
కూలబడ్డ రథానికి కొత్త సారథి
సాక్షి ప్రతినిధి, కాకినాడ :రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్ననాడే జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దుర్దశ ప్రారంభమైంది. అది కాస్తా ఎన్నికల్లో ధరావతులు కోల్పోవడంతో పరిపూర్ణమైంది. ఆ పార్టీ జిల్లాలో తిరిగి కోలుకుంటుందా, నాయకులు, కార్యకర్తలను కమ్ముకున్న నైరాశ్యం తొలగుతుందా అన్న సందేహం సర్వత్రా వ్యక్తమైంది. ‘మరో పాతికేళ్ల వరకూ ఆ పార్టీకి పుట్టగతులుండవు’ అన్న వారూ ఉన్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం ఆ పార్టీ దుస్థితి ఏ స్థాయిలో ఉందంటే.. కాకినాడలోని పార్టీ జిల్లా కార్యాలయమైన కళా వెంకట్రావు భవన్ అప్పటి నుంచీ వెలవెలబోయింది. పార్టీ అంటే ప్రేమ పోని నలుగురైదుగురు కార్యాలయానికి వచ్చిన కాసేపు కబుర్లు, పత్రికాపఠనం చేసే వెళ్లడం తప్ప అటు తొంగి చూసే నాయకులు, కార్యకర్తలే కరువయ్యారు. అలాంటి కార్యాలయం సోమవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షునిగా మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ బాధ్యతల స్వీకరణ సందర్భంగా మళ్లీ కళకళలాడింది. బాధ్యతల స్వీకరణకు ముందే పార్టీ శ్రేణులు జెండాలు చేబూని ‘కాంగ్రెస్ జిందాబాద్’ అంటూ డీసీసీ కార్యాలయానికి తరలివచ్చారు. ఇక నాయకులు ‘ఎన్నాళ్ల కెన్నాళ్ల కెన్నాళ్లకు’ అంటూ ఒకరికొకరు ఆలింగనాలు చేసుకుంటూ, కరచాలనాలతో ఉత్సాహంగా కనిపించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందలమెక్కిన ప్రజాప్రతినిధులు మాత్రం ముఖం చాటేశారు.
బాధ్యతల స్వీకరణ సందర్భంగా కందుల పార్టీకి పునర్వైభవం తీసుకు రావడానికి కృషి చేస్తానన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా కార్యవర్గం ఏర్పాటు వరకు బాధ్యత తనదేనని ప్రకటించారు. దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు వరవడిలో ప్రతి నెలా ఐదున డీసీసీ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇక ఈ నెల 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నియోజకవర్గాల వారీ సమావేశాలను తూర్పు సెంటిమెంట్‌తో తుని నుంచి ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. రుణాలపై ఇచ్చిన హామీనే ‘మాఫీ’ చేసిన చంద్రబాబు సర్కారుపై పోరాడతామన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేతలు, పార్టీ శ్రేణు లు ఆ పోరుకు ఎంతవరకు సిద్ధమవుతారో చూడాలి. ప్రస్తుతం ఆ పార్టీ ఉన్న స్థితి నుంచి అంగుళం మేర ఉన్నతస్థితికి చేర్చాలన్నా, దిక్కులేకుండా పోయిన వేళ దిశా నిర్దేశం అన్నా మాటలు కాదు. కందుల ముందున్నదంతా ముళ్లబాటేనేనని పరిశీలకులు భావిస్తున్నారు. పూర్వ వైభవం అటుంచి.. ఐఎన్‌టీయూసీలో రెండు వర్గాల మధ్య పోరును చక్కదిద్దడమే ఆయనకు తొలి పరీక్ష కానుంది.