సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : వరుస ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై చావుదెబ్బతిన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ పగ్గాలను యువ నాయకత్వానికి అందించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఆదిలాబాద్ పట్టణానికి చెందిన భార్గవ్‌దేశ్ పాండే ను నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయం మేరకు డీసీసీ అధ్యక్షునిగా భార్గవ్‌దేశ్‌పాండేను నియమించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది ప్రకటించారు. ఆదిలాబాద్‌తోపాటు, రంగారెడ్డి, మెదక్ జిల్లాల డీసీసీ అధ్యక్షులను కూడా అధిష్టానం నియమించింది. జిల్లాలో ఎంతో కీలకమైన డీసీసీ అధ్యక్ష పదవిని 28 ఏళ్ల యువకునికి అప్పగించడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు డీసీసీ అధ్యక్షునిగా సీనియర్ నాయకులు సి.రాంచంద్రారెడ్డి వ్యవహరించారు. డీసీసీ అధ్యక్ష పదవికి ముగ్గురు పేర్లను అధిష్టానం పరిశీలించింది.
డీసీసీ మాజీ అధ్యక్షుడు రవీందర్‌రావు, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఎ.మహేశ్వర్‌రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ిపీసీసీ కార్యదర్శి నరేష్‌జాదవ్ కూడా ఈ పదవిని ఆశించారు. ఈ ఎన్నిక విషయంలో తెలంగాణ పీసీసీ నెలరోజుల క్రితం జిల్లా నేతలతో అభిప్రాయ సేకరణ నిర్వహించింది. అయితే యువనేత రాహుల్‌గాంధీతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా భార్గవ్‌కు ఈ పదవి దక్కిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
భగ్గుమన్న విభేదాలు
జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు మరోమారు భగ్గుమన్నాయి. రెండు గ్రూపులుగా కొనసాగుతున్న పార్టీలో ఒకవర్గం నేతలు భార్గవ్ నియామకాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ నియామకాన్ని ప్రకటించిన వెంటనే మాజీ ఎంపీ వివేక్ ఆ పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డితో హైదరాబాద్‌లో భేటీ అయినట్లు సమాచారం. అధిష్టానం నిర్ణయాన్ని నిరసిస్తూ పలువురు నాయకులు పార్టీకి రాజీనామా చేయనున్నారని పీసీసీ కార్యదర్శి నరేష్‌జాదవ్ ‘సాక్షి’ప్రతినిధితో పేర్కొన్నారు.
ఎన్‌ఎస్‌యూఐ నుంచి..
2004లో ఎన్‌ఎస్‌యూఐలో చేరిన భార్గవ్ 2006లో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శిగా నియామకమయ్యారు. 2009లో యువజన కాంగ్రెస్ తమిళనాడు ఎన్నికల ఇన్‌చార్జీగా వ్యవహరించారు. 2010లో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 2012 నుంచి యువజన కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఆయన 2014 ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కోటాలో ఎమ్మెల్యేగా టికెట్ తెచ్చుకున్నారు. ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.
యువ నాయకత్వానికి కాంగ్రెస్ పగ్గాలు
Published Fri, Aug 22 2014 12:23 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement