ఓటేయకపోతే ఎంపీల ఇంటి ఎదుట ధర్నా
కర్నూలు(ఓల్డ్‌సిటీ): రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు శుక్రవారం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టే ప్రై వేటు బిల్లుకు అనుకూలంగా ఓటేయ్యని ఎంపీల ఇళ్ల ఎదుట ధర్నా చేస్తామని డీసీసీ అధ్యక్షుడు బీవై రామయ్య హెచ్చరించారు. గురువారం స్థానిక కళావెంకట్రావ్ భవనంలో ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధనకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాలు, మట్టి సత్యాగ్రహం కార్యక్రమాలు ప్రధాని కార్యాలయాన్నే కుదిపేశాయన్నారు. శుక్రవారం కేవీపీ ప్రవేశ పెట్టే బిల్లులకు ఏపీ ఎంపీలు అనుకూలంగా ఓటింగ్ చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. జిల్లాలోని ఇద్దరు ఎంపీలు, రాజ్యసభ సభ్యుడు బిల్లుకు మద్దతు ఇవ్వాలన్నారు. ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది మొదట్నుంచీ కప్పదాటు వ్యవహారమేనని విమర్శించారు. ప్రై వేట్ బిల్లుకు మద్దతు తెల్పుతామని రెండు నెలల క్రితమే చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం మాట మార్చి, దేశంలో ఎప్పుడైనా ప్రై వేట్ బిల్లు చట్టమైందా అని మాట్లాడటం ఆయనకే చెల్లిందన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, పీసీసీ కార్యదర్శి సర్దార్ బుచ్చిబాబు, జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, కాంగ్రెస్ నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, నారాయణరెడ్డి, తిప్పన్న, సలాం, ఖలీల్‌బాష, శ్రీనివాసరెడ్డి, విజయభాస్కరరెడ్డి, ఎస్సీసెల్ సత్యరాజు తదితరులు పాల్గొన్నారు.