ఏలూరు, న్యూస్‌లైన్: ప్రభుత్వ ఉద్యోగానికి డిమాండ్ ఎలా ఉందో వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టులకు వచ్చిన దరఖాస్తులు చూస్తే తెలుస్తోంది. చిన్న ఉద్యోగమైనా సరే ఉన్నత విద్యార్హతలు కలిగిన వారు కూడా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీఆర్వో (గ్రామ రెవెన్యూ అధికారి) , వీఆర్‌ఏ (గ్రామ రెవెన్యూ సహాయకులు) పోస్టులకు దరఖాస్తుల సమర్పణ గడువు సోమవారంతో ముగిసింది. రాత్రి ఏడు గంటలకు 50 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. రాత్రి తొమ్మిదిగంటల వరకు దరఖాస్తులను
స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. ఈ పోస్టులకు దరకాస్తు చేసిన వారిలో ఎంటెక్, ఎంబీఏ, బీటెక్ చదివిన విద్యార్థులు సైతం ఉండడం విశేషం. జిల్లాలో 51 వీఆర్వో, 360 వీఆర్‌ఏ పోస్టులకు అధికారులు గత నెల 28న నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ వరకు మీసేవ, ఆన్‌లైన్‌ల్లో చలానా కట్టేందుకు అవకాశం ఇవ్వగా, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి సోమవారంతో గడువు ముగిసింది.
వీఆర్వోకు ఇంటర్ అర్హత కాగా, వీఆర్‌ఏకు పదోతరగతి ఉత్తీర్ణత కనీస అర్హతగా నిర్ణయించారు. కాగా నివాసం ఉంటున్న ప్రాంతంలోనే వీఆర్వో కొలువుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటంతో ఉన్న ఊరులోనే ప్రభుత్వ ఉద్యోగం పొందుదామన్న ఆలోచనతో ఉన్నత విద్యార్హతలు కలిగిన వారు సైతం పోటీపడుతున్నారు. మరోవైపు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఎక్కువగా దరఖాస్తు చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఈ పాటికే విడుదల కావాల్సి ఉంది. దీనికోసం కసర త్తు చేస్తున్న నిరుద్యోగులు కూడా వీఆర్వో పోస్టు లక్ష్యంగా దరఖాస్తు చేశారు. దీంతో భారీస్థాయిలో దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి రెండున ఉదయం వీఆర్వో, మధ్యాహ్నం వీఆర్‌ఏ అభ్యర్థులకు పరీక్ష నిర్వహించనున్నారు.
155 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో జిల్లావ్యాప్తంగా 155 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని యంత్రాంగం నిర్ణయించింది. మునిసిపల్ పట్టణాల్లోను, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యాసంస్థల్లోని కేంద్రాల్లోనే పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ నెల 19 నుంచి దరఖాస్తు చేసిన అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరోవైపు స్థానిక కలెక్టరేట్‌లో వీఆర్వో, వీఆర్‌ఏ అభ్యర్థుల సమస్యలు, ఇతర అంశాలపై ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ అలంకార ప్రాయంగా మారిందన్న విమర్శలున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారి ఫొటోలు అప్‌లోడ్ కాని వారు ఏమి చేయాలనే దానిపై అధికారుల నుంచి సమాధానం కరువైంది. ఇప్పటికైనా హెల్ప్‌డెస్క్‌లో సమాచార వ్యవస్థను సిద్ధం చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
రెవెన్యూ కొలువులకు యమ డిమాండ్
Published Tue, Jan 14 2014 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM
Advertisement
Advertisement