జేసీలుగా 2014 బ్యాచ్ ఐఏఎస్‌లు
• {పస్తుతం 24 మంది వివిధ హోదాల్లో
• వారిలో సింహభాగం జేసీలుగా అవకాశం
• మిగతాచోట్ల డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు చాన్స్
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు తాజా బ్యాచ్ ఐఏఎస్ అధికారులను నియమించేందుకు రంగం సిద్ధమవుతోంది. 21 జిల్లాలకు 21 మంది జాయింట్ కలెక్టర్లు కావాల్సి ఉంది. అంతే సంఖ్యలో కలెక్టర్ల అవసరమూ ఉంది. కలెక్టర్ల కోసమే అంతా శోధించి నియమించాలన్నా సరిపోని పరిస్థితిలో... జాయింట్ కలెక్టర్లకు పూర్తి జూనియర్ల నియామకం తప్పని పరిస్థితి తలెత్తింది. నాన్ కేడర్ అధికారులనే జేసీలుగా నియమించాలనుకున్న ప్రభుత్వం... ఉన్నంతమేర జూనియర్ ఐఏఎస్ అధికారులకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. 2014 బ్యాచ్‌కు సంబంధించిన ఐఏఎస్ అధికారులు ప్రస్తుతం సబ్‌కలెక్టర్లుగా శిక్షణలో ఉండగా, కొందరు జాయింట్ సెక్రటరీలుగా, మరికొందరు పురపాలక శాఖలో పనిచేస్తున్నారు.
ఇలా మొత్తం 24 మందివరకు ఉన్నారు. వీరిలో ఐదారుగురు మినహా మిగతావారిని జాయింట్ కలెక్టర్లుగా నియమించే దిశగా కసరత్తు చేసినట్టు సమాచారం. ఆ బ్యాచ్ కు సంబంధించిన ఐఏఎస్ అధికారుల్లో 8 మంది జాయింట్ సెక్రటరీలుగా సచివాలయంలో పనిచేస్తున్నారు. వీరందరినీ జాయింట్ కలెక్టర్లుగా నియమించాలని భావిస్తున్నట్టు తెలిసింది. సోమవారం నాటికి వీరికి పోస్టింగ్స్ ఇస్తారని చెబుతున్నారు. వీరందరినీ జాయింట్ కలెక్టర్లుగా నియమిస్తే... ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న విధుల్లోకి ఎవరిని తీసుకోవాలనే విషయంలో మళ్లీ గందరగోళం నెలకొనే పరిస్థితి ఉంది. దీంతో కొన్ని జిల్లాలకే ఐఏఎస్ అధికారులను కేటాయించి మిగతావాటికి నాన్‌కేడర్ సీనియర్ అధికారులను నియమించాలనే అంశాన్ని కూడా పరిశీలించారు.
ఆశగా ఎదురుచూస్తున్న గ్రూప్-1 అధికారులు
ప్రస్తుతం స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు 22 మంది, డిప్యూటీ కలెక్టర్లుగా డెరైక్ట్ రిక్రూటీలు మరో 22 మంది ఉన్నారు. ఇందులో స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లలో ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తయినవారు 8 మంది, డిప్యూటీ కలెక్టర్లుగా ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారు మరో 8 మంది ఉన్నారు. సాధారణంగా ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే ఐఏఎస్ హోదాకు పోటీపడుతుంటారు. ఇప్పుడు ఈ 16 మందిలోంచి కొందరిని ఐఏఎస్‌లుగా నియమించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇక జూనియర్ ఐఏఎస్‌లను జాయింట్ కలెక్టర్లుగా నియమించే పక్షంలో వారి స్థానంలో కూడా ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తయిన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డెరైక్ట్ రిక్రూటీలైన డిప్యూటీ కలెక్టర్లను నియమించే అవకాశం ఉంది. మరోవైపు గ్రూప్-1 అధికారులను ఆ పోస్టుల్లో నియమించాలనే డిమాండ్‌ను ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా తిరస్కరించలేదు. అయితే వారికంటే రెవెన్యూ అధికారులకే అవకాశాలు ఎక్కువుంటాయనే చర్చ నడుస్తోంది. దీంతో గ్రూప్-1 అధికారులు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు.
జోనల్ విధానం రద్దుకు డిమాండ్
ప్రస్తుతం స్పెషల్ గ్రేడ్, డెరైక్ట్ రిక్రూటీ డిప్యూటీ కలెక్టర్ పోస్టులు రాష్ట్ర స్థాయిలో పోస్టులుగా ఉన్నాయి. కానీ తహసీల్దార్ పోస్టులు మాత్రం జోనల్ పోస్టుల జాబితాలో ఉన్నాయి. జిల్లాల విభజన నేపథ్యంలో ఈ పోస్టులను కూడా రాష్ట్ర స్థాయి పోస్టులుగా మార్చి పోస్టింగులో వారికి ఆప్షన్ వెసులుబాటు కల్పించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఏ జిల్లాలో ఉన్నవారు అదే జిల్లా పరిధిలో ఏర్పడే కొత్త జిల్లాల్లో పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా పనిచేసేలా వారికి అవకాశం ఇవ్వాలని రెవెన్యూ అధికారుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.