మోదీ ఓటమి తెలంగాణ నుంచే మొదలుకావాలి Congress Leader Priyanka Gandhi On PM Modi | Sakshi
Sakshi News home page

మోదీ ఓటమి తెలంగాణ నుంచే మొదలుకావాలి

Published Sun, May 12 2024 5:31 AM

Congress Leader Priyanka Gandhi On PM Modi

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, కామారెడ్డి/తాండూరు: ‘రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకోవాలంటే మోదీని, బీజేపీని ఓడించడం తెలంగాణ నుంచే మొదలుకావాలి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాహుల్‌ గాంధీ నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి రాహుల్‌ నాయకత్వానికి అండగా నిలవండి. తెలంగాణ ఇచ్చిన సోనియాగాందీని మీరంతా సోనియమ్మ అంటున్నారు. నన్ను మీ సోదరిగా భావించండి’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. 

400 వందల సీట్లు ఇస్తే దేశ రాజ్యాంగాన్ని మారుస్తానని ప్రధాని మోదీ అంటున్నారని, ఈ రాజ్యాంగం దేశం లోని 140 కోట్ల మందిదని, ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చనివ్వమని  ఉద్ఘాటించారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నాలను తెలంగాణ నుంచే అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఆమె శనివారం తాండూరు, కామారెడ్డిలో నిర్వహించిన రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగుల్లో సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. పదేళ్ల మోదీ పాలనలో పేద, మధ్య తరగతి ప్రజలు, కారి్మకులు, రైతులు, మహిళలకు ఎలాంటి మేలు జరగలేదని, తన మిత్రులకే దేశ సంపద దోచిపెట్టారని మండిపడ్డారు. వారికి రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన మోదీ, రైతులకు మాత్రం ఒక్క రూపాయీ మాఫీ చేయలేదన్నారు. 

కాంగ్రెస్‌ పథకాలకు మోదీ ఫొటో 
ఎన్నికల సమయంలో ప్రజల మధ్య విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ప్రియాంకా గాంధీ ధ్వజమెత్తారు. కోటీశ్వరులకే మోదీ హయాంలో వికాసం జరిగిందని, అధికారం తమ చెప్పుచేతల్లో ఉండాలన్నదే బీజేపీ లక్ష్యమని అన్నారు. నోట్ల రద్దుతో  రైతులు, చిన్న వ్యాపారులు, సామాన్యుల నడ్డి విరిగిందని, దేశం ఆర్థికంగా వెనుకబడి పోయిందన్నారు. దేశంలోని మీడియా సంస్థలు ఇద్దరి ముగ్గురి చేతుల్లోకి వెళ్లాయని, వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లడం లేదని అన్నారు. పదేళ్లలో ఏం చేశారో చెప్పేంత ధైర్యం మోదీ చేయలేదని అన్నారు. కన్నీళ్లు పెట్టుకున్నారే తప్ప, దేశానికి ఏం చేశారో ప్రధాని ఒక్క వేదికపైనా చెప్పలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో గురించి తప్ప తాను ఏం చేశాడో చెప్పడం లేదన్నారు. కాంగ్రెస్‌ పథకాలకు మోదీ తన ఫొటో పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.  

పాలమూరు–రంగారెడ్డికి జాతీయా హోదా ఏదీ? 
చిలుకూరు బాలాజీ ఉన్న పవిత్ర ప్రాంతం అంటే తనకెంతో ప్రేమ అని ప్రియాంక గాంధీ అన్నారు. ఇందిరా గాందీకి మీరంతా ప్రేమను పంచారని, తన తల్లిని సోనియమ్మ అంటూ ప్రేమతో పిలిచి తల్లి పాత్ర ఇచ్చి తనకు సోదర సమానులయ్యారని వ్యాఖ్యానించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగినా బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించిన కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ బీజేపీ హయాంలో ఆగిపోయిందని చెప్పారు. 

దేశంలో 70 కోట్ల మంది నిరుద్యోగులున్నారని, 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచి్చన వెంటనే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధరను చట్ట పరిధిలోకి తెస్తామన్నారు. వ్యవసాయ ఆధారిత వస్తువులపై జీఎస్టీ తొలగిస్తామని, రైతులకు రుణ మాఫీ ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ట్రిపుల్‌ ఆర్‌ సినిమా చూశారా అని ప్రజలను అడిగిన ప్రియాంక... మనకు డబుల్‌ ఆర్‌ అంటే రేవంత్‌రెడ్డి, మరో ఆర్‌ అంటే రాహుల్‌ గాంధీ అని అన్నారు. 

కేంద్రం రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చింది: సీఎం రేవంత్‌రెడ్డి   
పార్లమెంట్‌ ఎన్నికలు రావడంతో సంక్రాంతి పండగకు వచ్చే గంగిరెద్దుల్లా బీజేపోళ్లు రాష్ట్రానికి వస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పదేళ్లలో మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చిందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయని చెప్పారు. వైఎస్సార్‌ ప్రభుత్వ హయాంలో వికారాబాద్‌ జిల్లాలో కేవలం కందులే కాదు ఇతర పంటలనూ పండించేలా ప్రోత్సహించారు. నాడు రంగారెడ్డి జిల్లా ప్రజలకు సాగునీటిని అందించేందుకు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును వేల కోట్లు వెచ్చించి నిర్మాణ పనులు చేపట్టారన్నారు. 

తర్వాత బీఆర్‌ఎస్, బీజేపీ ప్రభుత్వాలు కుట్ర చేసి రద్దు చేసి గోదావరి జలాలను రాకుండా చేశాయని ధ్వజమెత్తారు. ‘మే 9న రైతు భరోసా ద్వారా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తా అని ఆనాడు హామీ ఇచ్చాను. రైతు భరోసా అందిస్తే అమర వీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలని కేసీఆర్‌కు సవాల్‌ విసిరాను. మే 6న రూ.7,500 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశా. కేసీఆర్‌ఆర్‌కు ఏ మాత్రం సోయి ఉన్నా ముక్కు నేలకు రాయాలి’ అని పేర్కొన్నారు. ‘రైతు రుణమాఫీని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేయదని హరీశ్‌రావు అంటున్నారు. 

తెలంగాణ రైతుల సాక్షిగా, అనంత పద్మనాభస్వామి వారి సాక్షిగా పంద్రాగస్టులోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని ఒట్టు వేస్తున్నా. రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటా’ అని తెలిపారు. మోదీ వెంట ఈడీ, ఐటీ, సీబీఐ, ఢిల్లీ పోలీసులు, అంబానీ, అదానీ ఉంటే.. రాహుల్‌ వెంట ఇందిరమ్మ, రాజీవ్‌ గాం«దీల త్యాగం, సోనియమ్మ, ప్రియాంక గాంధీ, రేవంత్‌రెడ్డి, కోట్లాది మంది కార్యకర్తలు ఉన్నారని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో మోదీ పరివారాన్ని ఓడించి, రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడే రాహుల్‌ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, మంత్రి దామోదర రాజనర్సింహ, చేవెళ్ల అభ్యర్థి రంజిత్‌రెడ్డి, జహీరాబాద్‌ అభ్యర్థి సురేశ్‌ షెట్కార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement