సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా భార్గవ్ దేశ్‌పాండే నియామకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు శుక్రవారం మీడియాలో వచ్చిన వార్తలు జిల్లాలోని ఆ పార్టీ వర్గాల్లో మరోమారు చర్చకు దారితీశాయి. డీసీసీ అధ్యక్షునిగా భార్గవ్‌ను నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏఐసీసీ నుంచి గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నియామకంపై పార్టీలో అసమ్మతి రాగాలు వినిపించాయి. కాంగ్రెస్ పార్టీలోని ఒకవర్గం నాయకులకు ఈ నియామకం మింగుడు పడలేదు.
ఈ అసమ్మతి సెగలను చల్లార్చేందుకు అధిష్టానం ఈ మేరకు ఢిల్లీలో లీకులిచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈనెల 24, 25 తేదీల్లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సదస్సు నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈ సదస్సును ఏఐసీసీ ప్లీనరీ స్థాయిలో జరపాలని భావిస్తోంది. ఈ సదస్సులో ఎలాంటి అసమ్మతి రాగాలు వినిపించకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగమే ఈ లీకులని ఓ వర్గం నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వరుస ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఏమాత్రం తగ్గలేదు.
జిల్లాలో రెండు గ్రూపులుగా విడిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకవర్గం భార్గవ్ నియామకాన్ని వ్యతిరేకిస్తోంది. తాము మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నట్లు టీపీసీసీ కార్యదర్శి, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి నరేష్‌జాదవ్ ప్రకటించిన విషయం విధితమే. అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నరేష్‌జాదవ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని భార్గవ్ అనుకూల వర్గం డిమాండ్ చేస్తోంది. మాజీ ఎంపీ వివేక్ కూడా భార్గవ్ నియామకాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన గురువారం రాత్రి జానారెడ్డితో హైదరాబాద్‌లో చర్చలు జరుపడం ఆ పార్టీలో చర్చకు దారి తీస్తోంది.
‘డీసీసీ’పై మరోమారు చర్చ
Published Sat, Aug 23 2014 2:45 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement