
ఇక చాలు.. నన్ను తప్పించండి : తూడి దేవేందర్‌రెడ్డి
డీసీసీ రేసులో భిక్షమయ్యగౌడ్, చిరుమర్తి లింగయ్య, రాపోలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గాంధీభవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి రామచంద్రకుంతియా, పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యల సమక్షంలో శుక్రవారం జరిగిన సమావేశంలో భాగంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ వ్యక్తిగత కారణాల వల్ల తాను పార్టీ జిల్లా బాధ్యతలను మోయలేనని, గతంలో తాను ఇచ్చిన రాజీనామాను ఆమోదించి, తనను బాధ్యతల నుంచి తప్పించాలని పార్టీ అధినాయకత్వాన్ని కోరారు. తూడి విజ్ఞప్తి పట్ల పార్టీ నాయకత్వం కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. తూడిని తప్పిస్తే మాజీ ఎమ్మెల్యేలు భిక్షమయ్యగౌడ్, చిరుమర్తి లింగయ్య, మునుగోడుకు చెందిన రాపోలు జయప్రకాశ్‌లలో ఒకరిని డీసీసీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సందర్భంగా తూడి మాట్లాడుతూ ఎలాంటి వివాదాలకు తావు లేకుండా మూడేళ్ల పాటు జిల్లా పార్టీ బాధ్యతలు నిర్వర్తించానని, తనకు సహకరించిన, సహకరించని నాయకులందరికీ కృత జ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఎలాంటి చందాలు, పైరవీలకు అవకాశం లేకుండా పార్టీ బాధ్యతలు మోసానని, తాను బాధ్యతల నుంచి తప్పుకున్నా పార్టీకి పూర్తి స్థాయి సహకారం అందిస్తానని, అసంపూర్తిగా ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ భవనాన్ని కూడా పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. తూడి గురించి జానా మాట్లాడుతూ బాగా పనిచేశాడని కితాబిచ్చినట్టు సమాచారం. అయితే, తూడి తన ప్రసంగంలో భాగంగా పీసీసీ, ఏఐసీసీ నేతల పనితీరును కూడా ప్రశ్నించారు.
మనం అధికారం కోసమే తెలంగాణ ఇచ్చామనే విధంగా జరిగిన ప్రచారం దెబ్బతీసింది. ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ఇచ్చామన్నది మరిచిపోయారు. పార్టీలో స్టేట్స్‌మెన్ తగ్గిపోయి లీడర్లే మిగిలారు. తెలంగాణ ప్రకటన చేసిన తర్వాత రాష్ట్రం ఇవ్వకుండా జాప్యం చేసి ఇరువైపులా నష్టపోయారు. అయినా టీఆర్‌ఎస్ అధినేత దీక్షకు స్పందించి రాష్ట్ర ప్రకటన చేయడమేంటి?* అని ఆయన ప్రశ్నించినట్టు సమాచారం.