వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి చర్యలు
Published Sun, Dec 15 2013 5:05 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM
ఏలూరు, న్యూస్‌లైన్ :రాష్ట్రంలో వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ త్వరలో వెలువడుతుందని రాష్ట్ర భూ పరిపాలనా శాఖ ప్రధాన కమీషనర్ (సీసీఎల్‌ఏ) ఐవైఆర్ కృష్ణారావు వెల్లడించారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డీఆర్వోలు, ఆర్డీవోలతో ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫెరెన్సు నిర్వహించారు. వీఆర్వో, వీఆర్‌ఏ ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాలపై అధికారులతో ఆయన మాట్లాడారు. ఈనెల చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను హైదరాబాదు జేఎన్‌టీయూ నిర్వహిస్తుందన్నారు.
పోస్టుల భర్తీకి రెవెన్యూ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. కలెక్టర్ సిద్ధార్థజైన్ మాట్లాడుతూ జిల్లాలో 51 గ్రామ రెవెన్యూ అధికారులు, 360 గ్రామ రెవెన్యూ సహాయకుల పోస్టులను భర్తీ చేయాల్సి ఉందన్నారు. పోస్టుల భర్తీలో స్పోర్ట్స్ కోటాను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, వయో పరిమితి విషయంలో ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే వికలాంగులకు సడలింపు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. జేసీ టి.బాబూరావునాయుడు, జిల్లా రెవెన్యూ అధికారి కె.ప్రభాకరరావు, ఏలూరు ఆర్డీవో బి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement