- డీసీసీ సమావేశంలో నేతల మధ్య మాటల తూటాలు
- సీనియర్ల తీరును తప్పుబట్టిన శ్రేణులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అధికారం కోల్పోయినా కాంగ్రెస్ నేతల తీరు మారలేదు. సీనియర్ల మధ్య గ్రూపులు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం జరిగిన జిల్లా కాంగ్రెస్ కమిటీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఇది స్పష్టంగా కనిపించింది. వ్యంగ్యాస్త్రాలు.. పరోక్ష విమర్శలతో నేతలు ఒకరికొకరు చురకలంటించుకున్నారు. ఏకంగా ఏఐసీసీ పరిశీలకులు కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమక్షంలో నేతల మధ్య విభేదాలు బహిర్గతం కావడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీని విజయపథం వైపు నడపాలనే ప్రధాన అంశంతో సాగిన ఈ సమావేశం కాస్త నేతల విమర్శలు, ప్రతివిమర్శల మధ్యే ముగిసింది. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసుకుని టిక్కెట్లు తెచ్చుకోవడం కాదంటూ డీసీసీ అధ్యక్షుడిపై పరోక్ష విమర్శలకు దిగడంతో సభలో కొంత గందరగోళం జరిగింది. ఇంతలో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ కల్పించుకుంటూ టిక్కెట్లు ఎవరికివ్వాలనే నిర్ణయం ఢిల్లీలోనే తీసుకుంటారంటూ స్పందించారు.
దీంతో ఇరువర్గాల మధ్య కొంత ఘర్షణవాతావరణం చోటుచేసుకుంది. సభ్యత్వ నమోదులో వెనుకబడడానికి కూడా నాయకత్వలోపమే కారణమని మల్‌రెడ్డి వ్యాఖ్యానించడం.. దీనికి కొనసాగింపుగా కొట్టేలా మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మాట్లాడడం సభలో వాతావరణాన్ని వేడెక్కించింది.
చురుకైన నేతలకే పట్టం: కుంతియా
పార్టీ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొనే నేతలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని ఏఐసీసీ కార్యదర్శి కుంతియా పేర్కొన్నారు. సోమవారం జరిగిన జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదులో కీలక పాత్ర పోషించిన వారికి పదవులతోపాటు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తామన్నారు. సభ్యత్వ నమోదును విజయవంతం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సభ్యత్వ నమోదుకు గడువు మే 15గా నిర్ణయించామన్నారు.
డిసెంబర్‌లో జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీని అధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 30న పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటన ఉందన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉందని, ఎన్నికల్లో ఓటమికి కారణాలు విశ్లేషించి సరిదిద్దుకోవాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, మాజీ మంత్రులు పి.సబితారెడ్డి, జి.ప్రసాద్‌కుమార్, మాజీ ఎంపీలు సర్వే సత్యనారాయణ, కె.రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, భిక్షపతియాదవ్, కూనశ్రీశైలం, సీనియర్ నాయకులు కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తీరు మారలేదు!
Published Tue, Apr 28 2015 1:29 AM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM
Advertisement
Advertisement