జెండర్ ఈక్వాలిటీ
ఆడపిల్ల పుడితే ‘అయ్యో’ అంటూ సానుభూతి చూపేవాళ్లు మన దేశంలో ఎన్నోచోట్ల కనిపిస్తారు.మధ్యప్రదేశ్‌లో ఈ ధోరణి మరీ ఎక్కువ. ఆడిపిల్ల పుడితే ఆర్థికభారంగా భావించి పురిట్లోనే ప్రాణం తీసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మార్పు తేవడానికి మన తెలుగు బిడ్డ, ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి
‘లాడ్లీ లక్ష్మీ యోజన’తో నడుం బిగించారు. ప్రతిష్ఠాత్మకమైన ‘బేటీ బచావో బేటీ పడావో’ కు స్ఫూర్తిగా నిలిచిన ఈ సంక్షేమ పథకాన్ని పదిహేను రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి.
కొన్ని సంవత్సరాల క్రితం...కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఆడపిల్ల పుడితే భారంగా భావించడం నుంచి భ్రూణహత్యల వరకు ఎన్నో విషయాలపై మాట్లాడారు. ఆయన మాటల్లో ఎంతో ఆవేదన కనిపించింది.
‘ఈ పరిస్థితుల్లో మనం మార్పు తేవాలి’ అనే పట్టుదల కనిపించింది.
‘మనం మాత్రం ఏం చేయగలం సర్, ప్రజలు అలా ఆలోచిస్తున్నారు!’ అని ఆ అధికారులు చేతులెత్తేస్తే కథ కంచికి వెళ్లినట్లే. అయితే కథ అక్కడితో ముగిసిపోలేదు. అక్కడినుంచే మొదలైంది. ముఖ్యమంత్రితో సమావేశం అయిన వారిలో ఐఏయస్ అధికారి నరహరి కూడా ఉన్నారు. ఒక సమస్యకు పది రకాల పరిష్కార మార్గాలు ఆలోచించడం ఆయన సొంతం.
‘మనం ఏం చేయలేమా!’... సీఎం ఆవేదనపూరిత మాటలు నరహరి మనసులో సుడులు తిరిగాయి.‘కచ్చితంగా చేయాల్సిందే. చేయగలం కూడా’ అని ఒకటికి పదిసార్లు అనుకున్నారు. పేదింటి బిడ్డ అయిన నరహరికి పేదోళ్ల కష్టాలు తెలియనివేమీ కాదు. ఆడపిల్ల అంటే పనిగట్టుకొని వ్యతిరేకత లేకపోయినా పేదరికం వల్ల మాత్రమే ‘ఆడబిడ్డ వద్దు’ అనుకునే వాళ్లను ఎంతోమందిని చూశారు. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడానికి హరియాణ, పంజాబ్... మొదలైన రాష్ట్రాల్లో ఎన్నో ప్రాంతాలు తిరిగారు. ఎన్నో కోణాలలో ఎన్నో ప్రశ్నలు వేశారు.
‘మేం బతకడమే కష్టంగా ఉంది. ఇక ఆడబిడ్డను ఎలా బతికించుకోవాలి సారు’ అనే మాటలను ఎన్నో ప్రాంతాలలో విన్నారు. వారికి ఆర్థిక భరోసా ఇస్తే సమస్యకు పరిష్కారం దొరికినట్లే కదా! అలా మొదలైందే లాడ్లీ లక్ష్మీ యోజన(గారాల కూతురు).
ఇది సంక్షేమ పథకం మాత్రమే కాదు... సామాజిక మార్పు తెచ్చిన శక్తి. ఆడపిల్ల భారం అనే భావన తొలగించేందుకు వారికి ముందు ఆర్థిక భరోసా కల్పించాలి. అదే సమయంలో అమ్మాయిలను విద్యావంతులను చేయాలి... ఈ కోణంలో పథకానికి రూపకల్పన చేశారు.
‘పుట్టగానే అమ్మాయిని లక్షాధికారి చేస్తాం’ అని ప్రకటించారు. అయితే ఆ డబ్బు చేతికందడానికి షరతులు విధించారు. అమ్మాయి ఇంటర్ పూర్తి చేయాలి. 5వ తరగతి పూర్తి చేస్తే రూ.2000, 8వ తరగతి పూర్తి చేస్తే రూ.4000 చొప్పున ప్రతి తరగతికి బోనస్ చెల్లింపులు చేశారు. అమ్మాయికి పద్దెనిమిది ఏళ్లు వచ్చాక మాత్రమే ‘లాడ్లీ లక్ష్మీ యోజన’ కు సంబంధించిన డబ్బులు చెల్లించేవారు. అలా పథకం వందశాతం విజయవంతమైంది.
ఆడపిల్ల పుడితే రైఫిల్ లైసెన్స్!
మధ్యప్రదేశ్‌లోని చంబల్‌లోయప్రాంతాల్లో కొన్ని కులాల ప్రజలు రైఫిల్‌ను సామాజిక హోదాగా భావిస్తారు. మగవారు సైకిల్ మీద తిరిగినా భుజాన తుపాకీ ఉండాల్సిందే! ఆడపిల్లలను పురిట్లోనే చంపేసేవారు కూడా ఆప్రాంతాల్లో ఎక్కువే. ఆప్రాంతాలలో ‘లాడ్లీ లక్ష్మీ యోజన’ అంతగా ఫలితం ఇవ్వలేదు. దీంతో ప్రతి 1000 మంది బాలురకు 400 మంది బాలికలే మిగిలారు.
ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఆయా కులాల వారితో సమావేశం నిర్వహించారు. ‘ఆడపిల్లలను మీరు వద్దనుకుంటూ పోతే వారే కాదు చివరికి మీ కులాలు త్వరలోనే అంతరించి పోవడం ఖాయం’ అని కులపెద్దలకు చెప్పారు. దీంతో వారిలో మార్పు వచ్చింది. అయితే తమకు తుపాకీ లైసెన్స్ లేకుండా ఉండలేమన్నారు. దీంతో ఆడపిల్ల పుడితే రైఫిల్ లైసెన్స్ అని నిబంధన విధించారు!
2007 నుంచి 50 లక్షల మంది ఆడపిల్లలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. బాలికల లింగ నిష్పత్తి 400 నుంచి 950కి పెరిగింది. ‘లాడ్లీ లక్ష్మీ యోజన’ ద్వారా సామాజిక ఫలాలు అందుతున్న తీరును అధ్యయనం చేసి ఎంతోమంది పీహెచ్‌డీ చేశారు.
లింగ వివక్షకు తావు లేని సమాజాన్ని కల కంటున్నారు నరహరి. అది చారిత్రక అవసరం. తక్షణ అవసరం.
భ్రూణహత్యల నివారణకు...
‘లాడ్లీ లక్ష్మీ యోజన’ పథకం విజయవంతంగా అమలు చేస్తూనే మరోవైపు భ్రూణహత్యలపై దృష్టి సారించారు. ఇందుకోసం ఆశావర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలు, నర్సులు, కిందిస్థాయి సిబ్బందితో విస్తృతమైన విజిలెన్స్ నెట్‌వర్క్ ఏర్పాటు చేశారు. తప్పుదారి పట్టిన వైద్యులపై కేసులు నమోదు చేశారు. దీంతో చట్టాన్ని ఉల్లంఘించిన వైద్యులు దారికొచ్చారు.
పేదింటి బిడ్డ
ఎంతోమంది ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపిన నరహరిది తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్. నిరుపేదింట జన్మించిన నరహరి కష్టపడి చదివి ఐఏఎస్ అయ్యారు. ప్రస్తుతం పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్నారు. జన్మభూమికి ఏదైనా చేయాలనే ఆశయంతో ‘ఆలయ ఫౌండేషన్ ’ స్థాపించి స్థానికంగా విద్య, వైద్య, ఆరోగ్య సంబంధమైన సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు.
– భాషబోయిన అనిల్‌కుమార్, సాక్షి ప్రతినిధి కరీంనగర్
Comments
Please login to add a commentAdd a comment