అవినీతికి అంతేది..?
► రెవెన్యూ శాఖలో కనిపించని ప్రక్షాళన
► అధికంగా మహిళా తహసీల్దార్లే
► ఏసీబీకి చిక్కుతున్న వైనం
► ముడుపులు ఇవ్వందే కదలని ఫైళ్లు
► బాధ్యతలు స్వీకరించని తహసీల్దార్లపై చర్యలు
నెల్లూరు(పొగతోట): రెవెన్యూ శాఖలో అవినీతికి అంతులేకుండాపోతోంది. ముడుపులు ఇవ్వందే ఫైళ్లు కదిలే పరిస్థితి లేదు. కలెక్టర్ ఫోన్ చేసి ఆదేశించినా రెవెన్యూలో లంచాలివ్వందే పనులు జరగడం లేదు. జిల్లాలో మహిళా తహసీల్దార్లు అధికంగా ఏసీబీ వలలో చిక్కుకుంటున్నారు. జిల్లాలో ఏడాదిన్నర కాలంలో ముగ్గురు మహిళా తహసీల్దార్లు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కగా, మరో ఇద్దరు సస్పెండయ్యారు.
పరిపాటిగా మారుతున్న లంచాల డిమాండ్
అడంగళ్, 1బీ, పాస్‌పుస్తకాలు, భూ సర్వే.. ఇలా ప్రతి దానికీ లంచాలను డిమాండ్ చేయడం రెవెన్యూలో అలవాటుగా మారిపోయింది. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు మామూళ్లకు అలవాటుపడటంతో రెవెన్యూ శాఖలో ముడుపులు ఇవ్వందే చిన్న పని కుడా జరగడంలేదు. వందలెకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నా, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదు. పైస్థాయి అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుంటే తామేమి తక్కువ తిన్నలేదన్నట్లు కింది స్థాయి ఉద్యోగులూ అదేబాటలో పయనిస్తున్నారు.
అధికార పార్టీ నేతలూ భాగస్వాములే..
తహసీల్దార్ల బదిలీలు అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లో జరుగుతుండటంతో అవినీతి, అక్రమాలు అధికంగా జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. భూముల విలువలు అధికంగా పెరిగిపోవడంతో అక్రమాలు అధికమయ్యాయి. పాస్‌పుస్తకాలు, అడంగళ్, 1బీ, పేర్ల మార్పు, భూముల వివరాలు, తదితర పనులకు ధరలు నిర్ణయించి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూమి సరిహద్దులు.. డివిజన్ చేసేందుకు.. భూసర్వే.. ఇలా ప్రతి అంశానికీ లంచం డిమాండ్ చేస్తున్నారు. మండల స్థాయిలో లంచాలను అధికంగా డిమాండ్ చేయడంతో ప్రజలు కలెక్టర్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు.
ప్రజల వినతులను స్వీకరించి వెంటనే పరిష్కరించాల్సిందిగా కలెక్టర్ ఆదేశిస్తున్నా, న్యాయం జరగడంలేదు. లంచాలు ఇచ్చిన వారికి మాత్రం సకాలంలో పనులు పూర్తవుతున్నాయి. మరోవైపు రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీతిపై ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టనుంది. బదిలీ చేసినా బాధ్యతలు స్వీకరించకుండా సెలవుపై వెళ్లిన తహశీల్దార్లు వెంటనే బాధ్యతలు స్వీకరించేలా చర్యలు చేపట్టింది. చెప్పినా ఇంకా బాధ్యతలను స్వీకరించకపోతే చర్యలు తీసుకోనుంది. అధికార పార్టీ నాయకుల ప్రమేయం లేకుండా బదిలీలు చేసేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా మూడేళ్లు పూర్తయిన ఆర్‌ఐలను బదిలీ చేయనున్నారు.
ఒకరిద్దరి వల్లే శాఖకు చెడ్డపేరు:
రెవెన్యూలో ఒకరిద్దరు అక్రమాలకు పాల్పడటం వల్ల శాఖకు చెడ్డపేరొస్తోంది. 90 శాతం మంది నిజాయతీగా పని చేస్తున్నారు. సిబ్బంది కొరత ఉన్నా సకాలంలో జిల్లా అధికారులు చెప్పిన పనులను పూర్తి చేస్తున్నాం. సిబ్బంది కొరత ఉన్నా భూ రికార్డుల కంప్యూటరీకరణ, తదితర పనులను వంద శాతం పూర్తి చేస్తున్నాం. - షఫీమాలిక్, ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు