కెమెరా కళ్ల నడుమ వీఆర్వో పరీక్షలు
కెమెరా కళ్ల నడుమ వీఆర్వో పరీక్షలు
Published Fri, Jan 31 2014 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 3:11 AM
ఏలూరు, న్యూస్‌లైన్:జిల్లాలో ఖాళీగా ఉన్న వీఆర్‌వో, వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి వచ్చేనెల 2న నిర్వహించే పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు యంత్రాంగం పక్కా ఏర్పాట్లు చేస్తోంది. నకలీ అభ్యర్థులు పరీక్షలు రాయకుండా నిరోధించేందుకు పరీక్షా కేంద్రాల్లో నిఘాను విస్తృతం చేయనున్నారు. పరీక్షల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ పబి్‌లక్ సర్వీస్ కమిషన్ నుంచి ముగ్గురు సభ్యుల బృందం జిల్లాకు చేరుకుంది. పరీక్షల ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ టి.బాబూరావు నాయుడు, డీఆర్‌వో కె.ప్రభాకరరావు చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్, అసిస్టెంట్ లైజన్ అధికారులతో గురువారం సమీక్షించారు. ఏలూరు సహా జిల్లాలోని ఏడు పట్టణాల్లో మొత్తం 137 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 51 వీఆర్‌వో పోస్టులకు 50,741 మంది, 360 వీఆర్‌ఏ పోస్టులకు 7,433 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఎక్కడెక్కడ ఎన్ని కేంద్రాలు
జిల్లాలో నరసాపురం పట్టణం అన్ని ప్రాంతాలకు దూరంగా ఉండటం వల్ల అక్కడ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఏలూరు నగరంలో అత్యధికంగా 56 కేంద్రాలను ఏర్పాటు చేయగా, తాడేపల్లిగూడెంలో 16, జంగారెడ్డిగూడెంలో 10, తణుకులో 10, కొవ్వూరులో 7, భీమవరంలో 19, పాలకొల్లులో 9 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
వీడియో చిత్రీకరణ నడుమ...
137 పరీక్షా కేంద్రాల్లోను వీడియో చిత్రీకరణ చేస్తారు. ప్రతి అభ్యర్థి నుంచి వేలిముద్ర తీసుకున్నాక మాత్రమే పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తారు. పెద్దఎత్తున దరఖాస్తులు రావటంతో నకిలీ అభ్యర్థులు పరీక్షలు రాయకుండా చూసేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఒకే కేంద్రంలో పరీక్షలు రాసేందుకు అనుమతించామని, ఈ జాబితాలో 28మంది ఉన్నారని కలెక్టరేట్ పరిపాలనాధికారి జీవీవీ సత్యనారాయణ తెలిపారు. పరీక్షల నిర్వహణకు 500 మంది అధికారులు, సిబ్బందిని వినియోగించున్నారు. జిల్లా మొత్తం మీద 40మంది జిల్లాస్ధాయి అధికారులు పర్యవేక్షిస్తారు. ప్రతి కేంద్రంలో కాలేజీ ప్రిన్సిపల్ లేదా పాఠశాల హెడ్మాస్టర్లను చీఫ్ సూపరింటెండెంట్లుగా, ఎంపీడీవోలను లైజన్ అధికారులుగా, డెప్యూటీ తహసిల్దార్లు లేదా వివిధ కార్యాలయూల సూపరింటెండెంట్‌లను అసిస్టెంట్ లైజన్ అధికారులుగా నియమిస్తారు. వీరితోపాటు 14 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు పని చేస్తాయి
Advertisement