ఖమ్మం అభ్యర్థిగా పొంగులేటి ప్రసాదరెడ్డి, కరీంనగర్‌లో రాజేందర్‌రావు, హైదరాబాద్‌కు వలీవుల్లా!
ఆయా స్థానాల్లో పార్టీ అభ్యర్థులపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చ
వెల్చాల అభ్యర్థిత్వాన్ని అనధికారికంగా ఖరారు చేసిన డీసీసీ
కేసీ సంతకం కోసమే వెయిటింగ్ అంటున్న గాందీభవన్ వర్గాలు
సాక్షి, హైదరాబాద్: అధికారికంగా ప్రకటించకుండా మిగిలిపోయిన 3 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ 3 స్థానాల విషయంలో నిర్ణయం జరిగిపోయినప్పటికీ ఫైల్ మీద సంతకం పెట్టకపోవడంతో ఆగిపోయినట్లు తెలుస్తోంది. గాందీభవన్ వర్గాల్లో చర్చ ప్రకారం.. ఖమ్మంకు పొంగులేటి ప్రసాదరెడ్డి, కరీంనగర్‌కు వెల్చాల రాజేందర్‌రావు, హైదరాబాద్‌కు సమీర్ వలీవుల్లా లను అభ్యర్థులుగా నిర్ణయించారు. నేడో, రేపో ఉత్తర్వులు వెలువడు తాయని తెలుస్తోంది.
ఆ 3... కారణాలు అనేకం
వాస్తవానికి, కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించడం మార్చిలోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి మూడు దఫాల్లో 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కానీ, పలు కారణాల రీత్యా ఈ 3 చోట్ల అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఇందుకు అనేక కారణాలున్నాయని గాందీభవన్ వర్గాలంటున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రుల మధ్య పోటీ, సామాజిక సమీకరణలు పీటముడి వేయగా, కరీంనగర్‌లో కూడా సామాజిక సమీకరణలే కారణమయ్యాయని, హైదరాబాద్‌లో అభ్యర్థి ఎంపికకు రాజకీయ కారణాలున్నాయని చెబుతున్నాయి.
ఖమ్మంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాదరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్, కమ్మ సామాజిక వర్గానికి చెందిన జెట్టి కుసుమ కుమార్, వంకాయలపాటి రాజేంద్రప్రసాద్‌ల పేర్లు వినిపించాయి. ఖమ్మంలో అభ్యర్థి ఎంపిక కోసం ఆ పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. అన్ని కోణాల్లో చర్చించిన తర్వాత పొంగులేటి ప్రసాదరెడ్డి పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
వెలమలకు కూడా..
కరీంనగర్ టికెట్ ఎవరికన్న విషయంలో పార్టీ హైకమాండ్ ఆది నుంచి సామాజిక కోణంలోనే ఆలోచిస్తోంది. ఇక్కడ మొదటి నుంచీ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డితోపాటు వెలమ సామాజిక వర్గానికి చెందిన వెల్చాల రాజేందర్‌రావు పేరు మాత్రమే పరిశీలించారు.
అయితే, రాష్ట్రంలోని ఒక స్థానాన్ని వెలమలకు కేటాయించాలన్న యోచనతో రాజేందర్‌రావు వైపు మొగ్గు చూపినట్టు తెలిసింది. ఈ సమాచారాన్ని జిల్లా కాంగ్రెస్ నేతలకూ తెలియజేయడంతో పార్టీ అభ్యర్థిత్వాన్ని అనధికారికంగానే డీసీసీ ఖరారు చేసింది. గురువారం నాటి కార్యక్రమానికి పార్టీ అభ్యర్థి రాజేందర్‌రావుతోపాటు మంత్రి పొన్నం ప్రభాకర్ వస్తారని, వారికి ఘనంగా స్వాగతం పలకాలంటూ పార్టీ శ్రేణులకు సందేశం పంపింది.
రాజకీయ కారణాలతోనే ఆలస్యం
హైదరాబాద్‌లో కేవలం రాజకీయ కారణాలతోనే అభ్యర్థిత్వం ఆలస్యమైంది. ఎంఐఎం విషయంలో అనుసరించాల్సిన ధోరణి, బీజేపీని నిలువరించే ప్రయత్నాల్లో భాగంగా చివరివరకు హైదరాబాద్ అభ్యర్థిని ఖరారు చేయలేదని తెలుస్తోంది. అయితే, ఇక్కడ అభ్యర్థిత్వం కోసం చాలామంది పోటీపడ్డారు.
ఫిరోజ్‌ఖాన్, అజారుద్దీన్, సమీర్ వలీవుల్లా, అలీ మస్కతి లాంటి నాయకుల పేర్లు ఈ జాబితాలో వినిపించినా, చివరకు హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సమీర్ వలీవుల్లాను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అలీ మస్కతి పేరును చివరి వరకు పరిశీలనలోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ మూడు స్థానాల విషయంలో అధిష్టానం ఓ కొలిక్కి రావడం, పోలింగ్‌కు మరో 25 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో నేడో, రేపో తుది జాబితా రానుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment