మీరు మారితేనే మీ వెంట | DCC to request Priyanka to contest from 'Telangana' region | Sakshi
Sakshi News home page

మీరు మారితేనే మీ వెంట

Published Fri, Jan 24 2014 6:38 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM

DCC to request Priyanka to contest from 'Telangana' region

నిజామాబాద్‌లోని పార్టీ  కార్యాలయంలో గురువారం జరిగిన డీసీసీ కార్యవర్గ సమావేశం వాడివేడిగా సా గింది. పలువురు నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలను ఆగ్రహావేశాలతో వ్యక్తం చేశారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో సత్సంబంధాలను కలిగి ఉన్న నేతలు జిల్లాలో ఉన్నప్పటికీ, గత ఎన్నికలలో పార్టీ తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి వచ్చిందన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన డి.శ్రీనివాస్, రాష్ట్ర సమన్వయకర్తగా పనిచేసిన షబ్బీర్‌అలీ, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్‌తోపాటు తలపండిన నాయకులు ఉన్నా, రానున్న ఎన్నికల లో విజయావకాశాలపై సందిగ్ధత, అనుమానాలు నెలకొనడం విచారకరమన్నారు.
 
 ఇప్పటికైనా నేతలు గత అనుభవాలు, తప్పిదాల నుంచి గుణపాఠం నే ర్చుకుని విభేదాలు, గ్రూపులకు స్వస్తి పలకాలన్నారు. సమష్టి నాయకత్వంతో ముందుకు సాగితేనే రానున్న ఎన్నికలలో వారి వెంట ఉంటామని, లేనిపక్షంలో తమ రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటామని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ...జిల్లాకు చెందిన అగ్రనాయకత్వాన్ని ఆహ్వానించకుండానే డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్‌హుందాన్ సమావేశా న్ని నిర్వహించారు. సమావేశంలో బ్లాక్, మండల పార్టీ అధ్యక్షులు, ద్వితీయ శ్రేణి నాయకులు, లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన సుమారు 300 మందికి పైగా నేతలు పాల్గొన్నారు. అగ్రనాయకులు లేకపోవడంతో కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలను నిస్సంకోచంగా వెల్లడించారు. నేతలపై ఉన్న వ్యతిరేక తను పరోక్షంగా సూచించారు. తాము అనుసరించే అగ్రనాయకుడికి వత్తాసు పలికే విధంగా మరి కొంత మంది మాట్లాడేందుకు ప్రయత్నించారు. మొత్తం మీద జిల్లా కాంగ్రెస్ నాయకత్వంలో విభేదాలు, గ్రూపులు తీవ్రంగా ఉన్నాయన్న విషయం సమావేశంలో బహిర్గతమైంది.
 
 వాస్తవంగా జిల్లా పార్టీలో రెండు గ్రూపులు కొనసాగుతున్నాయి. మంత్రి సుదర్శన్‌రెడ్డి ఒక గ్రూపుగా, డీఎస్ మరో గ్రూపుగా వ్యవహరిస్తున్నారు. ఎంపీలు మధుయాష్కీ, సురేశ్‌షెట్కార్, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, విప్ అనిల్ తదితరులు తటస్థంగా ఉంటున్నప్పటికీ వీరిలో కొంత మందికి సయోధ్యలేదు. ఈ నేపథ్యంలోనే జిల్లా కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడిన 30 మంది నాయకులు, కార్యకర్తలలో 16 మందికిపైగా పార్టీలోని గ్రూపు విభేదాలు, సమన్వయ లోపంపైనే ప్రధానంగా ప్రస్తావించారు. నాయకత్వం ఐక్యతతో, సమన్వయంతో కలిసికట్టుగా రానున్న ఎన్నికల్లో ముందుకుసాగినప్పుడే పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు. ఈ విషయాన్ని సమావేశంలో చర్చంచడం ద్వారా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి జిల్లా అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లాలని కొంత మంది సూచిం చడం గమనార్హం.
 
 పొత్తులు వద్దు
 అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసి మాటను నిలబెట్టుకున్న ఈ తరుణంలో రానున్న ఎన్నికలలో టీఆర్‌ఎస్‌తో పొత్తు అవసరం లేదని, మనం బలంగానే ఉన్నామని పలువురు పేర్కొన్నారు. గతంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకుల ఇళ్లపై, కార్యకర్తలపై దాడి చేసినప్పటికీ ఎదుర్కొని నిలబడ్డామన్నారు. అవకాశవాదులు, పదవులను ఆశించే నాయకులే పొత్తులను ఆశిస్తున్నారని, పొత్తు కోసం పాకులాడవద్దని ద్వితీయ శ్రేణి నాయకులు స్పష్టం చేశారు. అధిష్టానవర్గం ఆదే శిస్తేనే పొత్తుల గురించి ఆలోచించాలి తప్పితే, తమకు తాముగా ప్రస్తావన తేవద్దని కోరారు.
 
 ప్రెషర్ గ్రూపుగా
 డీసీసీ అధ్యక్షుడిగా ఆరుమాసాల కిందట బాధ్యతలు చేపట్టిన తాహెర్ బిన్ హుందాన్ తనదైన శైలిలో జిల్లా కాంగ్రెస్ సమావేశం నిర్వహణకు శ్రీకారం చుట్టారు. జిల్లా కు చెందిన అగ్రనేతలు డి.శ్రీనివాస్, షబ్బీర్‌అలీ, కేఆర్ సురేశ్‌రెడ్డి, ఎంపీలు మధుయాష్కీగౌడ్, సురేశ్‌షెట్కార్, మంత్రి సుదర్శన్‌రెడ్డి, విప్ అని ల్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలిత, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటు పలువురు నేతలను ఆహ్వానించకుండానే కాంగ్రెస్ సమావేశాన్ని కొనసాగించారు. అసెంబ్లీ, శాసనమండలి సభలు జరుగుతుండడం వల్లనే జిల్లా నాయకులను సమావేశానికి ఆహ్వానించలేదని తాహెర్‌బిన్‌హందాన్ చెబుతున్నప్పటికీ ఇందులో మరో కారణం  దాగి ఉందన్న అభిప్రాయాలను మరి కొంత మంది  కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.
 
 జిల్లా మంత్రి సుదర్శన్‌రెడ్డి అనుచరుడిగా ముద్ర పడిన తాహెర్‌బిన్ కార్యవర్గ  సమావేశానికి ఎవరిని ఆహ్వానించినా  కష్టాలు తప్పవనే భావనతోనే పిలువకపోవచ్చునన్న చర్చ సాగుతోంది.  జిల్లాలో జరుగుతున్న ప్రధాన కార్యక్రమాలకు మంత్రినే ఆహ్వానించడం, ఆయన కార్యక్రమాలకే ఎక్కువ సమయాన్ని కేటాయించడం, డీఎస్ వంటి నేతలతో పాటు జిల్లాలో కొనసాగుతున్న  కార్యక్రమా ల కు తాహెర్‌బిన్ దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో ప్రెషర్ గ్రూపుగా బలపడేందుకు ఇలాం టి వ్యూహంతో ముందుకుసాగుతున్నారే మోనని అంటున్నారు. ఇప్పటికే జిల్లా నాయకత్వంలో నెలకొన్న గ్రూపులు, విభేదాలతోనే ఇబ్బందిపడుతున్న పలువురు ఇదేమి కొత్త వివాదమని అంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement