కరీంనగర్ పార్టీ కార్యాలయంలో సమావేశమైన నాయకులు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతల్లో ఇకనైనా సఖ్యత కుదురుతుందా? గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికి ‘ఐ’క్యతారాగం వినిపిస్తారా? ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నేతల మధ్య చెలరేగిన విబేధాలు సద్దుమణుగుతాయా? అంటే.. కష్టమే అనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే. సీనియర్ కాంగ్రెస్ నేతలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు గ్రూపులుగా సాగుతుంటే.. ఏమీ పట్టని సీనియర్లు మరో గ్రూపు కింద జతకట్టేలా ఆ పార్టీ రాజకీయాలు తెరమీద కనిపిస్తున్నాయి. ప్రధానంగా మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ పొన్నం ప్రభాకర్ మధ్యన మొదలైన విబేధాలు రెండు గ్రూపులుగా కనిపిస్తున్నాయి.
13 నియోజకవర్గాలకు చెందిన పలువురు ఈ రెండు గ్రూపుల్లో కొనసాగుతుండగా... పార్టీ హైకమాండ్ ఆదేశాలు.. పార్టీ కార్యక్రమాలపరంగా ఈ రెండు గ్రూపులకు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కటకం మృత్యుంజయం కేంద్రబిందువు అవుతున్నారు. సీఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి నియోజకవర్గాన్ని చక్కదిద్దుకునే పనితోపాటు అధిష్టానం సూచనల మేరకు కార్యక్రమాలు చేస్తూ అందరితో కలిసిపోతున్నారు. 2014 ఎన్నికలో పోటీ చేసిన నేతలు, పార్టీ జాతీయ, రాష్ట్ర, జిల్లా కమిటీల్లో ఉన్న పలువురు సమయం, సందర్భాన్ని బట్టి గ్రూపులలో ‘ఇటుఅటు’గా వ్యవహరిస్తూ పార్టీలో నెట్టుకొస్తున్నారు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు సాగుతుండగా... తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సు చైతన్యయాత్ర ఉమ్మడి కరీంనగర్‌లో మూడు రోజులు సాగనుంది. ఈ నేపథ్యంలోనైనా ఆ పార్టీ నేతలు కలిసినడిచేనా..? అన్న చర్చ సాగుతోంది.
6, 7, 8 తేదీల్లో బస్సుయాత్ర.. రూట్‌మ్యాప్‌పై ఇంకా తర్జనభర్జన
మరో రెండురోజుల్లో నిజామాబాద్ జిల్లానుంచి బస్సు చైతన్యయాత్ర జిల్లాలో ప్రవేశించనుంది. మూడురోజులపాటు జిల్లాలో ఈ యాత్ర సాగనుండగా, ప్రతిష్టాత్మకమైన బస్సు చైతన్యయాత్ర రూట్‌మ్యాప్‌కు తుదిరూపు రాలేదు. ఈ రూట్‌మ్యాప్ విషయంలో ఆ పార్టీ సీనియర్ల మధ్య ఉన్న గ్రూపు రాజకీయాల ప్రభావం ఉందన్న చర్చ కేడర్‌లో వినిపిస్తోంది. సాధారణంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడురోజుల యాత్ర పూర్వ కరీంనగర్‌లో అన్ని జిల్లాలు, కనీసం అన్ని నియోజకవర్గాలను కలిపేది విధంగా సాగాలని ఆశావహులు కోరుకుంటారు.
మెట్‌పల్లి, సిరిసిల్ల, ఇల్లంతకుంట, మానకొండూరు, హుస్నాబాద్, హుజూరాబాద్‌కు చేరుకునేలా కొందరు ప్రతిపాదిస్తే... మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, కొడిమ్యాల, మల్యాల, కరీంనగర్, మానకొండూరు, హుజూరాబాద్‌ను మరికొందరు ప్రతిపాదించడమే ఇందుకు ఉదాహరణ. ఈ రెండు ప్రతిపాదనల్లో కూడా పెద్దపల్లి జిల్లా రామగుండం, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల ఊసులేదు. వీటిపైనా అనేక పార్టీ నేతలు, క్యాడర్‌లో అపొహలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
శనివారం సాయంత్రం డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అధ్యక్షతన కరీంనగర్ పార్టీ కార్యాలయంలో సీనియ ర్ నాయకులు కొందరు సమావేశమయ్యారు. సీఎల్‌పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ విప్ ఆరెపల్లి మోహ న్, రేగులపాటి రమ్యరావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కవ్వంపల్లి సత్యనారాయణ, బొమ్మ శ్రీరాం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బస్సు చైతన్యయాత్ర, రూట్‌మ్యాప్‌లపై కొంతసేపు చర్చించినట్లు సమాచారం. ఆదివారంగానీ, సోమవారంగానీ రూట్‌మ్యాప్‌పై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రతిష్టాత్మకంగా బస్సు చైతన్యయాత్ర.. కమిటీల్లో జిల్లాకు చెందిన ఎనిమిది మంది....
టీపీసీసీ బస్సు చైతన్యయాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప్రజా చైతన్యయాత్రను 6, 7, 8 తేదీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు రోజులపాటు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో బస్సుయాత్ర సక్సెస్‌కు 49 మంది సీనియర్ నేతలతో రాష్ట్రస్థాయిలో వేసిన ఆర్గనైజింగ్, మీడియా కమిటీలలో అత్యధికంగా జిల్లాకు చెందిన ఎనిమిది మందికి ప్రాధాన్యత కల్పించారు. జిల్లాలో ఉన్న గ్రూపు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ అధిష్టానం అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం కలిగేలా వ్యవహరించింది.
ఈ మేరకు టీపీసీసీ 31 మందితో నియమించిన ఆర్గనైజింగ్‌కమిటీలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద, టీపీసీసీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్, హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పాడి కౌశిక్‌రెడ్డి, రామగుండం నియోజకవర్గానికి చెందిన మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌ను నియమించారు. 18మందితో కూడిన మీడియా కమిటీలో జిల్లా నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధులుగా పనిచేస్తున్న రేగులపాటి రమ్యరావు, కొనగాల మహేష్, మాజీ ఎమ్మెల్సీ బి.కమలాకర్‌రావును నియమించారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలకు నూతనోత్తేజం నింపేందుకు టీపీసీసీ ఈ యాత్రను తలపెట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ రూట్‌మ్యాప్ ఖరారు కాకపోగా, టీపీసీసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ ప్రజాచైతన్య యాత్రను ఏ మేరకు విజయవంతం చేస్తారనేది కేడర్‌లో చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment