వారితోనే బద్నామవుతున్నాం
* ‘రెవెన్యూ’పై మహమూద్ అలీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘రెవెన్యూ శాఖ చాలా కీలకమైంది. పుట్టుకు మొదలు చనిపోయే వరకు ఇచ్చే ధ్రువపత్రాలన్నీ ఈ శాఖ నుంచే జారీ చేయాలి. ఇంతటి ముఖ్యమైన శాఖకు కొందరు అవినీతి అధికారులతో చెడ్డపేరు వస్తోంది. ఇకపై ఇలాంటివి సహించేది లేదు. శాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తాం. ప్రతి సేవనూ ఆన్‌లైన్ చేసి అక్రమాలను అరికడతాం.’ అని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను తనిఖీ చేశారు.
అనంతరం జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో పలు అంశాలపై సమీక్షించిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వస్థలాల ఆక్రమణ జరగకుండా రిజిస్ట్రేషన్ విభాగాన్ని రెవెన్యూ శాఖ వెబ్‌సైట్‌తో అనుసంధా నం చేస్తామని మహమూద్ అలీ తెలిపారు. ఇలా సమన్వయం చేయడంతో ప్రభుత్వస్థలాల వివాదాలు తగ్గడం తోపాటు పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ స్థలాలపై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే నిర్వహించి మ్యాపింగ్ చేస్తున్నామని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో సర్వే దాదాపు పూర్తి అయిందన్నారు.