ మంత్రి ఒత్తిడి పెట్టడంతో ఆయన రాజీనామా చేశారు. మంగళవారం ఆయన ఈ మేరకు రాష్ట్ర సహకార శాఖ అధికారులకు తన రాజీనామా లేఖను సమర్పించారు. ఇది ఆమోదం పొందడమే మిగిలింది. చైర్మన్ రాజీనామా ఆమోదం పొందితే మళ్లీ ఎన్నిక జరపాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ వెలువడే వరకు మాత్రమే ఇన్చార్జ్ చైర్మన్‌గా పాండురంగారావుకు అవకాశం ఉంటుంది. ఆయననే తిరిగి చైర్మన్‌గా ఎన్నుకోవాలంటే డెరైక్టర్లలో మెజారిటీ ఉండాలి. వాస్తవానికి డీసీసీబీ డెరైక్టర్లు అంతా (19) కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. కానీ, వీరిలో భువనగిరి ప్రాంతానికి చెందిన ఓ డెరైక్టర్ చైర్మన్ పోస్టుపై ఆశ పెంచుకున్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రులు చెప్పినట్లు నడుచుకున్న డెరైక్టర్లు ఇప్పుడు మళ్లీ వారి మాట విని, పార్టీ సూచించే అభ్యర్థినే ఎన్నుకుంటారా అన్నది ప్రశ్నార్థకమే. ఇప్పటికే కాంగ్రెస్ డెరైక్టర్లలో వర్గపోరు ఉంది. ఈ సారి చైర్మన్ పదవిని ఎట్టి పరిస్థితుల్లో ఆయకట్టేతర ప్రాంతానికి ఇవ్వాలన్నది వీరి డిమాండ్. డీసీసీబీలో కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ పరిణామాలను గమనిస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీ.. డెరైక్టర్లలో కొందరిని తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. 19 మంది డెరైక్టర్లలో కనీసం 10 మంది మద్దతు కూడగ ట్టగలిగితే డీసీసీబీపై టీఆర్ఎస్ జెండా ఎగరేయవచ్చన్న వ్యూహంతో ఉన్నారు. మునుగోడు, ఆలేరు నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు డెరైక్టర్లు మధ్యలో ఓసారి అవిశ్వాసం పెట్టాలన్న ఆలోచన కూడా పెట్టారు. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు, డెరైక్టర్లలో ఉన్న వర్గపోరు ద్వారా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో గులాబీ నేతలు ఉన్నట్లు చెబుతున్నారు. డీసీసీబీ రాజకీయం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. -
‘డీసీసీ’పై మరోమారు చర్చ
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా భార్గవ్ దేశ్‌పాండే నియామకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు శుక్రవారం మీడియాలో వచ్చిన వార్తలు జిల్లాలోని ఆ పార్టీ వర్గాల్లో మరోమారు చర్చకు దారితీశాయి. డీసీసీ అధ్యక్షునిగా భార్గవ్‌ను నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏఐసీసీ నుంచి గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నియామకంపై పార్టీలో అసమ్మతి రాగాలు వినిపించాయి. కాంగ్రెస్ పార్టీలోని ఒకవర్గం నాయకులకు ఈ నియామకం మింగుడు పడలేదు. ఈ అసమ్మతి సెగలను చల్లార్చేందుకు అధిష్టానం ఈ మేరకు ఢిల్లీలో లీకులిచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈనెల 24, 25 తేదీల్లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సదస్సు నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈ సదస్సును ఏఐసీసీ ప్లీనరీ స్థాయిలో జరపాలని భావిస్తోంది. ఈ సదస్సులో ఎలాంటి అసమ్మతి రాగాలు వినిపించకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగమే ఈ లీకులని ఓ వర్గం నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వరుస ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఏమాత్రం తగ్గలేదు. జిల్లాలో రెండు గ్రూపులుగా విడిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకవర్గం భార్గవ్ నియామకాన్ని వ్యతిరేకిస్తోంది. తాము మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నట్లు టీపీసీసీ కార్యదర్శి, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి నరేష్‌జాదవ్ ప్రకటించిన విషయం విధితమే. అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నరేష్‌జాదవ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని భార్గవ్ అనుకూల వర్గం డిమాండ్ చేస్తోంది. మాజీ ఎంపీ వివేక్ కూడా భార్గవ్ నియామకాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన గురువారం రాత్రి జానారెడ్డితో హైదరాబాద్‌లో చర్చలు జరుపడం ఆ పార్టీలో చర్చకు దారి తీస్తోంది. -
ఓటమిపై నివేదికలివ్వండి: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి కారణాలేమిటో తెలియజేయాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లను ఆదేశించారు. పార్టీ అభ్యర్థుల ఓటమికి గల కారణాలను వివరిస్తూ సమగ్ర నివేదిక అందజేయాలని సూచించారు. అయితే, మరోవైపు ఓటమికి గల కారణాలపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ప్రత్యేక నివేదిక అందజేయాలని ఎన్నికల్లో ఓటమిపాలైన తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులు నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని నిజాంక్లబ్‌లో జి.వివేక్, పొన్నం ప్రభాకర్, రాజయ్య, అంజన్‌కుమార్, సురేష్ షెట్కార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నేత ఎస్.జైపాల్‌రెడ్డి నేతృత్వంలో గురువారం సోనియాగాంధీని కలిసి నివేదిక ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా, ఇటీవలి అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల వివరాలను తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున బృందాలను పంపించాలని పొన్నాల లక్ష్మయ్య డీసీసీ అధ్యక్షులను ఆదేశించారు. కాగా, నెహ్రూ-గాంధీ కుటుంబాలకు సంబంధించి ఏ చిన్న కార్యక్రమం జరిగినా హడావుడి చేసే కాంగ్రెస్ నేతలు... బుధవారం రాజీవ్‌గాంధీ 23వ వర్ధంతి కార్యక్రమం సాదాసీదాగా నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల, క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కోదండరెడ్డి మినహా నాయకులెవరూ హాజరుకాలేదు. కార్యకర్తలు కూడా పదుల సంఖ్యలో మాత్రమే వచ్చారు. -
నలుగురు డీసీసీ చీఫ్‌ల రాజీనామా
ఆమోదించిన పీసీసీ చీఫ్ బొత్స సాక్షి, హైదరాబాద్: పశ్చిమ గోదావరి, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల డీసీసీ(జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షులు శుక్రవారం తమ పదవులకు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తపల్లి సుబ్బారాయుడు, అనంతపురంలో మధుసూదన్‌గుప్తా, చిత్తూరులో రాజశేఖర్‌రెడ్డి, వైఎస్సార్ జిల్లాలో అశోక్‌కుమార్‌లు తమ రాజీనామా లేఖలను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు పంపారు. బొత్స వీటిని వెంటనే ఆమోదించారు. ఇదిలావుంటే, పీసీసీ అధికార ప్రతినిధులుగా కొత్తవారికి అవకాశంకల్పించాలని బొత్స భావిస్తున్నారు. దీనిపై కసరత్తు ముమ్మరం చేశారు. -
మీరు మారితేనే మీ వెంట
నిజామాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన డీసీసీ కార్యవర్గ సమావేశం వాడివేడిగా సా గింది. పలువురు నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలను ఆగ్రహావేశాలతో వ్యక్తం చేశారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో సత్సంబంధాలను కలిగి ఉన్న నేతలు జిల్లాలో ఉన్నప్పటికీ, గత ఎన్నికలలో పార్టీ తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి వచ్చిందన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన డి.శ్రీనివాస్, రాష్ట్ర సమన్వయకర్తగా పనిచేసిన షబ్బీర్‌అలీ, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్‌తోపాటు తలపండిన నాయకులు ఉన్నా, రానున్న ఎన్నికల లో విజయావకాశాలపై సందిగ్ధత, అనుమానాలు నెలకొనడం విచారకరమన్నారు. ఇప్పటికైనా నేతలు గత అనుభవాలు, తప్పిదాల నుంచి గుణపాఠం నే ర్చుకుని విభేదాలు, గ్రూపులకు స్వస్తి పలకాలన్నారు. సమష్టి నాయకత్వంతో ముందుకు సాగితేనే రానున్న ఎన్నికలలో వారి వెంట ఉంటామని, లేనిపక్షంలో తమ రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటామని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ...జిల్లాకు చెందిన అగ్రనాయకత్వాన్ని ఆహ్వానించకుండానే డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్‌హుందాన్ సమావేశా న్ని నిర్వహించారు. సమావేశంలో బ్లాక్, మండల పార్టీ అధ్యక్షులు, ద్వితీయ శ్రేణి నాయకులు, లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన సుమారు 300 మందికి పైగా నేతలు పాల్గొన్నారు. అగ్రనాయకులు లేకపోవడంతో కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలను నిస్సంకోచంగా వెల్లడించారు. నేతలపై ఉన్న వ్యతిరేక తను పరోక్షంగా సూచించారు. తాము అనుసరించే అగ్రనాయకుడికి వత్తాసు పలికే విధంగా మరి కొంత మంది మాట్లాడేందుకు ప్రయత్నించారు. మొత్తం మీద జిల్లా కాంగ్రెస్ నాయకత్వంలో విభేదాలు, గ్రూపులు తీవ్రంగా ఉన్నాయన్న విషయం సమావేశంలో బహిర్గతమైంది. వాస్తవంగా జిల్లా పార్టీలో రెండు గ్రూపులు కొనసాగుతున్నాయి. మంత్రి సుదర్శన్‌రెడ్డి ఒక గ్రూపుగా, డీఎస్ మరో గ్రూపుగా వ్యవహరిస్తున్నారు. ఎంపీలు మధుయాష్కీ, సురేశ్‌షెట్కార్, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, విప్ అనిల్ తదితరులు తటస్థంగా ఉంటున్నప్పటికీ వీరిలో కొంత మందికి సయోధ్యలేదు. ఈ నేపథ్యంలోనే జిల్లా కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడిన 30 మంది నాయకులు, కార్యకర్తలలో 16 మందికిపైగా పార్టీలోని గ్రూపు విభేదాలు, సమన్వయ లోపంపైనే ప్రధానంగా ప్రస్తావించారు. నాయకత్వం ఐక్యతతో, సమన్వయంతో కలిసికట్టుగా రానున్న ఎన్నికల్లో ముందుకుసాగినప్పుడే పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు. ఈ విషయాన్ని సమావేశంలో చర్చంచడం ద్వారా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి జిల్లా అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లాలని కొంత మంది సూచిం చడం గమనార్హం. పొత్తులు వద్దు అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసి మాటను నిలబెట్టుకున్న ఈ తరుణంలో రానున్న ఎన్నికలలో టీఆర్ఎస్తో పొత్తు అవసరం లేదని, మనం బలంగానే ఉన్నామని పలువురు పేర్కొన్నారు. గతంలో టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకుల ఇళ్లపై, కార్యకర్తలపై దాడి చేసినప్పటికీ ఎదుర్కొని నిలబడ్డామన్నారు. అవకాశవాదులు, పదవులను ఆశించే నాయకులే పొత్తులను ఆశిస్తున్నారని, పొత్తు కోసం పాకులాడవద్దని ద్వితీయ శ్రేణి నాయకులు స్పష్టం చేశారు. అధిష్టానవర్గం ఆదే శిస్తేనే పొత్తుల గురించి ఆలోచించాలి తప్పితే, తమకు తాముగా ప్రస్తావన తేవద్దని కోరారు. ప్రెషర్ గ్రూపుగా డీసీసీ అధ్యక్షుడిగా ఆరుమాసాల కిందట బాధ్యతలు చేపట్టిన తాహెర్ బిన్ హుందాన్ తనదైన శైలిలో జిల్లా కాంగ్రెస్ సమావేశం నిర్వహణకు శ్రీకారం చుట్టారు. జిల్లా కు చెందిన అగ్రనేతలు డి.శ్రీనివాస్, షబ్బీర్‌అలీ, కేఆర్ సురేశ్‌రెడ్డి, ఎంపీలు మధుయాష్కీగౌడ్, సురేశ్‌షెట్కార్, మంత్రి సుదర్శన్‌రెడ్డి, విప్ అని ల్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలిత, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటు పలువురు నేతలను ఆహ్వానించకుండానే కాంగ్రెస్ సమావేశాన్ని కొనసాగించారు. అసెంబ్లీ, శాసనమండలి సభలు జరుగుతుండడం వల్లనే జిల్లా నాయకులను సమావేశానికి ఆహ్వానించలేదని తాహెర్‌బిన్‌హందాన్ చెబుతున్నప్పటికీ ఇందులో మరో కారణం దాగి ఉందన్న అభిప్రాయాలను మరి కొంత మంది కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా మంత్రి సుదర్శన్‌రెడ్డి అనుచరుడిగా ముద్ర పడిన తాహెర్‌బిన్ కార్యవర్గ సమావేశానికి ఎవరిని ఆహ్వానించినా కష్టాలు తప్పవనే భావనతోనే పిలువకపోవచ్చునన్న చర్చ సాగుతోంది. జిల్లాలో జరుగుతున్న ప్రధాన కార్యక్రమాలకు మంత్రినే ఆహ్వానించడం, ఆయన కార్యక్రమాలకే ఎక్కువ సమయాన్ని కేటాయించడం, డీఎస్ వంటి నేతలతో పాటు జిల్లాలో కొనసాగుతున్న కార్యక్రమా ల కు తాహెర్‌బిన్ దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో ప్రెషర్ గ్రూపుగా బలపడేందుకు ఇలాం టి వ్యూహంతో ముందుకుసాగుతున్నారే మోనని అంటున్నారు. ఇప్పటికే జిల్లా నాయకత్వంలో నెలకొన్న గ్రూపులు, విభేదాలతోనే ఇబ్బందిపడుతున్న పలువురు ఇదేమి కొత్త వివాదమని అంటున్నారు.