సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన జీవో నంబర్ 317పై ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల అభ్యంతరాల దృష్ట్యా మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్‌గా మంత్రి దామోదర, సభ్యులుగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ఉంటారు. 2021లో ఇచ్చిన జీవో 317, జీవో 46పై వివాదాలు, ఉద్యోగుల అభ్యంతరాలపై ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది.
పీఆర్‌టీయూటీఎస్ హర్షం
గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 317పై ఉద్యోగుల అభ్యంతరాలను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేబ్‌నెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం పట్ల పీఆర్‌టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు.
317 జీవోతో ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారు: టీఎస్‌యూటీఎఫ్
ఉద్యోగుల శాశ్వత కేటాయింపు కోసం గత ప్రభు త్వం జీవో 317 ద్వారా ఏకపక్షంగా విడుదల చేసిన మార్గదర్శకాల కారణంగా పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారని టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి పేర్కొన్నారు. ఇప్పుడు ఆ సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలను సిఫారసు చేయటం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.
జీవో 46పై సబ్ కమిటీతో నిరుద్యోగులకు న్యాయం: బల్మూరి వెంకట్
జీవో నంబర్ 46పై కేబినెట్ సబ్ కమిటీ వేయడాన్ని ఎంఎల్‌సి బల్మూరి వెంకట్ స్వాగతించారు. జీవో 46 వల్ల గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి తాము సూచనలు, సల హాలు చేసినా పట్టించుకోలేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ప్రజా ప్రభుత్వం సబ్ కమిటీ వేసిందని వెంకట్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో నిరుద్యోగులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి ఉద్యోగ అవకాశాల్లో ఎలాంటి అన్యా యం జరగకుండా సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పీఆర్ కమిషనర్‌కు టీపీఎస్‌ఏ వినతిపత్రం
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలు, బదిలీలపై గత సర్కార్ ఇచ్చిన జీవో 317తో ముడిపడిన సమస్యల పరిశీలనకు సీఎం రేవంత్‌రెడ్డి కేబినెట్ సబ్‌కమిటీని నియమించడం పట్ల తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ (టీపీఎస్‌ఏ) హర్షం ప్రకటించింది. ఈ జీవో కారణంగా పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్‌కు టీఎస్‌పీఏ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం పీఆర్ కమిషనరేట్‌లో కమిషనర్‌కు టీఎస్‌పీఏ ప్రతినిధులు మధుసూదన్‌రెడ్డి, .శ్రీనివాస్, పండరీనాథ్ వినతిపత్రం సమర్పించారు. ఈ జీవో వల్ల కొందరు కార్యదర్శులు స్థానికతను కోల్పోయి కుటుంబాలకు దూరంగా ఇబ్బందులుపడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment