
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో నెట్‌వర్క్ కాల్స్‌కు ఇంటర్ కనెక్షన్ పాయింట్లను సమకూర్చనందుకు గాను భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలకు భారీ పెనాల్టీ భారం పడింది. టెలికం శాఖ అత్యున్నత నిర్ణయాల విభాగం డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ) పెనాల్టీ విధించే నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. అయితే, టెలికం రంగంలో తీవ్ర ఆర్థిక సమస్యల నేపథ్యంలో రూ.3,050 కోట్ల జరిమానాను అమలు చేసే ముందు దీన్ని సవరించే విషయంలో ట్రాయ్ సూచనలను తీసుకోవాలని కమిషన్ నిర్ణయించింది. టెలికం రంగంలోకి కొత్తగా ప్రవేశించిన జియోకు ఇంటర్‌కనెక్షన్ పాయింట్లను ఇచ్చేందుకు నిరాకరించిన భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలపై రూ.3,050 కోట్ల పెనాల్టీని విధించాలని 2016 అక్టోబర్‌లో ట్రాయ్ సిఫారసు చేసింది.
ఇందులో ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లకు రూ.1,050 కోట్ల చొప్పున, ఐడియాపై రూ.950 కోట్ల జరిమానా అమలు చేయాల్సి ఉంది. వొడాఫోన్, ఐడియాలు విలీనమై ఒకే సంస్థగా ఏర్పడడంతో ఇప్పుడు ఉమ్మడి జరిమానాను వొడాఫోన్ ఐడియా చెల్లించాల్సి ఉంటుంది. పోటీ సంస్థలు సరిపడా ఇంటర్ కనెక్షన్ పాయింట్లను సమకూర్చకపోవడంతో తమ నెట్‌వర్క్‌కు సంబంధించి 75 శాతం కాల్స్ ఫెయిల్ అవుతున్నాయంటూ జియో చేసిన ఫిర్యాదు ఆధారంగా ట్రాయ్ నాడు చర్యలకు ఆదేశించింది. అయితే, నాణ్యమైన సేవలను తన కస్టమర్లకు అందించనందుకు రిలయన్స్ జియోపై కూడా పెనాల్టీ విధించాల్సి ఉంటుందని, నాణ్యమైన సేవలందించే ప్రాథమిక బాధ్యతను ఇతరులపై మోపవచ్చా? అంటూ డీసీసీలో భాగమైన ఓ శాఖా కార్యదర్శి ప్రశ్నించగా... దీన్ని డీసీసీ సభ్యులు కొట్టిపారేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment