
బాబూ! నీ రాజకీయ చిరునామా కాంగ్రెస్ భిక్షే
కాకినాడ : టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు రాజకీయంగా చిరునామాను ఇచ్చింది కాంగ్రెస్సేనన్న వాస్తవాన్ని మరిచి మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) నూతన అధ్యక్షుడు కందుల దుర్గేష్ విమర్శించారు. డీసీసీ సారథిగా కందుల సోమవారం కాకినాడలోని పార్టీ కార్యాలయం కళా వెంకట్రావు భవనంలో సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. తొలుత పార్టీ కార్యాలయం రిజిస్టర్‌లో సంతకం చేసిన అనంతరం ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపిన పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిని చంద్రబాబు అడ్రస్‌లేని పార్టీకి అధ్యక్షుడివనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్‌ఈజడ్ భూముల్ని వెనక్కి తీసుకుంటామన్న చంద్రబాబు ఇప్పుడు మాటమార్చి అక్కడ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయనడాన్ని తప్పుపట్టారు. ఇకపై తమపార్టీ ప్రజల సమస్యలపై పోరాడుతుందని, జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. రాజకీయ మార్పునకు నాందిగా పేరున్న తుని నుంచి ఈ నెల 19న గ్రామ పర్యటనలకు శ్రీకారం చుడతామన్నారు. ప్రతి నెలా 5న క్రమం తప్పకుండా డీసీసీ సమావేశం నిర్వహిస్తామన్నారు. అన్ని ప్రాంతాలు, సామాజిక వర్గాలకు సమాన ప్రాధాన్యమిస్తూ త్వరలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
పార్టీ జిల్లా ఇన్‌చార్జి, మాజీ మంత్రి బాలరాజు మాట్లాడుతూ దుర్గేష్ నాయకత్వంలో పార్టీ బలోపేతం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ రత్నాబాయి, మాజీ ఎంపీ ఏజేవీ బుచ్చిమహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పంతం నానాజీ, పీసీసీ కార్యదర్శి ఎస్‌ఎన్ రాజా, పార్టీ నేతలు కామన ప్రభాకరరావు, డోకల మురళి, రామినీడు మురళి, ఆకుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.