Main posts
-
రాహుల్ టీమ్‌లో ఎవరెవరు?
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ఘట్టం పూర్తయ్యింది. అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ముళ్లపల్లి రామచంద్రన్ సోమవారం ప్రకటించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాకుండా, సంక్షోభంలో ఉన్నప్పుడు పార్టీ పగ్గాలు స్వీకరించబోతుండటంతో రాహుల్ ఎన్నికపై ఎలాంటి విమర్శలూ రాలేదు. గతంలో పార్టీ విధివిధానాలకు సంబంధించి రాహుల్ ఎన్నో సూచనలు చేసినా వాటిని పరిగణనలోనికి తీసుకున్నది తక్కువే. అందుకు కారణం వివిధ రాష్ట్రాల్లో ఇన్చార్జి బాధ్యతలు చూస్తున్న వారిలో ఎక్కువ మంది సీనియర్లే కావడం. అయితే ఇప్పుడు అధ్యక్షుడిగా తన ఆలోచనలనే అమలు చేసే అవకాశం రాహుల్‌కు ఉంటుంది. అందుకు రాహుల్ తనదైన బృందాన్ని నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఈ దిశగా ఆయన ఇప్పటికే కసరత్తు చేసినట్టు ఏఐసీసీలోని ఓ కీలక నేత ‘సాక్షి’కి తెలిపారు. ‘మాటల్లో కంటే చేతల్లో చూపడాన్నే రాహుల్ ఇష్టపడతారు. తన సహచరులు కూడా మెరుగైన పనితీరును కనబరచాలని ఆయన కోరుకుంటారు. ఆయన బృందం కూడా అలాగే ఉండబోతోంది’ అని ఆ నేత పేర్కొన్నారు. ‘సీనియర్ల నుంచి సలహాలను తీసుకుంటారు. అంత సులువుగా వారిని పక్కకు పెట్టరు. అయితే యుద్ధక్షేత్రంలో యువతరమే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు’ అని మరో యువ నేత పేర్కొన్నారు. ఇప్పటికే యువతకు అవకాశం శాసనసభ, సాధారణ ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేయడం కోసం పార్టీలో ప్రతిభ కనబరుస్తున్న యువనాయకులను ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు పంపించారు. అలాగే సచిన్ పైలట్ వంటి యువకులు పీసీసీ అధ్యక్షులుగా ఉండటంలో రాహుల్ పాత్ర ఉంది. ప్రజా సమస్యలపై అనునిత్యం లోక్‌సభలో గొంతెత్తే సుస్మితాదేవ్ ప్రస్తుతం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. పార్టీ తరపున లోక్‌సభలో ఆందోళన జరుగుతుంటే కొందరు సీనియర్లు వారి స్థానాలకే పరిమితమవుతున్నారు. క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితి ఉండరాదని రాహుల్ భావిస్తున్నట్టు ఓ మాజీ ఎంపీ తెలిపారు. యువ నేతల్లో దూకుడుగా ఉండే జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్, దీపేందర్‌హుడా, గౌరవ్ గొగోయ్, సుస్మితాదేవ్, రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, మీనాక్షి నటరాజన్ తదితరులకు ఏఐసీసీలో కీలక పదవులు దక్కే వీలుంది. ప్రస్తుతం ఉన్న రాహుల్ టీమ్‌లో ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు కీలకపాత్ర పోషిస్తుండగా మున్ముం దు కూడా ఆయన అంతే కీలకం కానున్నారు. ఇప్పటివరకున్న ప్రధాన కార్యదర్శులందరినీ తప్పించి చురుగ్గా ఉండే నేతలకు అవకాశమిచ్చి ఎన్నికలకు నూతనోత్సాహంతో వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్‌గా రాహుల్ న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ(47) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల విభాగం చీఫ్ ముళ్లపల్లి రామచంద్రన్ ప్రకటించారు. ఈ నెల 16న రాహుల్ పార్టీ పగ్గాలు అందుకుంటారన్నారు. రాహుల్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ దాఖలైన 89 నామినేషన్లు నిబంధనల మేరకు ఉన్నట్లు వెల్లడించారు. 2013లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా రాహుల్ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా 19 ఏళ్లుగా కొనసాగుతున్న సోనియా గాంధీ నుంచి రాహుల్ పార్టీ పగ్గాలు స్వీకరిస్తారు. కాంగ్రెస్ చీఫ్‌గా ఎన్నికైన రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. -
కొత్త సారథులు
⇒ సమర్థతకు పెద్దపీట.. ⇒విధేయులకు కీలక పోస్టులు ⇒జాయింట్ కలెక్టర్లకు స్థానచలనం ⇒కలెక్టర్‌గా రఘునందన్‌రావు ⇒జేసీ-1గా రజత్‌కుమార్ ⇒జేసీ-2గా హరిచందన ⇒సబ్ కలెక్టర్‌గా వర్షిణి సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: జిల్లా టీమ్ మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్కు యంత్రాంగం కొలువుదీరింది. సారథుల కూర్పులో సమర్థతను ప్రామాణికంగా తీసుకున్న సర్కారు.. విధేయులకు పెద్దపీట వేసింది. అధికారయంత్రాంగాన్ని ప్రక్షాళన చేసిన ప్రభుత్వం.. కొత్త సారథులను నియమించింది. కలెక్టర్ సహా జాయింట్ కలెక్టర్లు, సబ్‌కలెక్టర్‌ను బదిలీ చేస్తూ ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి సీఎండీగా బదిలీ అయిన కలెక్టర్ స్థానే ఎం.రఘునందన్‌రావు(2002)ను నియమించింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన రఘునందన్ ఇటీవల తెలంగాణ కేడర్‌కు బదిలీ అయ్యారు. సొంత జిల్లా మెదక్ కావడం, మొదట్నుంచి సీఎం కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం జిల్లా కలెక్టర్ పోస్టింగ్‌లో రఘునందన్‌కు కలిసొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వివాదరహిత, ముక్కుసూటి అధికారిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఇద్దరు జేసీలకు స్థాన చలనం ఐఏఎస్ అధికారుల విభజన అనంతరం యంత్రాంగంలో సమూల మార్పులు జరుగుతాయనే ‘సాక్షి’ కథనం అక్షరసత్యమైంది. పక్షం రోజుల క్రితమే కలెక్టర్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం.. తాజాగా జాయింట్ కలెక్టర్లు ఎం.చంపాలాల్, ఎం.వీ.రెడ్డికి స్థానచలనం కలిగింది. ఏడాదిన్నర క్రితం ఒకే రోజు జేసీలుగా బాధ్యతలు స్వీకరించిన ఈ ఇద్దరికి కొత్తగా పోస్టింగ్‌లు ఇవ్వలేదు. వీరిరువురి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు కేటాయించిన యువ ఐఏఎస్‌లను భర్తీ చేసింది. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పీఓగా పనిచేసిన రజత్‌కుమార్ సైనీ(2007)ని జేసీ-1 నియమించింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రజత్ ఎక్కువకాలం పశ్చిమబెంగాల్లో సేవలందించారు. జేసీ-2గా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా పనిచేసిన దాసరి హరిచందన(2010)ను నియమించారు. ఆమె సీనియర్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాస్ కూతురు. సబ్ కలెక్టర్‌గా వర్షిణి వికారాబాద్ సబ్‌కలెక్టర్‌గా వీఎస్ అలగు వర్షిణి(2012) నియమితులయ్యారు. తమిళనాడు రాష్ట్రం పొల్లచ్చికి చెందిన వర్షిణి తొలుత దంత వైద్యురాలిగా సేవలందించారు. ఆ తర్వాత ఇండియన్ పోస్టల్ సర్వీస్ (ఐపీఎస్)కు ఎంపికయ్యారు. మూడో ప్రయత్నంలో ఐఏఎస్ కు ఎంపికైన ఆమె ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇటీవల అధికారుల కేటాయింపుల్లో వర్షిణిని తెలంగాణ కేడర్‌కు మార్చారు. ఈ నేపథ్యంలో ఆమెకు వికారాబాద్ సబ్‌కలెక్టర్‌గా తొలి పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం ఇక్కడ పనిచేస్తున్న హరినారాయణ్‌ను ఏపీకి బదిలీ చేస్తూ సోమవారం రిలీవ్ చేసింది. నలుగురూ ఏపీ నుంచే.. కొత్తగా పదవులు చేపడుతున్న నలుగురు ఐఏఎస్ అధికారులు ఏపీ నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. రాష్ట్ర విభజన నేపథ్యంలో వీరిని తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దీంతో అక్కడి నుంచి బదిలీపై వచ్చిన వీరికి మన ప్రభుత్వం తాజాగా పోస్టింగ్లిచ్చింది. రఘునందన్‌రావు మెదక్ జిల్లా వాసి.. జిల్లా కలెక్టర్‌గా నియమితులైన రఘునందన్‌రావు సొంత జిల్లా మెదక్. అమెరికాలోని యూనివర్సిటీ నుంచి ఎంఏలో మాస్టర్ డిగ్రీ పొందారు. గ్రూప్1 సర్వీసు నుంచి 2002లో ఐఏఎస్‌గా పదోన్నతి పొందిన ఆయన.. గతంలో ప్రకాశం జిల్లా కందుకూరు రెవెన్యూ డివిజినల్ అధికారిగా పనిచేశారు. ఆ తర్వాత కొత్తగుడెం ఆర్డీఓగా, ఆదే జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకుడిగా పనిచేశారు. అనంతరం ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, సెర్ప్ అదనపు సీఈఓగా పనిచేసి కృష్ణాజిల్లా కలెక్టర్‌గా బదిలీ అయిన ఆయన.. తాజాగా జిల్లాకు కలెక్టర్‌గా వచ్చారు. రజత్‌ది ఉత్తరప్రదేశ్.. జాయింట్ కలెక్టర్-1గా నియమితులైన రజత్‌కుమార్ సైనీ ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. 2007లో ఐఏఎస్‌కు ఎంపికైన ఆయన పశ్చిమబెంగాల్లో పనిచేశారు. అసిస్టెంట్ కలెక్టర్‌గా ముర్శిదాబాద్‌లో పనిచేశారు. అనంతరం సిలిగురిలో ఎస్‌డీఓగా, డార్జిలింగ్, మిడ్నిపూర్ జిల్లాలో కూడా పనిచేశారు. ఆ తర్వాత 2013లో ప్రకాశం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా ఆంద్రప్రదేశ్‌కు బదిలీ అయ్యారు. తాజాగా జేసీ-1గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. హరిచందనది.. హైదరాబాద్ ఎంవీ రెడ్డి సోమవారం జిల్లా నుంచి రిలీవ్ కాగా, కొత్త జేసీ-2గా హరిచందన బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన హరిచందన 2010లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. శిక్షణ పూర్తిచేసుకున్న అనంతరం విజయవాడ సబ్ కలెక్టర్‌గా విధుల్లో చేరారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి వద్ద కార్యనిర్వాహక సహాయకురాలిగా పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సొంత రాష్ట్రానికి బదిలీ కాగా, రాష్ట్ర ప్రభుత్వం జిల్లా జేసీ-2గా నియమించింది. లండన్‌లో మాస్టర్ డిగ్రీ.. హరిచందన హైదరాబాద్‌లోని సెయింట్‌ఆన్స్ కళాశాలలో బీఏ పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏంఏ చదివారు. ఆ తర్వాత లండన్ విశ్వవిద్యాలయంలో రాజనీతి విభాగంలో మాస్టర్ డిగ్రీ తీసుకున్నారు. సంక్షేమ పథకాలకే తొలి ప్రాధాన్యం.. ‘ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పక్కాగా లబ్ధిదారులకు చేరవేయడమే తొలి ప్రాధాన్యం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఆహారభద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తా. మొత్తంగా ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతం చేస్తా. జిల్లాలో 17 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలి సింది. వారి మృతికి కారణాలు తెలుసుకునేం దుకు ప్రయత్నిస్తా. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తా.’ -
‘చే’జారేనా..?
- డీసీసీబీపై కన్నేసిన టీఆర్ ఎస్ - యడవెల్లి విజయేందర్‌రెడ్డి రాజీనామాకు అధికారిక ఆమోదమే తరువాయి - ఇక తప్పని ఎన్నిక.. చైర్మన్ పోస్టు కోసం ఇప్పటికే ‘వర్గ’ పోరు సాక్షిప్రతినిధి, నల్లగొండ: సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్‌కు జిల్లాలో మిగిలిన ప్రధానపోస్టులు రెండు. అంతకు ముందే జరిగిన సహకార ఎన్నికల్లో డీసీసీబీ చైర్మన్, స్థానిక ఎన్నికల్లో జిల్లాపరిషత్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ నిలబెట్టుకుంది. ఈ రెండింట ఆ పార్టీకి తిరుగులేని మెజారిటీ ఉంది. అయితే సహకార ఎన్నికలు పార్టీల ప్రాతిపదికన జరిగినవి కావు. దీంతో డెరైక్టర్లు తమ ఇష్టమున్న పార్టీ తరఫున పనిచేసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ సొంతింటి రాజకీయాలతో చివరకు తన చేతిలో ఉన్న ప్రధానమైన డీసీసీబీని చేజేతులా వదులుకుంటోం దన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీ డీసీసీబీపైనా నజర్ పెట్టినట్లు చెబుతున్నారు. రెండోసారి చైర్మన్‌గా ఎన్నికైన విజయేందర్‌రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ల నుంచి తీవ్రమైన ఒత్తిడే ఉంది. సహకార ఎన్నికలకు ముందు పార్టీలో అంతర్గతంగా చేసుకున్న ఒప్పందం మేరకు విజయేందర్‌రెడ్డిని దీర్ఘకాలిక సెలవుపై పంపించి, వైస్‌చైర్మన్‌గా ఉన్న ముక్తవరపు పాండురంగారావును ఇన్ చార్జ్ చైర్మన్‌గా చేయాలన్నది ఆ ఒప్పంద సారాంశం. ఈ మేరకు విజయేందర్‌రెడ్డి తప్పని పరిస్థితుల్లో ఆరు నెలల పాటు సెలువులో వెళ్లిపోయారు. ఈలోగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. దీంతో ఆయన తిరిగి తన బాధ్యతల్లో చేరిపోయారు. అయినా, ఒప్పందం మేరకు పక్కకు తప్పుకోవాల్సిందేనని ఓ మాజీ మంత్రి ఒత్తిడి పెట్టడంతో ఆయన రాజీనామా చేశారు. మంగళవారం ఆయన ఈ మేరకు రాష్ట్ర సహకార శాఖ అధికారులకు తన రాజీనామా లేఖను సమర్పించారు. ఇది ఆమోదం పొందడమే మిగిలింది. చైర్మన్ రాజీనామా ఆమోదం పొందితే మళ్లీ ఎన్నిక జరపాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ వెలువడే వరకు మాత్రమే ఇన్చార్జ్ చైర్మన్‌గా పాండురంగారావుకు అవకాశం ఉంటుంది. ఆయననే తిరిగి చైర్మన్‌గా ఎన్నుకోవాలంటే డెరైక్టర్లలో మెజారిటీ ఉండాలి. వాస్తవానికి డీసీసీబీ డెరైక్టర్లు అంతా (19) కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. కానీ, వీరిలో భువనగిరి ప్రాంతానికి చెందిన ఓ డెరైక్టర్ చైర్మన్ పోస్టుపై ఆశ పెంచుకున్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రులు చెప్పినట్లు నడుచుకున్న డెరైక్టర్లు ఇప్పుడు మళ్లీ వారి మాట విని, పార్టీ సూచించే అభ్యర్థినే ఎన్నుకుంటారా అన్నది ప్రశ్నార్థకమే. ఇప్పటికే కాంగ్రెస్ డెరైక్టర్లలో వర్గపోరు ఉంది. ఈ సారి చైర్మన్ పదవిని ఎట్టి పరిస్థితుల్లో ఆయకట్టేతర ప్రాంతానికి ఇవ్వాలన్నది వీరి డిమాండ్. డీసీసీబీలో కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ పరిణామాలను గమనిస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీ.. డెరైక్టర్లలో కొందరిని తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. 19 మంది డెరైక్టర్లలో కనీసం 10 మంది మద్దతు కూడగ ట్టగలిగితే డీసీసీబీపై టీఆర్ఎస్ జెండా ఎగరేయవచ్చన్న వ్యూహంతో ఉన్నారు. మునుగోడు, ఆలేరు నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు డెరైక్టర్లు మధ్యలో ఓసారి అవిశ్వాసం పెట్టాలన్న ఆలోచన కూడా పెట్టారు. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు, డెరైక్టర్లలో ఉన్న వర్గపోరు ద్వారా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో గులాబీ నేతలు ఉన్నట్లు చెబుతున్నారు. డీసీసీబీ రాజకీయం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.