కొత్త సారథులు
⇒ సమర్థతకు పెద్దపీట..
⇒విధేయులకు కీలక పోస్టులు
⇒జాయింట్ కలెక్టర్లకు స్థానచలనం
⇒కలెక్టర్‌గా రఘునందన్‌రావు
⇒జేసీ-1గా రజత్‌కుమార్
⇒జేసీ-2గా హరిచందన
⇒సబ్ కలెక్టర్‌గా వర్షిణి
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: జిల్లా టీమ్ మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్కు యంత్రాంగం కొలువుదీరింది. సారథుల కూర్పులో సమర్థతను ప్రామాణికంగా తీసుకున్న సర్కారు.. విధేయులకు పెద్దపీట వేసింది. అధికారయంత్రాంగాన్ని ప్రక్షాళన చేసిన ప్రభుత్వం.. కొత్త సారథులను నియమించింది. కలెక్టర్ సహా జాయింట్ కలెక్టర్లు, సబ్‌కలెక్టర్‌ను బదిలీ చేస్తూ ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
సింగరేణి సీఎండీగా బదిలీ అయిన కలెక్టర్ స్థానే ఎం.రఘునందన్‌రావు(2002)ను నియమించింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన రఘునందన్ ఇటీవల తెలంగాణ కేడర్‌కు బదిలీ అయ్యారు. సొంత జిల్లా మెదక్ కావడం, మొదట్నుంచి సీఎం కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం జిల్లా కలెక్టర్ పోస్టింగ్‌లో రఘునందన్‌కు కలిసొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వివాదరహిత, ముక్కుసూటి అధికారిగా ఆయనకు గుర్తింపు ఉంది.
ఇద్దరు జేసీలకు స్థాన చలనం
ఐఏఎస్ అధికారుల విభజన అనంతరం యంత్రాంగంలో సమూల మార్పులు జరుగుతాయనే ‘సాక్షి’ కథనం అక్షరసత్యమైంది. పక్షం రోజుల క్రితమే కలెక్టర్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం.. తాజాగా జాయింట్ కలెక్టర్లు ఎం.చంపాలాల్, ఎం.వీ.రెడ్డికి స్థానచలనం కలిగింది. ఏడాదిన్నర క్రితం ఒకే రోజు జేసీలుగా బాధ్యతలు స్వీకరించిన ఈ ఇద్దరికి కొత్తగా పోస్టింగ్‌లు ఇవ్వలేదు. వీరిరువురి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు కేటాయించిన యువ ఐఏఎస్‌లను భర్తీ చేసింది.
విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పీఓగా పనిచేసిన రజత్‌కుమార్ సైనీ(2007)ని జేసీ-1 నియమించింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రజత్ ఎక్కువకాలం పశ్చిమబెంగాల్‌లో సేవలందించారు. జేసీ-2గా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా పనిచేసిన దాసరి హరిచందన(2010)ను నియమించారు. ఆమె సీనియర్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాస్ కూతురు.
సబ్ కలెక్టర్‌గా వర్షిణి
వికారాబాద్ సబ్‌కలెక్టర్‌గా వీఎస్ అలగు వర్షిణి(2012) నియమితులయ్యారు. తమిళనాడు రాష్ట్రం పొల్లచ్చికి చెందిన వర్షిణి తొలుత దంత వైద్యురాలిగా సేవలందించారు. ఆ తర్వాత ఇండియన్ పోస్టల్ సర్వీస్ (ఐపీఎస్)కు ఎంపికయ్యారు. మూడో ప్రయత్నంలో ఐఏఎస్ కు ఎంపికైన ఆమె ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇటీవల అధికారుల కేటాయింపుల్లో వర్షిణిని తెలంగాణ కేడర్‌కు మార్చారు. ఈ నేపథ్యంలో ఆమెకు వికారాబాద్ సబ్‌కలెక్టర్‌గా తొలి పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం ఇక్కడ పనిచేస్తున్న హరినారాయణ్‌ను ఏపీకి బదిలీ చేస్తూ సోమవారం రిలీవ్ చేసింది.
నలుగురూ ఏపీ నుంచే..
కొత్తగా పదవులు చేపడుతున్న నలుగురు ఐఏఎస్ అధికారులు ఏపీ నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. రాష్ట్ర విభజన నేపథ్యంలో వీరిని తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దీంతో అక్కడి నుంచి బదిలీపై వచ్చిన వీరికి మన ప్రభుత్వం తాజాగా పోస్టింగ్‌లిచ్చింది.
రఘునందన్‌రావు మెదక్ జిల్లా వాసి..
జిల్లా కలెక్టర్‌గా నియమితులైన రఘునందన్‌రావు సొంత జిల్లా మెదక్. అమెరికాలోని యూనివర్సిటీ నుంచి ఎంఏలో మాస్టర్ డిగ్రీ పొందారు. గ్రూప్1 సర్వీసు నుంచి 2002లో ఐఏఎస్‌గా పదోన్నతి పొందిన ఆయన.. గతంలో ప్రకాశం జిల్లా కందుకూరు రెవెన్యూ డివిజినల్ అధికారిగా పనిచేశారు. ఆ తర్వాత కొత్తగుడెం ఆర్డీఓగా, ఆదే జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకుడిగా పనిచేశారు. అనంతరం ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, సెర్ప్ అదనపు సీఈఓగా పనిచేసి కృష్ణాజిల్లా కలెక్టర్‌గా బదిలీ అయిన ఆయన.. తాజాగా జిల్లాకు కలెక్టర్‌గా వచ్చారు.
రజత్‌ది ఉత్తరప్రదేశ్..
జాయింట్ కలెక్టర్-1గా నియమితులైన రజత్‌కుమార్ సైనీ ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. 2007లో ఐఏఎస్‌కు ఎంపికైన ఆయన పశ్చిమబెంగాల్‌లో పనిచేశారు. అసిస్టెంట్ కలెక్టర్‌గా ముర్శిదాబాద్‌లో పనిచేశారు. అనంతరం సిలిగురిలో ఎస్‌డీఓగా, డార్జిలింగ్, మిడ్నిపూర్ జిల్లాలో కూడా పనిచేశారు. ఆ తర్వాత 2013లో ప్రకాశం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా ఆంద్రప్రదేశ్‌కు బదిలీ అయ్యారు. తాజాగా జేసీ-1గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
హరిచందనది.. హైదరాబాద్
ఎంవీ రెడ్డి సోమవారం జిల్లా నుంచి రిలీవ్ కాగా, కొత్త జేసీ-2గా హరిచందన బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన హరిచందన 2010లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. శిక్షణ పూర్తిచేసుకున్న అనంతరం విజయవాడ సబ్ కలెక్టర్‌గా విధుల్లో చేరారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి వద్ద కార్యనిర్వాహక సహాయకురాలిగా పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సొంత రాష్ట్రానికి బదిలీ కాగా, రాష్ట్ర ప్రభుత్వం జిల్లా జేసీ-2గా నియమించింది.
లండన్‌లో మాస్టర్ డిగ్రీ..
హరిచందన హైదరాబాద్‌లోని సెయింట్‌ఆన్స్ కళాశాలలో బీఏ పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏంఏ చదివారు. ఆ తర్వాత లండన్ విశ్వవిద్యాలయంలో రాజనీతి విభాగంలో మాస్టర్ డిగ్రీ తీసుకున్నారు.
సంక్షేమ పథకాలకే తొలి ప్రాధాన్యం..
‘ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పక్కాగా లబ్ధిదారులకు చేరవేయడమే తొలి ప్రాధాన్యం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఆహారభద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తా. మొత్తంగా ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతం చేస్తా. జిల్లాలో 17 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలి సింది. వారి మృతికి కారణాలు తెలుసుకునేం దుకు ప్రయత్నిస్తా. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తా.’