joint collectors
-
కాసేపట్లో కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లతో సీఎం రేవంత్ భేటీ
-
జేసీల పరిధిలోనూ ‘వెబ్‌ల్యాండ్’ సమస్యల పరిష్కారం
సాక్షి, అమరావతి: వెబ్‌ల్యాండ్‌లో భూములకు సంబంధించిన మార్పులు చేసే అవకాశాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్లకు ప్రభుత్వం కల్పించింది. మొన్నటివరకు ప్రాథమిక స్థాయిలో కేవలం తహశీల్దార్లు మాత్రమే వెబ్‌ల్యాండ్‌లో మార్పులు చేసే అవకాశం ఉండేది. ఆ తర్వాత ఉన్నత స్థాయిలో మార్పులు చేయాలంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) కార్యాలయంలోని కంప్యూటరైజేషన్ ఆఫ్ మండల రెవెన్యూ ఆఫీసెస్ (సీఎంఆర్వో) ప్రాజెక్ట్ డైరెక్టర్‌కే అవకాశం ఉండేది. అంటే తహశీల్దార్ స్థాయిలో మార్పును తిరస్కరిస్తే దాన్ని పైస్థాయిలో సీసీఎల్ఏ కార్యాలయంలోనే మార్చడానికి అవకాశం ఉండేది. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. స్పందన కార్యక్రమంలో దీనిపై ప్రజల నుంచి పెద్దఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ అధికారాన్ని జాయింట్ కలెక్టర్లకు సైతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే నంబర్లు మిస్ అవడం, 22ఏ కేసుల్లో ప్రభుత్వ భూమి నుంచి ప్రైవేటు భూమిగా మార్పు చేయడం, సివిల్, రెవెన్యూ కోర్టులు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా చేయాల్సిన మార్పులతోపాటు భూసమీకరణ, భూ యాజమాన్య మార్పు, భూముల కేటాయింపునకు సంబంధించి మార్పులను జాయింట్ కలెక్టర్ల లాగిన్ నుంచి చేసేందుకు తాజాగా అవకాశం కల్పించారు. ఇందుకు అనుగుణంగా వెబ్‌ల్యాండ్‌లో మార్పులు చేస్తున్నారు. జాయింట్ కలెక్టర్లు ఈ మార్పులు చేసేముందు నిబంధనల ప్రకారం అన్ని విషయాలు పరిశీలించాలని, ఎందుకు మార్పు జరుగుతుందో వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసిన తర్వాతే మార్పులు చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సీసీఎల్ఏ జి.సాయిప్రసాద్ ఇటీవల సర్క్యులర్ జారీ చేశారు. -
మా ఉత్తర్వులు థియేటర్లన్నింటికీ వర్తిస్తాయి
సాక్షి, అమరావతి: లైసెన్స్ జారీ అధికారులైన జాయింట్ కలెక్టర్లను సంప్రదించాకే సినిమా టికెట్ ధరలను ఖరారు చేసుకోవాలంటూ తాము ఇచ్చిన ఉత్తర్వులు రాష్ట్రంలోని సినిమా థియేటర్ల యాజమాన్యాలన్నింటికీ వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టుకొచ్చిన థియేటర్ల యజమానులకే తమ ఉత్తర్వులు వర్తిస్తాయంటూ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన పత్రికా ప్రకటనను హైకోర్టు తప్పుపట్టింది. పత్రికాముఖంగా అలాంటి ప్రకటనలు ఇవ్వొద్దని ఆయనకు చెప్పాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్‌కు సూచించింది. ఈ మొత్తం వ్యవహారంలో అదనపు మెటీరియల్ పేపర్లను కోర్టు ముందుంచేందుకు ప్రభుత్వ న్యాయవాది(హోం) మహేశ్వరరెడ్డి కొంత గడువు కోరడంతో హైకోర్టు అందుకు అంగీకరించింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, పంచాయతీల పరిధుల్లో టికెట్ ధరలను ఖరారు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 35తో సంబంధం లేకుండా, ఈ జీవో జారీకి ముందున్న విధంగానే టికెట్ ధరలను ఖరారు చేసుకోవచ్చునంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ అప్పీళ్లపై గత వారం విచారణ జరిపిన ధర్మాసనం.. తాజాగా సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా థియేటర్ల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. జాయింట్ కలెక్టర్‌ను సంప్రదించాకే టికెట్ ధరలను ఖరారు చేసుకోవాలన్న ధర్మాసనం ఉత్తర్వులు కేవలం హైకోర్టును ఆశ్రయించినవారికి మాత్రమే వర్తిస్తాయంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి పత్రికా ప్రకటన జారీ చేశారని తెలిపారు. దీనిపై తాము తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నామన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. గతవారం తామిచ్చిన ఉత్తర్వుల్లో థియేటర్లు అని స్పష్టంగా పేర్కొన్నామని.. దీని అర్థం రాష్ట్రంలో ఉన్న అన్ని థియేటర్లనీ స్పష్టతనిచ్చింది. -
భక్తిశ్రద్ధలతో కడప పెద్దదర్గా ఉరుసు
కడప కల్చరల్: దేశంలో ప్రముఖ సూఫీ పుణ్యక్షేత్రమైన వైఎస్సార్ జిల్లా కడప అమీన్‌పీర్ దర్గాలోని హజరత్ సూఫీ సరమస్త్‌సాని చల్లాకష్ ఖ్వాజా సయ్యద్‌షా ఆరీఫుల్లా మొహమ్మద్ మహమ్మదుల్ హుసేనీ చిష్ఠివుల్ ఖాద్రి సాహెబ్ ఉరుసు ఉత్సవాలు ఆదివారం రెండోరోజు ఘనంగా కొనసాగాయి. డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్‌బాషా ప్రభుత్వం తరఫున చాదర్ సమర్పించారు. పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ పర్యవేక్షణలో ఆయన సంప్రదాయబద్ధంగా ఫకీర్ల మేళతాళాలు, విన్యాసాలు, నాత్ గీతాలాపనల మధ్య ఊరేగింపుగా దర్గా వద్దకు చాదర్‌ను తీసుకెళ్లారు. పీఠాధిపతి ఆధ్వర్యంలో గురువుల మజార్ వద్ద గంధంతోపాటు చాదర్‌ను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు, ఫాతెహా చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ విజయరామరాజు, జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికారులు, నగర ప్రముఖులు, దర్గా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
పేదల ఇళ్ల కోసం ప్రత్యేకంగా జేసీలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ – జగనన్న కాలనీల్లో పేదల ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జిల్లాకు ఒక జాయింట్ కలెక్టర్‌ను నియమించింది. వీరు వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా చూడాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం రెండు ఫేజ్‌ల్లో రూ. 50,944 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ జేసీలకు హౌసింగ్, ఎనర్జీ, రూరల్ వాటర్, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఏపీ ఫైబర్ నెట్, గ్రామ, వార్డు శాఖల అధికారులు సహకరించాల్సి ఉంటుంది. మొదటి దశ జూన్ 2022, రెండో దశ జూన్ 2023 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. చదవండి: Andhra Pradesh: లక్షల్లో ఇళ్లు.. వేలల్లో ఊళ్లు Andhra Pradesh: రైతుకు ఫుల్ ‘పవర్’ -
సంక్షేమ పథకాల అమలు: ఏపీలో కీలక సంస్కరణ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాలనలో మరో కీలక సంస్కరణ తీసుకువచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు 13మంది జాయింట్ కలెక్టర్లను నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇప్పటికే జిల్లాకు ఇద్దరు జాయింట్ కలెక్టర్లు ఉండగా, తాజా నిర్ణయంతో వారి సంఖ్య ముగ్గురికి చేరింది. (వారి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది: సీఎం జగన్ ) అలాగే ముగ్గురు జేసీల శాఖలను బదలాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రైతు భరోసా, రెవెన్యూ శాఖ.. గ్రామ, వార్డు, సచివాలయాల అభివృద్ధి.. ఆసరా, సంక్షేమ శాఖలకు ఒక్కోరి చొప్పున ప్రత్యేకంగా కొత్త జేసీలను నియమించింది. వీరికి మరికొన్ని శాఖలకు సంబంధించిన బాధ్యతల్ని అప్పగించింది. 1) రైతు భరోసా, రెవెన్యూ శాఖ జేసీ : అగ్రి కల్చర్, సివిల్ సప్లయ్స్, మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, అనిమల్ హస్బండరీ, హార్టికల్చర్, ఫిషరింగ్, సెరీకల్చర్, రెవెన్యూ అండ్ సర్వే, నాచురల్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇరిగేషన్, లా అండ్ ఆర్డర్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, మైన్స్ అండ్ జీయోలజీ, ఎనర్జీ 2) గ్రామ, వార్డు సచివాలయాల అభివృద్ధి జేసీ : డెవలప్మెంట్ ఆఫ్ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ అండ్ విలేజ్ అండ్ వార్డ్ వాలంటీర్స్, పంచాయితీ రాజ్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, స్కూల్ ఎడ్యూకేషన్, టెక్నికల్ ఎడ్యూకేషన్, హైయ్యర్ ఎడ్యూకేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, హౌసింగ్, మీ సేవా, ఆర్టీజీ అండ్ ఐటీఈ అండ్ సీ డిపార్ట్మెంట్, ఆల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్(ఎనర్జీ, ఇరిగేషన్ మినహా) 3) ఆసరా, సంక్షేమ శాఖ జేసీ : రూరల్ డెవలప్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీస్ వెల్ఫేర్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఎండో మెంట్స్, స్కిల్ డెవలెప్ మెంట్. -
జేసీలుగా 2014 బ్యాచ్ ఐఏఎస్‌లు
• {పస్తుతం 24 మంది వివిధ హోదాల్లో • వారిలో సింహభాగం జేసీలుగా అవకాశం • మిగతాచోట్ల డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు చాన్స్ సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు తాజా బ్యాచ్ ఐఏఎస్ అధికారులను నియమించేందుకు రంగం సిద్ధమవుతోంది. 21 జిల్లాలకు 21 మంది జాయింట్ కలెక్టర్లు కావాల్సి ఉంది. అంతే సంఖ్యలో కలెక్టర్ల అవసరమూ ఉంది. కలెక్టర్ల కోసమే అంతా శోధించి నియమించాలన్నా సరిపోని పరిస్థితిలో... జాయింట్ కలెక్టర్లకు పూర్తి జూనియర్ల నియామకం తప్పని పరిస్థితి తలెత్తింది. నాన్ కేడర్ అధికారులనే జేసీలుగా నియమించాలనుకున్న ప్రభుత్వం... ఉన్నంతమేర జూనియర్ ఐఏఎస్ అధికారులకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. 2014 బ్యాచ్‌కు సంబంధించిన ఐఏఎస్ అధికారులు ప్రస్తుతం సబ్‌కలెక్టర్లుగా శిక్షణలో ఉండగా, కొందరు జాయింట్ సెక్రటరీలుగా, మరికొందరు పురపాలక శాఖలో పనిచేస్తున్నారు. ఇలా మొత్తం 24 మందివరకు ఉన్నారు. వీరిలో ఐదారుగురు మినహా మిగతావారిని జాయింట్ కలెక్టర్లుగా నియమించే దిశగా కసరత్తు చేసినట్టు సమాచారం. ఆ బ్యాచ్ కు సంబంధించిన ఐఏఎస్ అధికారుల్లో 8 మంది జాయింట్ సెక్రటరీలుగా సచివాలయంలో పనిచేస్తున్నారు. వీరందరినీ జాయింట్ కలెక్టర్లుగా నియమించాలని భావిస్తున్నట్టు తెలిసింది. సోమవారం నాటికి వీరికి పోస్టింగ్స్ ఇస్తారని చెబుతున్నారు. వీరందరినీ జాయింట్ కలెక్టర్లుగా నియమిస్తే... ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న విధుల్లోకి ఎవరిని తీసుకోవాలనే విషయంలో మళ్లీ గందరగోళం నెలకొనే పరిస్థితి ఉంది. దీంతో కొన్ని జిల్లాలకే ఐఏఎస్ అధికారులను కేటాయించి మిగతావాటికి నాన్‌కేడర్ సీనియర్ అధికారులను నియమించాలనే అంశాన్ని కూడా పరిశీలించారు. ఆశగా ఎదురుచూస్తున్న గ్రూప్-1 అధికారులు ప్రస్తుతం స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు 22 మంది, డిప్యూటీ కలెక్టర్లుగా డెరైక్ట్ రిక్రూటీలు మరో 22 మంది ఉన్నారు. ఇందులో స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లలో ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తయినవారు 8 మంది, డిప్యూటీ కలెక్టర్లుగా ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారు మరో 8 మంది ఉన్నారు. సాధారణంగా ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే ఐఏఎస్ హోదాకు పోటీపడుతుంటారు. ఇప్పుడు ఈ 16 మందిలోంచి కొందరిని ఐఏఎస్‌లుగా నియమించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇక జూనియర్ ఐఏఎస్‌లను జాయింట్ కలెక్టర్లుగా నియమించే పక్షంలో వారి స్థానంలో కూడా ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తయిన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డెరైక్ట్ రిక్రూటీలైన డిప్యూటీ కలెక్టర్లను నియమించే అవకాశం ఉంది. మరోవైపు గ్రూప్-1 అధికారులను ఆ పోస్టుల్లో నియమించాలనే డిమాండ్‌ను ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా తిరస్కరించలేదు. అయితే వారికంటే రెవెన్యూ అధికారులకే అవకాశాలు ఎక్కువుంటాయనే చర్చ నడుస్తోంది. దీంతో గ్రూప్-1 అధికారులు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు. జోనల్ విధానం రద్దుకు డిమాండ్ ప్రస్తుతం స్పెషల్ గ్రేడ్, డెరైక్ట్ రిక్రూటీ డిప్యూటీ కలెక్టర్ పోస్టులు రాష్ట్ర స్థాయిలో పోస్టులుగా ఉన్నాయి. కానీ తహసీల్దార్ పోస్టులు మాత్రం జోనల్ పోస్టుల జాబితాలో ఉన్నాయి. జిల్లాల విభజన నేపథ్యంలో ఈ పోస్టులను కూడా రాష్ట్ర స్థాయి పోస్టులుగా మార్చి పోస్టింగులో వారికి ఆప్షన్ వెసులుబాటు కల్పించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఏ జిల్లాలో ఉన్నవారు అదే జిల్లా పరిధిలో ఏర్పడే కొత్త జిల్లాల్లో పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా పనిచేసేలా వారికి అవకాశం ఇవ్వాలని రెవెన్యూ అధికారుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. -
కలెక్టర్లు కావలెను
► 31 జిల్లాలకు 62 మంది ఐఏఎస్‌లు అవసరం.. 31 మంది కలెక్టర్లు, 31 మంది జేసీలు కావాలి ► ఉన్నవారందరినీ సర్దుబాటు చేసినా ఇంకా 11 మంది కొరత ► ఐదేళ్ల సర్వీసుంటే కలెక్టర్‌గా చాన్స్ ► జూనియర్లకు సైతం జేసీ పోస్ట్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి మళ్లీ ఐఏఎస్ అధికారుల కొరత ముంచుకొచ్చింది. ప్రస్తుతమున్న జిల్లాల సంఖ్యను మూడింతలకు మించి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ సమస్య మరింత ముదిరింది. ఇప్పుడున్న పరిస్థితిలో కేవలం అయిదేళ్ల సర్వీసు ఉన్న ఐఏఎస్ అధికారులకు సైతం కలెక్టర్ పోస్టింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం పని చేస్తున్న ఐఏఎస్‌లలో... ఒక సబ్ కలెక్టర్ మినహా అందరినీ జాయింట్ కలెక్టర్లుగా నియమించక తప్పదని అంటున్నాయి. రాష్ట్రస్థాయిలో ప్రస్తుతమున్న వివిధ విభాగాల అధిపతులను సైతం జిల్లాలకు పంపించాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్త జిల్లాలు కొలువు తీరుతున్న నేపథ్యంలో రెండు మూడు రోజుల్లోనే కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను నియమించాల్సి ఉంది. కొత్త జిల్లాల నోటిఫికేషన్ వెలువడేంత వరకు ఈ ఉత్తర్వులు జారీ చేయకపోయినా.. సూచనప్రాయంగా ఐఏఎస్ అధికారులకు ముందస్తుగానే మౌఖిక సమాచారం చేరవేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఐఏఎస్ అధికారులను కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లుగా సర్దుబాటు చేసినా ఇంకా 11 మంది ఐఏఎస్‌లు కావాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ కొరతను అధిగమించేందుకు నాన్ కేడర్ అధికారులను కూడా జాయింట్ కలెక్టర్లుగా నియమించాలని యోచిస్తోంది. నిర్దేశిత కేడర్లోనే కొరత తెలంగాణకు కేంద్రం కేటాయించిన మొత్తం ఐఏఎస్ అధికారుల సంఖ్య 208. కానీ ఇటీవల అదనంగా కేటాయించిన 45 మంది అధికారులను ఇప్పటికీ ఇవ్వలేదు. ప్రస్తుతం తెలంగాణ కేడర్‌లో పనిచేస్తున్న వారు 126. ఇందులో 12 మంది అధికారులు కేంద్ర సర్వీసులో ఉన్నారని సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఉన్నత పోస్టుల్లో ఐఏఎస్‌ల కొరత ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో కిందిస్థాయిలో కూడా ఈ కొరత పెరిగిపోనుంది. కేంద్రం నోటిఫై చేసిన ప్రకారం 10 కలెక్టర్, 11 జాయింట్ కలెక్టర్ కేడర్ పోస్టులున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పడనున్న 21 జిల్లాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 31కి చేరనుంది. దీంతో 31 మంది కలెక్టర్లు, 31 మంది జాయింట్ కలెక్టర్లు కావాల్సి ఉంటుంది. అంటే 62 మంది ఐఏఎస్ అధికారులను కేటాయించాలి. రాష్ట్రంలో ప్రస్తుతం అంతమంది ఐఏఎస్ అధికారులు అందుబాటులో లేరు. ఏడెనిమిదేళ్ల సీనియారిటీ ఉన్న ఐఏఎస్ అధికారులకు మాత్రమే కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించే ఆనవాయితీ అమల్లో ఉంది. అందుకు భిన్నంగా అయిదేళ్ల సర్వీసు ఉన్న వారిని కేటాయిస్తేనే సర్దుబాటు కుదురుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 2010 తర్వాత కేటాయించిన 18మంది జూనియర్ ఐఏఎస్‌లున్నారు. వీరందరినీ జేసీలుగా నియమించినా సరిపోని పరిస్థితి. సర్దుబాటుకు చిక్కులే ఇప్పటికే కొన్ని జిల్లాలకు నాన్ కేడర్ ఐఏఎస్‌లు జారుుంట్ కలెక్టర్లుగా ఉన్నారు. కొత్తగా ఏర్పడబోయే జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో నాన్ కేడర్ ఐఏఎస్‌లను నియమించాల్సిన అవసరం ఉంటుందని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో నాన్‌కేడర్ ఐఏఎస్ అధికారులను, పాలనలో అనుభవం ఉన్న సీనియర్ అధికారులను జాయింట్ కలెక్టర్లుగా నియమించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పేర్లను కూడా పరిగణనలోకి తీసుకుంది. ఐఏఎస్‌లను కాకుండా సీనియర్ అధికారులను జాయింట్ కలెక్టర్లుగా నియమించాలని అనుకోవటం, జిల్లాల విస్తీర్ణం తగ్గి చిన్న జిల్లాలు ఏర్పడుతుండడంతో జేసీల బాధ్యతల్లో కొంతమేరకు కోత పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు రెవెన్యూ విభాగం నుంచి వచ్చిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న వారిని ఈ పోస్టుల్లో నియమించవద్దని, నాన్ కేడర్ పోస్టులను పరిగణనలోకి తీసుకుంటే గ్రూప్-1 అధికారులకు సైతం అవకాశమివ్వాలని గ్రూప్-1 ఆఫీసర్ల అసోసియేషన్ ప్రభుత్వానికి వరుసగా విజ్ఞప్తులు చేస్తోంది. జేసీల పెత్తనానికి కత్తెర జాయింట్ కలెక్టర్ల విధులకు రాష్ట్ర ప్రభుత్వం కత్తెర వేసింది. గతంలో జేసీల పెత్తనం ఉన్న కొన్ని అంశాల్లోనూ అవసరమైతే జోక్యం చేసుకునే అధికారాలను కలెక్టర్లకు అప్పగిం చింది. ఒకట్రెండు రోజుల్లో అందుకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేయనుంది. కలెక్టర్లు, జేసీ, జిల్లా రెవెన్యూ అధికారుల పని విభజనను పునఃసమీక్షించాలని సీఎం ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు. సాధారణ పరిపాలన విభాగం ముఖ్యకార్యదర్శి అదర్‌సిన్హా ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ సురేంద్రమోహన్, సీసీఎల్ఏ కార్యదర్శికి ఈ బాధ్యతలు అప్పగించింది.ప్రస్తుతం ఉన్న జాబ్‌చార్ట్‌ను సమీక్షించి నివేదికను తయారు చేయాలంది. కమిటీ సిఫారసులను పరిశీలించిన ప్రభుత్వం స్వల్ప మార్పులతో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్, డీఆర్వోల జాబ్ చార్ట్‌ను రూపొందించింది. ప్రస్తుతమున్న పని విభజన ప్రకారం ఆర్వోఆర్, టెనెన్సీ చట్టాలకు సంబంధించి జాయింట్ కలెక్టరే కలెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఫైళ్లన్నీ పరిష్కరించి తుది నిర్ణయం తీసుకునే బాధ్యత జేసీలదే. 1967 నుంచి ఇదే విధానం అమల్లో ఉంది. కొత్త జాబ్‌చార్ట్ ప్రకారం జేసీలకు గతంలో ఉన్న అధికారాలు యథాతథంగానే ఉంటాయి. కానీ అవసరమని భావించిన ఫైళ్లను కలెక్టర్.. జేసీ నుంచి తెప్పించుకొని, తానే స్వయంగా పరిష్కరించి తుది నిర్ణయం తీసుకునే అధికారం కల్పించారు. కలెక్టర్ స్వీకరించిన ఫైళ్లపై జాయింట్ కలెక్టర్ల అధికారం ఉండదు. వీటితోపాటు తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్‌కు సంబంధించిన అంశాలను కలెక్టర్లకు అప్పగించారు. గతంలో జేసీ, డీఆర్వో పరిధిలో ఉన్న ఆర్మ్స్ యాక్ట్‌ను కలెక్టర్లకు బదిలీ చేశారు. అత్యంత కీలకమైన డిప్యూటీ తహశీల్దార్ల పదోన్నతులు, బదిలీలపై ప్రస్తుతం జేసీలకు ఉన్న అధికారులను కలెక్టర్లకు అప్పగించారు. కొత్త మండలాల ఏర్పాటు నేపథ్యంలో కొన్నిచోట్ల డిప్యూటీ తహశీల్దార్లను, ఆర్ఐలను సైతం తహసీల్దార్లు, ఇన్చార్జి తహశీల్దార్లుగా నియమించేందుకు సన్నాహాలు చేస్తోంది. అందుకే కీలకమైన వీరి బదిలీలు, పదోన్నతుల అంశాన్ని కలెక్టర్ల పరిధిలో చేర్చింది. -
వారితోనే బద్నామవుతున్నాం
* ‘రెవెన్యూ’పై మహమూద్ అలీ సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘రెవెన్యూ శాఖ చాలా కీలకమైంది. పుట్టుకు మొదలు చనిపోయే వరకు ఇచ్చే ధ్రువపత్రాలన్నీ ఈ శాఖ నుంచే జారీ చేయాలి. ఇంతటి ముఖ్యమైన శాఖకు కొందరు అవినీతి అధికారులతో చెడ్డపేరు వస్తోంది. ఇకపై ఇలాంటివి సహించేది లేదు. శాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తాం. ప్రతి సేవనూ ఆన్లైన్ చేసి అక్రమాలను అరికడతాం.’ అని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను తనిఖీ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో పలు అంశాలపై సమీక్షించిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వస్థలాల ఆక్రమణ జరగకుండా రిజిస్ట్రేషన్ విభాగాన్ని రెవెన్యూ శాఖ వెబ్‌సైట్‌తో అనుసంధా నం చేస్తామని మహమూద్ అలీ తెలిపారు. ఇలా సమన్వయం చేయడంతో ప్రభుత్వస్థలాల వివాదాలు తగ్గడం తోపాటు పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ స్థలాలపై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే నిర్వహించి మ్యాపింగ్ చేస్తున్నామని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో సర్వే దాదాపు పూర్తి అయిందన్నారు. -
కలెక్టర్, జేసీలకు ఫార్చ్యూనర్ కార్లు
కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల కోసం కొత్త కార్ల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పది మంది జిల్లా కలెక్టర్లు, 11 మంది జాయింట్ కలెక్టర్ల (రంగారెడ్డిలో ఇద్దరు జేసీలు) కోసం ఒక్కొక్కరికి రూ. 25 లక్షల విలువైన ఫార్చూ ్యనర్ కార్లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దీనికోసం రూ. 5.25కోట్లు మం జూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని భూపరిపాలన విభాగం ప్రధాన క మిషనర్‌ను ఆదేశించింది. -
కొత్త సారథులు
⇒ సమర్థతకు పెద్దపీట.. ⇒విధేయులకు కీలక పోస్టులు ⇒జాయింట్ కలెక్టర్లకు స్థానచలనం ⇒కలెక్టర్‌గా రఘునందన్‌రావు ⇒జేసీ-1గా రజత్‌కుమార్ ⇒జేసీ-2గా హరిచందన ⇒సబ్ కలెక్టర్‌గా వర్షిణి సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: జిల్లా టీమ్ మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్కు యంత్రాంగం కొలువుదీరింది. సారథుల కూర్పులో సమర్థతను ప్రామాణికంగా తీసుకున్న సర్కారు.. విధేయులకు పెద్దపీట వేసింది. అధికారయంత్రాంగాన్ని ప్రక్షాళన చేసిన ప్రభుత్వం.. కొత్త సారథులను నియమించింది. కలెక్టర్ సహా జాయింట్ కలెక్టర్లు, సబ్‌కలెక్టర్‌ను బదిలీ చేస్తూ ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి సీఎండీగా బదిలీ అయిన కలెక్టర్ స్థానే ఎం.రఘునందన్‌రావు(2002)ను నియమించింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన రఘునందన్ ఇటీవల తెలంగాణ కేడర్‌కు బదిలీ అయ్యారు. సొంత జిల్లా మెదక్ కావడం, మొదట్నుంచి సీఎం కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం జిల్లా కలెక్టర్ పోస్టింగ్‌లో రఘునందన్‌కు కలిసొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వివాదరహిత, ముక్కుసూటి అధికారిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఇద్దరు జేసీలకు స్థాన చలనం ఐఏఎస్ అధికారుల విభజన అనంతరం యంత్రాంగంలో సమూల మార్పులు జరుగుతాయనే ‘సాక్షి’ కథనం అక్షరసత్యమైంది. పక్షం రోజుల క్రితమే కలెక్టర్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం.. తాజాగా జాయింట్ కలెక్టర్లు ఎం.చంపాలాల్, ఎం.వీ.రెడ్డికి స్థానచలనం కలిగింది. ఏడాదిన్నర క్రితం ఒకే రోజు జేసీలుగా బాధ్యతలు స్వీకరించిన ఈ ఇద్దరికి కొత్తగా పోస్టింగ్‌లు ఇవ్వలేదు. వీరిరువురి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు కేటాయించిన యువ ఐఏఎస్‌లను భర్తీ చేసింది. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పీఓగా పనిచేసిన రజత్‌కుమార్ సైనీ(2007)ని జేసీ-1 నియమించింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రజత్ ఎక్కువకాలం పశ్చిమబెంగాల్లో సేవలందించారు. జేసీ-2గా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా పనిచేసిన దాసరి హరిచందన(2010)ను నియమించారు. ఆమె సీనియర్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాస్ కూతురు. సబ్ కలెక్టర్‌గా వర్షిణి వికారాబాద్ సబ్‌కలెక్టర్‌గా వీఎస్ అలగు వర్షిణి(2012) నియమితులయ్యారు. తమిళనాడు రాష్ట్రం పొల్లచ్చికి చెందిన వర్షిణి తొలుత దంత వైద్యురాలిగా సేవలందించారు. ఆ తర్వాత ఇండియన్ పోస్టల్ సర్వీస్ (ఐపీఎస్)కు ఎంపికయ్యారు. మూడో ప్రయత్నంలో ఐఏఎస్ కు ఎంపికైన ఆమె ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇటీవల అధికారుల కేటాయింపుల్లో వర్షిణిని తెలంగాణ కేడర్‌కు మార్చారు. ఈ నేపథ్యంలో ఆమెకు వికారాబాద్ సబ్‌కలెక్టర్‌గా తొలి పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం ఇక్కడ పనిచేస్తున్న హరినారాయణ్‌ను ఏపీకి బదిలీ చేస్తూ సోమవారం రిలీవ్ చేసింది. నలుగురూ ఏపీ నుంచే.. కొత్తగా పదవులు చేపడుతున్న నలుగురు ఐఏఎస్ అధికారులు ఏపీ నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. రాష్ట్ర విభజన నేపథ్యంలో వీరిని తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దీంతో అక్కడి నుంచి బదిలీపై వచ్చిన వీరికి మన ప్రభుత్వం తాజాగా పోస్టింగ్లిచ్చింది. రఘునందన్‌రావు మెదక్ జిల్లా వాసి.. జిల్లా కలెక్టర్‌గా నియమితులైన రఘునందన్‌రావు సొంత జిల్లా మెదక్. అమెరికాలోని యూనివర్సిటీ నుంచి ఎంఏలో మాస్టర్ డిగ్రీ పొందారు. గ్రూప్1 సర్వీసు నుంచి 2002లో ఐఏఎస్‌గా పదోన్నతి పొందిన ఆయన.. గతంలో ప్రకాశం జిల్లా కందుకూరు రెవెన్యూ డివిజినల్ అధికారిగా పనిచేశారు. ఆ తర్వాత కొత్తగుడెం ఆర్డీఓగా, ఆదే జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకుడిగా పనిచేశారు. అనంతరం ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, సెర్ప్ అదనపు సీఈఓగా పనిచేసి కృష్ణాజిల్లా కలెక్టర్‌గా బదిలీ అయిన ఆయన.. తాజాగా జిల్లాకు కలెక్టర్‌గా వచ్చారు. రజత్‌ది ఉత్తరప్రదేశ్.. జాయింట్ కలెక్టర్-1గా నియమితులైన రజత్‌కుమార్ సైనీ ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. 2007లో ఐఏఎస్‌కు ఎంపికైన ఆయన పశ్చిమబెంగాల్లో పనిచేశారు. అసిస్టెంట్ కలెక్టర్‌గా ముర్శిదాబాద్‌లో పనిచేశారు. అనంతరం సిలిగురిలో ఎస్‌డీఓగా, డార్జిలింగ్, మిడ్నిపూర్ జిల్లాలో కూడా పనిచేశారు. ఆ తర్వాత 2013లో ప్రకాశం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా ఆంద్రప్రదేశ్‌కు బదిలీ అయ్యారు. తాజాగా జేసీ-1గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. హరిచందనది.. హైదరాబాద్ ఎంవీ రెడ్డి సోమవారం జిల్లా నుంచి రిలీవ్ కాగా, కొత్త జేసీ-2గా హరిచందన బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన హరిచందన 2010లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. శిక్షణ పూర్తిచేసుకున్న అనంతరం విజయవాడ సబ్ కలెక్టర్‌గా విధుల్లో చేరారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి వద్ద కార్యనిర్వాహక సహాయకురాలిగా పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సొంత రాష్ట్రానికి బదిలీ కాగా, రాష్ట్ర ప్రభుత్వం జిల్లా జేసీ-2గా నియమించింది. లండన్‌లో మాస్టర్ డిగ్రీ.. హరిచందన హైదరాబాద్‌లోని సెయింట్‌ఆన్స్ కళాశాలలో బీఏ పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏంఏ చదివారు. ఆ తర్వాత లండన్ విశ్వవిద్యాలయంలో రాజనీతి విభాగంలో మాస్టర్ డిగ్రీ తీసుకున్నారు. సంక్షేమ పథకాలకే తొలి ప్రాధాన్యం.. ‘ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పక్కాగా లబ్ధిదారులకు చేరవేయడమే తొలి ప్రాధాన్యం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఆహారభద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తా. మొత్తంగా ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతం చేస్తా. జిల్లాలో 17 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలి సింది. వారి మృతికి కారణాలు తెలుసుకునేం దుకు ప్రయత్నిస్తా. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తా.’ -
భరోసా ఏదీ?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రజాదర్భార్.. సామాన్యుల వినతిపై సత్వర చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం వరకు స్వయంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కార చర్యలు చేపడతారు. జిల్లా ఉన్నతాధికారికే నేరుగా సమస్యలు విన్నవించుకునే అవకాశం ఉండడంతో జిల్లా నలుమూలల నుంచి సామాన్యప్రజలు ప్రతిసోమవారం కలెక్టరేట్‌కు వస్తుంటారు. కానీ కొంతకాలంగా కలెక్టరేట్ ప్రజాదర్భార్ మసకబారుతోంది. గత నాలుగైదు వారాలుగా కార్యక్రమంలో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు పాల్గొనకుండా కిందిస్థాయి అధికారులు హాజరవుతున్నారు. సమస్యలపై నిర్ణయం తీసుకునే అధికారులు కాకుండా ఇతర అధికారులు పాల్గొనడంతో అర్జీదారులు పెదవి విరుస్తున్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజాదర్భార్‌లో జిల్లా రెవెన్యూ అధికారి సూర్యారావు, డీఎస్ఓ నర్సింహారెడ్డి పాల్గొన్నారు. వారు కొంత ఆలస్యంగా రావడంతో అర్జీదారులు బయట నిరీక్షించాల్సి వచ్చింది. ప్రజాదర్భార్‌లో వినతులపై స్పందన కరువైందని, గత నాలుగు వారాలుగా ఫిర్యాదు చేస్తున్నా అధికారులు స్పందించడం లేదంటూ సోమవారం పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. -
జాయింట్ కలెక్టర్లకు భూసేకరణ బాధ్యత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని భూసమీకరణ కోసం ఆరుగురు జాయింట్ కలెక్టర్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో జాయింట్ కలెక్టర్‌కు 5 వేల ఎకరాల భూసేకరణ లక్ష్యంగా నిర్దేశించనుంది. రెండు రోజుల్లో భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించనుంది. రైతులిచ్చే భూములు, కలెక్టర్లకు మధ్య ఎంఓయూ చేయాలని నిర్ణయించింది. ఎంఓయూ కుదిరిన తర్వాత రైతులకు ఏడాదికి రూ. 25వేల చొప్పున పరిహారం చెల్లించాలని చూస్తోంది. భూసేకరణ పూర్తైన తర్వాత మాస్టర్ ప్లాన్ తయారు చేసే బాధ్యత అంతర్జాతీయ సంస్థకు అప్పగించాలని భావిస్తోంది. ఇందుకోసం రూ. 20 నుంచి రూ. 30 కోట్లు ఖర్చు చేయాలని యోచిస్తోంది. మాస్టర్ ప్లాన్ తయారయ్యాక రైతులకు 1000 గజాల స్థలం ఇవ్వాలని భావిస్తోంది. భూసమీకరణ పూర్తైయ్యాకే నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
ఎన్నికల డాక్యుమెంటేషన్ చేయండి
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల నిర్వహణ విధానాలను డాక్యుమెంటేషన్ చేయాలని రాష్ర్ట అదనపు ముఖ్య ఎన్నికల అధికారి వి.వెంకటేశ్వరరావు జాయింట్ కలెక్టర్లకు సూచించారు. మంగళవారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఏఎస్పీలతో ఆయన ప్రాంతీయ సమీక్షాసమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన, మద్యం, నగదు పట్టివేత కేసులు, ఎన్నికల నివేదిక తదితర విషయాలపై సమీక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా జేసీ టి.బాబూరావునాయుడు మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై 330 కేసులు నమోదయ్యాయని, రూ 5.62 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 8వేల 900 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకుని 93 కేసులు నమోదు చేశామని వివరించారు. అదనపు సీఈవో మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, నగదు, మద్యం సీజ్‌కు సంబంధించి నమోదైన కేసులపై సత్వరం పరిష్కార చర్యలు తీసుకోవాలని, ఎన్నికల తుది నివేదికలను ఎన్నికల సంఘానికి సత్వరమే పంపాలన్నారు. ఈ ఎన్నికలలో ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, ఎన్నికల నిర్వహణ, ముఖ్య సంఘటనలపై అన్ని జిల్లాల్లో డాక్యుమెంటేషన్ చేయాలని సూచించారు. పోలింగ్‌కు ఉపయోగించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరచిన విధంగానే ఉపయోగించని ఈవీఎంలకు కూడా తగిన భద్రత కల్పించాలన్నారు. పెయిడ్ న్యూస్‌పై సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన కేసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, ఎస్పీ జె.ప్రభాకరరావు, అదనపు జాయింట్ కలెక్టర్ బి.ఎల్.చెన్నకేశవరావు, ప్రకాశం జిల్లా ఏఎస్పీ బి.రామనాయక్, గుంటూరు అర్బన్ ఏఎస్పీ శ్రీనివాసులు, పశ్చిమ గోదావరి జిల్లా ఏఎస్పీ పి.చంద్రశేఖర్, విజయవాడ నగర డీసీపీలు వి.గీతాదేవి, ఎ.ఎస్.ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల భర్తీకి చర్యలు
ఏలూరు, న్యూస్‌లైన్ :రాష్ట్రంలో వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ త్వరలో వెలువడుతుందని రాష్ట్ర భూ పరిపాలనా శాఖ ప్రధాన కమీషనర్ (సీసీఎల్ఏ) ఐవైఆర్ కృష్ణారావు వెల్లడించారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డీఆర్వోలు, ఆర్డీవోలతో ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫెరెన్సు నిర్వహించారు. వీఆర్వో, వీఆర్ఏ ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాలపై అధికారులతో ఆయన మాట్లాడారు. ఈనెల చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను హైదరాబాదు జేఎన్టీయూ నిర్వహిస్తుందన్నారు. పోస్టుల భర్తీకి రెవెన్యూ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. కలెక్టర్ సిద్ధార్థజైన్ మాట్లాడుతూ జిల్లాలో 51 గ్రామ రెవెన్యూ అధికారులు, 360 గ్రామ రెవెన్యూ సహాయకుల పోస్టులను భర్తీ చేయాల్సి ఉందన్నారు. పోస్టుల భర్తీలో స్పోర్ట్స్ కోటాను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, వయో పరిమితి విషయంలో ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే వికలాంగులకు సడలింపు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. జేసీ టి.బాబూరావునాయుడు, జిల్లా రెవెన్యూ అధికారి కె.ప్రభాకరరావు, ఏలూరు ఆర్డీవో బి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
రికార్డుల్లో విస్తీర్ణం సరిచేయండి
అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సర్వే నంబర్లోని విస్తీర్ణానికి అనుగుణంగా రెవెన్యూ రికార్డుల్లో విస్తీర్ణం సరిచేయాలని భూ పరిపాలన శాఖ కమిషనర్ (సీసీఎల్ఏ) కృష్ణారావు అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అంశాలపై గురువారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలె క్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సలో కమిషనర్ మాట్లాడారు. రెవెన్యూ రికార్డులను రైతుల ఆధార్ నంబర్‌కు అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ రెండు నెలల్లోపు పూర్తి చేయాలన్నారు. ఆధార్ అనుసంధానంలో రాష్ట్రంలో అనంతపురం జిల్లా మూడో స్థానంలో నిలిచినందుకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను అభినందించారు. పభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ లోకేష్‌కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో 7,741 ఎకరాలు, పట్టణప్రాంతాల్లో 12 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తించామని, వీటి పరిరక్షణకు ట్రెంచ్‌లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఏడో విడతలో 8,744 ఎకరాల భూ పంపిణీకి సిద్ధం చేశామని వివరించారు. కార్యక్రమంలో జేసీ సత్యనారాయణ, అనంతపురం, కదిరి, కళ్యాణదుర్గం ఆర్డీఓలు హుస్సేన్‌సాబ్, రాజశేఖర్, మలోలా, డీఆర్డీఏ పీడీ నీలకంఠారెడ్డి పాల్గొన్నారు.