![AP Govt provided joint collectors to make land related changes Webland - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/24/WEBLAND-IN-AP-ALL-.jpg.webp?itok=nbL7NmDo)
సాక్షి, అమరావతి: వెబ్‌ల్యాండ్‌లో భూములకు సంబంధించిన మార్పులు చేసే అవకాశాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్లకు ప్రభుత్వం కల్పించింది. మొన్నటివరకు ప్రాథమిక స్థాయిలో కేవలం తహశీల్దార్లు మాత్రమే వెబ్‌ల్యాండ్‌లో మార్పులు చేసే అవకాశం ఉండేది. ఆ తర్వాత ఉన్నత స్థాయిలో మార్పులు చేయాలంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ) కార్యాలయంలోని కంప్యూటరైజేషన్ ఆఫ్ మండల రెవెన్యూ ఆఫీసెస్ (సీఎంఆర్‌వో) ప్రాజెక్ట్ డైరెక్టర్‌కే అవకాశం ఉండేది.
అంటే తహశీల్దార్ స్థాయిలో మార్పును తిరస్కరిస్తే దాన్ని పైస్థాయిలో సీసీఎల్‌ఏ కార్యాలయంలోనే మార్చడానికి అవకాశం ఉండేది. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. స్పందన కార్యక్రమంలో దీనిపై ప్రజల నుంచి పెద్దఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఈ అధికారాన్ని జాయింట్ కలెక్టర్లకు సైతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే నంబర్లు మిస్ అవడం, 22ఏ కేసుల్లో ప్రభుత్వ భూమి నుంచి ప్రైవేటు భూమిగా మార్పు చేయడం, సివిల్, రెవెన్యూ కోర్టులు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా చేయాల్సిన మార్పులతోపాటు భూసమీకరణ, భూ యాజమాన్య మార్పు, భూముల కేటాయింపునకు సంబంధించి మార్పులను జాయింట్ కలెక్టర్ల లాగిన్ నుంచి చేసేందుకు తాజాగా అవకాశం కల్పించారు.
ఇందుకు అనుగుణంగా వెబ్‌ల్యాండ్‌లో మార్పులు చేస్తున్నారు. జాయింట్ కలెక్టర్లు ఈ మార్పులు చేసేముందు నిబంధనల ప్రకారం అన్ని విషయాలు పరిశీలించాలని, ఎందుకు మార్పు జరుగుతుందో వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసిన తర్వాతే మార్పులు చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సీసీఎల్‌ఏ జి.సాయిప్రసాద్ ఇటీవల సర్క్యులర్ జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment