జీవితంలో పైకి రావాలని, ఉన్నతోద్యోగాలు సాధించాలని అందరూ కలలు కంటారు. కానీ ఆ కలలను సాధించుకోవడంలో చాలాకొద్దిమంది మాత్రమే సక్సెస్ అవుతారు. కఠోర శ్రమ, పట్టుదలతో ఎదిగి పలువురి ప్రశంసలు పొందడం మాత్రమేకాదు ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తారు. అలాంటి వారిలో సృష్టి దేశ్‌ముఖ్ ఒకరు.సివిల్స్ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాంకు సాధించిన సృష్టి సక్సెస్ స్టోరీ..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్షల్లో విజయం అంటే మామూలు సంగతి కాదు. ప్రతీ ఏడాది లక్షలాది మంది విద్యార్థులు తమ అదృష్టాన్ని పరీక్షించు కుంటారు. అయితే కొన్ని వందల మంది మాత్రమే సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి IAS అధికారిగా మారతారు. కానీ తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాకు సాధించిడం చాలా అరుదు. సృష్టి UPSC పరీక్షలో ఆలిండియా స్థాయిలో ఐదో ర్యాంకును సాధించారు. అంతేకాదు UPSC 2018 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 182 మంది మహిళల్లో టాపర్ కూడా. అప్పటికి ఆమె వయస్సు కేవలం 23 ఏళ్లు.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన సృష్టి దేశ్‌ముఖ్ గౌడ 1995లో పుట్టింది. చిన్ననాటి నుండి తెలివైన విద్యార్థి. భోపాల్‌లోని బిహెచ్‌ఇఎల్‌లోని కార్మెల్ కాన్వెంట్ స్కూల్‌లో 12వ బోర్డు పరీక్షలో 93.4 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఆ తరువాత ఐఐటీలో ఇంజనీరింగ్ చేయాలని ఆశపడింది. కానీ సీటురాలేదు. చివరికి భోపాల్‌లోని లక్ష్మీ నారాయణ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. తరువాత తన డ్రీమ్‌ను పూర్తి చేసుకోవడం కోసం సివిల్స్ పరీక్ష రాసి, విజయం సాధించింది.
సృష్టి తండ్రి జయంత్ దేశ్‌ముఖ్ ఇంజనీర్ కాగా, ఆమె తల్లి సునీతా దేశ్‌ముఖ్ టీచర్. సృష్టికి సంగీతం అన్నా, ప్రకృతి అన్నా చాలా ఇష్టం. రోజూ యోగా కూడా చేస్తుంది. మరో ఐఏఎస్ అధికారి డాక్టర్ నాగార్జున బి గౌడను సృష్టి వివాహం చేసుకుంది. ఐఏఎస్ అధికారిణిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తున్న సృష్టి , నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల పట్ల కఠినంగా ఉంటూ సోషల్ మీడియాలో విశేషంగా నిలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment