కలెక్టర్లు కావలెను
► 31 జిల్లాలకు 62 మంది ఐఏఎస్‌లు అవసరం.. 31 మంది కలెక్టర్లు, 31 మంది జేసీలు కావాలి
► ఉన్నవారందరినీ సర్దుబాటు చేసినా ఇంకా 11 మంది కొరత
► ఐదేళ్ల సర్వీసుంటే కలెక్టర్‌గా చాన్స్
► జూనియర్లకు సైతం జేసీ పోస్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి మళ్లీ ఐఏఎస్ అధికారుల కొరత ముంచుకొచ్చింది. ప్రస్తుతమున్న జిల్లాల సంఖ్యను మూడింతలకు మించి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ సమస్య మరింత ముదిరింది. ఇప్పుడున్న పరిస్థితిలో కేవలం అయిదేళ్ల సర్వీసు ఉన్న ఐఏఎస్ అధికారులకు సైతం కలెక్టర్ పోస్టింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం పని చేస్తున్న ఐఏఎస్‌లలో... ఒక సబ్ కలెక్టర్ మినహా అందరినీ జాయింట్ కలెక్టర్లుగా నియమించక తప్పదని అంటున్నాయి. రాష్ట్రస్థాయిలో ప్రస్తుతమున్న వివిధ విభాగాల అధిపతులను సైతం జిల్లాలకు పంపించాల్సిన పరిస్థితి నెలకొంది.
కొత్త జిల్లాలు కొలువు తీరుతున్న నేపథ్యంలో రెండు మూడు రోజుల్లోనే కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను నియమించాల్సి ఉంది. కొత్త జిల్లాల నోటిఫికేషన్ వెలువడేంత వరకు ఈ ఉత్తర్వులు జారీ చేయకపోయినా.. సూచనప్రాయంగా ఐఏఎస్ అధికారులకు ముందస్తుగానే మౌఖిక సమాచారం చేరవేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఐఏఎస్ అధికారులను కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లుగా సర్దుబాటు చేసినా ఇంకా 11 మంది ఐఏఎస్‌లు కావాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ కొరతను అధిగమించేందుకు నాన్ కేడర్ అధికారులను కూడా జాయింట్ కలెక్టర్లుగా నియమించాలని యోచిస్తోంది.
నిర్దేశిత కేడర్‌లోనే కొరత
తెలంగాణకు కేంద్రం కేటాయించిన మొత్తం ఐఏఎస్ అధికారుల సంఖ్య 208. కానీ ఇటీవల అదనంగా కేటాయించిన 45 మంది అధికారులను ఇప్పటికీ ఇవ్వలేదు. ప్రస్తుతం తెలంగాణ కేడర్‌లో పనిచేస్తున్న వారు 126. ఇందులో 12 మంది అధికారులు కేంద్ర సర్వీసులో ఉన్నారని సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఉన్నత పోస్టుల్లో ఐఏఎస్‌ల కొరత ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో కిందిస్థాయిలో కూడా ఈ కొరత పెరిగిపోనుంది. కేంద్రం నోటిఫై చేసిన ప్రకారం 10 కలెక్టర్, 11 జాయింట్ కలెక్టర్ కేడర్ పోస్టులున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పడనున్న 21 జిల్లాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 31కి చేరనుంది. దీంతో 31 మంది కలెక్టర్లు, 31 మంది జాయింట్ కలెక్టర్లు కావాల్సి ఉంటుంది.
అంటే 62 మంది ఐఏఎస్ అధికారులను కేటాయించాలి. రాష్ట్రంలో ప్రస్తుతం అంతమంది ఐఏఎస్ అధికారులు అందుబాటులో లేరు. ఏడెనిమిదేళ్ల సీనియారిటీ ఉన్న ఐఏఎస్ అధికారులకు మాత్రమే కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించే ఆనవాయితీ అమల్లో ఉంది. అందుకు భిన్నంగా అయిదేళ్ల సర్వీసు ఉన్న వారిని కేటాయిస్తేనే సర్దుబాటు కుదురుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 2010 తర్వాత కేటాయించిన 18మంది జూనియర్ ఐఏఎస్‌లున్నారు. వీరందరినీ జేసీలుగా నియమించినా సరిపోని పరిస్థితి.
సర్దుబాటుకు చిక్కులే
ఇప్పటికే కొన్ని జిల్లాలకు నాన్ కేడర్ ఐఏఎస్‌లు జారుుంట్ కలెక్టర్లుగా ఉన్నారు. కొత్తగా ఏర్పడబోయే జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో నాన్ కేడర్ ఐఏఎస్‌లను నియమించాల్సిన అవసరం ఉంటుందని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో నాన్‌కేడర్ ఐఏఎస్ అధికారులను, పాలనలో అనుభవం ఉన్న సీనియర్ అధికారులను జాయింట్ కలెక్టర్లుగా నియమించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పేర్లను కూడా పరిగణనలోకి తీసుకుంది. ఐఏఎస్‌లను కాకుండా సీనియర్ అధికారులను జాయింట్ కలెక్టర్లుగా నియమించాలని అనుకోవటం, జిల్లాల విస్తీర్ణం తగ్గి చిన్న జిల్లాలు ఏర్పడుతుండడంతో జేసీల బాధ్యతల్లో కొంతమేరకు కోత పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు రెవెన్యూ విభాగం నుంచి వచ్చిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న వారిని ఈ పోస్టుల్లో నియమించవద్దని, నాన్ కేడర్ పోస్టులను పరిగణనలోకి తీసుకుంటే గ్రూప్-1 అధికారులకు సైతం అవకాశమివ్వాలని గ్రూప్-1 ఆఫీసర్ల అసోసియేషన్ ప్రభుత్వానికి వరుసగా విజ్ఞప్తులు చేస్తోంది.
జేసీల పెత్తనానికి కత్తెర
జాయింట్ కలెక్టర్ల విధులకు రాష్ట్ర ప్రభుత్వం కత్తెర వేసింది. గతంలో జేసీల పెత్తనం ఉన్న కొన్ని అంశాల్లోనూ అవసరమైతే జోక్యం చేసుకునే అధికారాలను కలెక్టర్లకు అప్పగిం చింది. ఒకట్రెండు రోజుల్లో అందుకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేయనుంది. కలెక్టర్లు, జేసీ, జిల్లా రెవెన్యూ అధికారుల పని విభజనను పునఃసమీక్షించాలని సీఎం ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు. సాధారణ పరిపాలన విభాగం ముఖ్యకార్యదర్శి అదర్‌సిన్హా ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ సురేంద్రమోహన్, సీసీఎల్‌ఏ కార్యదర్శికి ఈ బాధ్యతలు అప్పగించింది.ప్రస్తుతం ఉన్న జాబ్‌చార్ట్‌ను సమీక్షించి నివేదికను తయారు చేయాలంది.
కమిటీ సిఫారసులను పరిశీలించిన ప్రభుత్వం స్వల్ప మార్పులతో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్, డీఆర్‌వోల జాబ్ చార్ట్‌ను రూపొందించింది. ప్రస్తుతమున్న పని విభజన ప్రకారం ఆర్‌వోఆర్, టెనెన్సీ చట్టాలకు సంబంధించి జాయింట్ కలెక్టరే కలెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ ఫైళ్లన్నీ పరిష్కరించి తుది నిర్ణయం తీసుకునే బాధ్యత జేసీలదే. 1967 నుంచి ఇదే విధానం అమల్లో ఉంది. కొత్త జాబ్‌చార్ట్ ప్రకారం జేసీలకు గతంలో ఉన్న అధికారాలు యథాతథంగానే ఉంటాయి. కానీ అవసరమని భావించిన ఫైళ్లను కలెక్టర్.. జేసీ నుంచి తెప్పించుకొని, తానే స్వయంగా పరిష్కరించి తుది నిర్ణయం తీసుకునే అధికారం కల్పించారు. కలెక్టర్ స్వీకరించిన ఫైళ్లపై జాయింట్ కలెక్టర్ల అధికారం ఉండదు. వీటితోపాటు తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్‌కు సంబంధించిన అంశాలను కలెక్టర్లకు అప్పగించారు.
గతంలో జేసీ, డీఆర్‌వో పరిధిలో ఉన్న ఆర్మ్స్ యాక్ట్‌ను కలెక్టర్లకు బదిలీ చేశారు. అత్యంత కీలకమైన డిప్యూటీ తహశీల్దార్ల పదోన్నతులు, బదిలీలపై ప్రస్తుతం జేసీలకు ఉన్న అధికారులను కలెక్టర్లకు అప్పగించారు. కొత్త మండలాల ఏర్పాటు నేపథ్యంలో కొన్నిచోట్ల డిప్యూటీ తహశీల్దార్లను, ఆర్‌ఐలను సైతం తహసీల్దార్లు, ఇన్‌చార్జి తహశీల్దార్లుగా నియమించేందుకు సన్నాహాలు చేస్తోంది. అందుకే కీలకమైన వీరి బదిలీలు, పదోన్నతుల అంశాన్ని కలెక్టర్ల పరిధిలో చేర్చింది.