Deputy Chief Minister Mohammed Ali
-
హజ్ యాత్రికులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చాదర్‌ఘాట్: హజ్ యాత్రకు వెళ్లే వారికోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పిస్తోందని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆదివారం ఓల్డ్ మలక్‌పేట హైటెక్ ఫంక్షన్ హాల్లో హజ్ యాత్రికుల అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. హజ్ యాత్రికుల సౌకర్యార్థం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారన్నారు. నిజాం పాలనలో సౌదీలో ఏడు అతిథి గృహాలు ఉండేవని, ఇప్పుడు వాటిలో ఒక్కటే మిగిలిందన్నారు. ఒక వసతి గృహంలో దాదాపు 600 మందికి ఉచిత వసతి కల్పిస్తున్నట్లు వివరించారు. అయితే మిగతా వసతి గృహాలు సౌదీ రాజుల ఆధీనంలోకి వెళ్లాయని, త్వరలో వాటిని స్వాధీనం చేసుకుని తిరిగి అందుబాటులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. హజ్ యాత్ర కోసం హైదరాబాద్ నగరం నుంచి 11,483 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 2,252 మందికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం మొత్తంగా 17,390 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. హజ్ యాత్ర సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బలాల, హజ్ యాత్ర అధికారులు, దాదాపు వెయ్యి మంది యాత్రికులు పాల్గొన్నారు. -
అందరి ప్రార్థనలు ఫలించాయి
► డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ► అన్ని వర్గాలకు సముచిత స్థానం ► మసీదు ఇమామ్‌ల గౌరవ వేతన పథకం ప్రారంభం సాక్షి,సిటీబ్యూరో: సర్వమతాల ప్రార్థనల ఫలితంగా ‘తెలంగాణ’ ఏర్పాటయ్యిందని ఉపముఖ్యమంత్రి మహ మూద్ అలీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్‌బోర్డు పరిధిలోని మసీదుల ఇమామ్, మౌజమ్‌లకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రవేశ పెట్టిన ‘గౌరవ వేతన పథకాన్ని’ సోమవారం రాష్ట్ర హజ్‌హౌస్ లో ఉపముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని మసీదుల్లో ప్రత్యేక ప్రార్ధనలు చేశారన్నారు.ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. మసీదు ఇమామ్, మౌజ మ్ లకు చేయూతనందించేందుకు గౌరవ వేతన పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మసీదులకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. పది జిల్లాల నుంచి 4,901 ఇమామ్, 4,033 మంది మౌజమ్ల నుంచి దరఖాస్తులు అందాయని, వక్ఫ్‌బోర్డులో నమో దు కాని మసీదు సైతం కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ముస్లిం మైనార్టీల వెనుకబాటుకు నిరక్షరాస్యతే ప్రధాన కారణమని గుర్తించిన ప్రభుత్వం గురుకుల విద్యాలయాల ద్వారా ఉచిత విద్య అందించేందుకు చర్యలు చేపడుతుందన్నారు. మసీదు కమిటీలు, ఇమా మ్, మౌజమ్‌లు విద్యను ప్రోత్సహించేందుకు కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్సీ ప్రభాకర్ మాట్లాడుతూ మైనార్టీ శాఖ అవినీతిమయమైందని, ప్రభుత్వ కార్యక్రమాలకు మైనార్టేతర ప్రజా ప్రతినిధులను ఆహ్వానించడం లేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, సలీమ్, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, వక్ఫ్‌బోర్డు సీఈవో అసదుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలోని 551 ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనాన్ని గత జూలై నుంచి పాత బకాయిలు కలుపుకొని ఒక్కొక్కరికి రూ.9000 చొప్పున అందచేశారు. -
వక్ఫ్‌భూములపై మండలిలో రభస
పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం: ఉపముఖ్యమంత్రి సంతృప్తి చెందని కాంగ్రెస్.. సభ నుంచి వాకౌట్ హైదరాబాద్: వక్ఫ్ భూముల పరిరక్షణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ నివసించే ప్రాంతంలో ఉన్న వక్ఫ్ భూములు కూడా వేరేవారి ఆధీనంలో ఉన్నాయని కాంగ్రెస్ సభ్యులు చేసిన విమర్శలు గురువారం శాసనమండలిలో రభసకు కారణమయ్యాయి. ఫారూఖ్ హుస్సేన్ అడిగిన ప్రశ్నపై ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీతో పాటు సయ్యద్ అల్తాఫ్ హైదర్ రజ్వీ, సలీం, రాములు నాయక్ తదితరులు చర్చలో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందని కాంగ్రెస్ సభ్యులు విపక్షనేత షబ్బీర్ అలీ నేతృత్వంలో వాకౌట్ చేశారు. రాష్ట్రంలో 23 వేల ఎకరాల వక్ఫ్ భూములు కబ్జాకు గురయ్యాయని, భూముల పరిరక్షణకు ఏర్పాటైన కమిటీలు ఏవీ పనిచేయలేడంలేదని రజ్వీ, షబ్బీర్ అలీ విమర్శించారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బాజిరెడ్డి గోవర్ధన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే దీనిపై కాంగ్రెస్ సభ్యులు సంతృప్తి చెందలేదు. ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. 2017లో కల్వకుర్తి ఎత్తిపోతల పూర్తి.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని 2017 డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావు మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చెప్పారు. పాతూరి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ 3.65 లక్షల ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టుకు రూ. 1,295 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేశామని, ఈ బడ్జెట్లో రూ. 900 కోట్లు కేటాయించామని చెప్పారు. పొంగులేటి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ కాటన్ కాార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కళాశాల, వర్సిటీలకు సన్నబియ్యం: ఈటల కళాశాలలు, విశ్వవిద్యాలయాల వసతి గృహాలకు కూడా వచ్చే ఏడాది నుంచి సన్నబియ్యం సరఫరా చేయనున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. అనాథలను పోషించే స్వచ్చంద సంస్థలు అడిగినా, సన్నబియ్యం సరఫరా చేస్తామని మంత్రి చెప్పారు. సత్ప్రవర్తన ఖైదీల విడుదల: నాయిని జైళ్లలో మగ్గుతున్న ఖైదీలలో సత్ప్రవర్తన గల వారిని విడుదల చేయనున్నట్లు హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని క్రీడా శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్ తెలిపారు. అలాగే క్రీడలను ప్రోత్సహించేందుకు పారితోషకాలను పెంచుతున్నట్లు చెప్పారు. కోచ్‌లకు కూడా ఇప్పుడున్న వేతనాలకన్నా రెట్టింపు ఇచ్చేలా కృషి చేస్తానన్నారు. సరిహద్ధు చెక్‌పోస్టులను ఆధునికీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఇందుకోసం రూ. 10.70 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. -
వారితోనే బద్నామవుతున్నాం
* ‘రెవెన్యూ’పై మహమూద్ అలీ సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘రెవెన్యూ శాఖ చాలా కీలకమైంది. పుట్టుకు మొదలు చనిపోయే వరకు ఇచ్చే ధ్రువపత్రాలన్నీ ఈ శాఖ నుంచే జారీ చేయాలి. ఇంతటి ముఖ్యమైన శాఖకు కొందరు అవినీతి అధికారులతో చెడ్డపేరు వస్తోంది. ఇకపై ఇలాంటివి సహించేది లేదు. శాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తాం. ప్రతి సేవనూ ఆన్లైన్ చేసి అక్రమాలను అరికడతాం.’ అని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను తనిఖీ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో పలు అంశాలపై సమీక్షించిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వస్థలాల ఆక్రమణ జరగకుండా రిజిస్ట్రేషన్ విభాగాన్ని రెవెన్యూ శాఖ వెబ్‌సైట్‌తో అనుసంధా నం చేస్తామని మహమూద్ అలీ తెలిపారు. ఇలా సమన్వయం చేయడంతో ప్రభుత్వస్థలాల వివాదాలు తగ్గడం తోపాటు పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ స్థలాలపై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే నిర్వహించి మ్యాపింగ్ చేస్తున్నామని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో సర్వే దాదాపు పూర్తి అయిందన్నారు. -
ఊరూరా ‘రిజిస్ట్రేషన్’ స్టాంపులు
పోస్టల్ శాఖతో సర్కారు ఎంవోయూ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ పోర్టల్‌ను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రా మాల్లోనూ నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్లు ల భ్యమయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. సెప్టెంబరు 1 నుంచి పట్టణ ప్రాంతాల్లోని 859 పోస్టాఫీసుల్లోనూ, త్వరలో 6,500 గ్రామీణ పోస్టాఫీసుల ద్వారా ఈ సదుపాయాన్ని కల్పించబోతున్నట్లు చెప్పారు. సచివాలయంలో గురువారం ఉప ముఖ్యమంత్రి సమక్షంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, పోస్టల్ శాఖల ఉన్నతాధికారులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎన్ఐసీ సహకారంతో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఆధునీకరించిన వెబ్‌పోర్టల్ ను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రిజి స్ట్రేషన్ల శాఖకు సంబంధించిన మరికొన్ని ఐటీ ఆధారిత సేవలను ప్రజలకు అందుబాట్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. కార్యక్రమం లో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ముఖ్య కార్యద ర్శి వీకే అగర్వాల్, కమిషనర్ అహ్మద్ నదీమ్, జాయింట్ ఇన్స్పెక్టర్ జనరల్ వెంకట రాజేశ్, పోస్ట్ మాస్టర్ జనరల్ పీవీఎస్ రెడ్డి, ఎన్ఐసీ ఉన్నతాధికారి రామ్మోహన్రావు పాల్గొన్నారు. కొత్త ‘రిజిస్ట్రేషన్’ సేవలిలా.. పోర్టల్ నుంచే అధికారులతో ఇంట రాక్షన్ నవీకరించిన రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్ పోర్టల్ ద్వారా వినియోగదారులు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు నేరుగా రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో ఇంటరాక్ట్ కావచ్చు. తమ ఆస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి స్టాంపు డ్యూటీలు, రిజిస్ట్రేషన్ ఫీజు తదితర వివరాలను పొందవచ్చు. వెబ్ పోర్టల్ సేవలు ఈ నెల 11 నుంచి లభ్యమవుతాయి. పబ్లిక్ డేటా ఎంట్రీ వ్యవస్థ రిజిస్ట్రేషన్ చేయాల్సిన ఆస్తుల వివరాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి సమర్పించేందుకు కనీసం గంట పడుతోంది. వెబ్ పోర్టల్‌లోని పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ఏ కంప్యూటర్ నుంచైనా ముందుగానే డేటాను ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ క్షణాల్లో పూర్తి అవుతుంది. ముందుగానే స్లాట్ బుకింగ్ ఆస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి ఎవరైనా తాము కోరుకున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. దీని కోసం ఆయా కార్యాలయాల వద్ద తమ వంతు వచ్చిందాక ఇక నుంచి నిరీక్షించాల్సిన పనిలేదు. వెబ్ పోర్టల్ ద్వారా ముందుగా స్లాట్ (ఫలానా రోజు, సమయం)ను బుక్ చేసుకోవచ్చు. ఒకరికి కేటాయించిన స్లాట్(సమయం)లో మరొకరు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుకాదు. పెండింగ్ పత్రాలూ ఈసీలో ప్రత్యక్షం ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ పూర్తయిన డాక్యుమెంట్ల వివరాలే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్(ఈసీ)లో కనిపిస్తాయి. తాజాగా రిజిస్ట్రేషన్ పెండింగ్‌లో ఉన్న పత్రాల వివరాలను కూడా ఇకపై ఈసీలో కనిపించేలా అధికారులు ఏర్పాటు చేశారు. పెండింగ్‌కు తగిన కారణాలను కూడా పేర్కొంటారు. ఎస్ఎంఎస్ అలర్ట్ ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి వివిధ దశల్లో డాక్యుమెంట్ స్టేటస్‌ను సంక్షిప్త సమాచారం(ఎస్ఎంఎస్) రూపంలో వినియోగదారుని మొబైల్‌కు అందనుంది. రిజిస్ట్రేషన్ దరఖాస్తు నుంచి రిజిస్ట్రేషన్ ముగింపు వరకు వివిధ దశల్లో డాక్యుమెంట్ స్టేటస్‌ను తెలుసుకునేందుకు వీలవుతుంది. 2 షిఫ్టుల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రాష్ట్రవ్యాప్తంగా రద్దీగా ఉండే రిజిస్ట్రేషన్ కార్యాలయాలను రెండు షిఫ్టులుగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్‌లోని బోయినపల్లి, మారేడ్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్ కా ర్యాలయాలను ఎంపిక చేశారు. ఈ నెల 17 నుంచి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 9 గంటలవరకు ఈ కార్యాలయాలు పనిచేస్తాయి. దీనిద్వారా ఉద్యోగులు, వ్యాపారులు వీలైన సమయాల్లోనే రిజిస్ట్రేషన్‌కు వెళ్లవచ్చు. పోస్టాఫీసుల ద్వారా స్టాంపుల విక్రయం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతమైన నెట్వర్క్ కలిగిన పోస్టల్‌శాఖతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సెప్టెంబరు 1 నుంచి పోస్టాఫీసుల్లో నాన్ జ్యుడీషియల్ స్టాంపులను నగదు చెల్లించి లేదా క్రెడిట్ కార్డు ద్వారా(క్యాష్‌లెస్) కొనుగోలు చే యవచ్చు. పోస్టల్ శాఖ అందించే 343 రకాల సేవలను‘వన్ స్టాప్ షాప్’ల ద్వారా ప్రజలకు మరింత అందుబాట్లోకి తెచ్చేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు సంసిద్ధత వ్యక్తం చేశారు. మున్ముందు మరిన్ని సేవలు కీలకమైన పాత రికార్డులను డిజిటలైజేషన్ చేయాలని, ప్రతి రిజిస్ట్రేషన్‌ను ఆధార్‌తో లింక్ చేయాని సర్కారు భావిస్తోంది. త్వరలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్నీ ఆదివారం కూడా పని చేసేవిధంగా సర్కార్ చర్యలు చేపడతామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. -
జీవితకాలం పూర్తయితే.. చార్మినార్‌నైనా కూలగొట్టాల్సిందే!
ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ హన్మకొండ అర్బన్: నిర్మాణం యొక్క జీవితకాలం పూర్తయి, శిథిలావస్థకు చేరి, ప్రజలకు ఇబ్బందికరంగా మారినప్పుడు ప్రజాభీష్టం మేరకు చార్మినార్ వంటి నిర్మాణమైనా కూల గొట్టి కొత్త కట్టడం నిర్మించాల్సి ఉంటుందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నా రు. శనివారం కాజీపేటలోని ఎన్ఐటీ సమీపంలోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, కలెక్టరేట్‌ను ఆయన సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం ప్రదేశంలో ఆధునిక హంగులతో అంతర్జాతీయ ప్రమాణాలతో 20 అంతస్తుల నూతన భవనం నిర్మించేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. పురాతన భవనాలను వందల కోట్లు వెచ్చించి 10 సంవత్సరాల వయసు పెంచడంవల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని.. అందువల్ల పురాతన భవనాల స్థానంలో పూర్తిగా కొత్తభవనాలు నిర్మించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. నూతన భవనం ఉస్మానియా ఆస్పత్రి పేరు మీదనే నిర్మితమవుతుందని ఆయన స్పష్టం చేశారు. రోగులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ముస్లింలు, గిరిజనులకు 12%రిజర్వేషన్లు సుధీర్ కమిటీ నివేదిక ఆధారంగా ముస్లిం, మైనారిటీలు, గిరిజనులకు చెందాల్సిన 12 శాతం రిజర్వేషన్ల అమలు కోసం ఈ ఏడాదిలోని బిల్లును తెస్తామని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. హన్మకొండలో శనివారం జరిగిన ‘ఈద్ మిలాప్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహమూద్ అలీ మాట్లాడారు. -
వేయిస్తంభాల గుడి పక్కన ‘యెతిమ్‌ఖానా’
వేయిస్తంభాల గుడి పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో యెతిమ్‌ఖానా(అనాథాశ్రమం) ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహముద్ అలీ అన్నారు. హన్మకొండలోని జక్రియా ఫంక్షన్హాల్లో శనివారం నిర్వహించిన ‘ఈద్‌మిలాప్’ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. దాదాపు 2 కోట్ల మంది ముస్లింలకు రంజాన్ పండుగ సరుకులు అందజేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తర్వాత ఆయన రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. కలెక్టరేట్‌ను కూడా పరిశీలించారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హన్మకొండ చౌరస్తా : వేయిస్తంబాలగుడి సమీప ప్రభుత్వ స్థలంలో యెతిమ్‌ఖానా(అనాథాశ్రమం) ఏర్పాటు చేయనున్నట్లు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. హన్మకొండలోని జక్రి యా ఫంక్షన్‌హాల్ లో శనివారం నిర్వహించిన ‘ఈద్‌మిలాప్’ కార్యక్రమానికి ఆయన హాజరై మా ట్లాడారు. రాష్ట్రంలో తొలిసారి రంజాన్ పర్వదినాన్ని అధికారికంగా నిర్వహించింది కేసీఆర్ సర్కారేనన్నారు. సుమారు 2 కోట్ల మంది ము స్లింలకు పండుగ సరుకులు అందజేసి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారన్నారు. జిల్లాలో వక్ఫ్‌బోర్డు స్థలాల ను చూపెడితే ఖబరస్థాన్ల ఏర్పాటుకు అధికారులతో చర్చిస్తామన్నారు. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి మా ట్లాడుతు తెలంగాణ ఉద్యమంలో ముస్లిం మైనారిటీలు ముందు వరుసలో నిలిచారన్నారు. ముస్లింల జీవన విధానంపై సచార్ కమిటీ ఇచ్చిన నివేదిక చూసి కేసీఆర్ కంటతడి పెట్టారని గుర్తు చేశారు. టీ ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపెల్లి రవీందర్రావు మాట్లాడుతూ, ఎన్ని ఆరోపణలు ఎదురైనా నిజాం సర్కార్ పనితీరును మెచ్చుకున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. అనంతరం డిప్యూటీ సీం పెద్దమ్మగడ్డ ఈద్గా పరిశీలించారు. వివాదంలో ఉన్న స్థలాల సమస్య పరిష్కారం కోసం సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతానని హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో లింగంపల్లి కిషన్‌రావు, కోలా జనార్దన్, మహ్మద్ నయిమొద్దీన్, డాక్టర్ అనీఫ్ సిద్దిఖీ, వెంకటాచారి పాల్గొన్నారు. -
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
భగవంతుడి సేవలో అందరం సమానమే ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆదిబట్ల : స్వరాష్ట్రంలో గురు పౌర్ణమి పండగను మతాలకతీతంగా జరుపుకోవాలని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో రెండు రోజులుగా జరుగుతున్న చతుర్థ వార్షికోత్సవాల్లో భాగంగా గురువారం డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డితో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే ఇక్కడి సాయిబాబా మందిరం ఎంతో ప్రసిద్ధిగాంచుతుందని ఆశాభవం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతురి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేవాలయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన అన్ని సౌకర్యాల ఏర్పాటుకు ప్రయత్నిస్తామని తెలిపారు. అంతకుముందు సాయిబాబా ఆలయంలో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మలక్‌పేట్ మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రాంరెడ్డి సాయిబాబాను దర్శించుకున్నారు. దేవాలయ కమిటి ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ శేఖర్, మాజీ సర్పంచ్‌లు కొత్త యాదగిరి గౌడ్, కొత్త ప్రమీల, కాకి భూపాల్, దేవాలయ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకోల్ చంద్రకళా రవీందర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
నిజాం రుబాత్‌లో హజ్ యాత్రికులకు ఉచిత బస: మహమూద్
సాక్షి, హైదరాబాద్: హజ్‌యాత్ర-2015 సందర్భం గా నిజాం రుబాత్‌కు ఎంపికైన యాత్రికులకు ఉచిత బసతోపాటు భోజనం, లాండ్రీ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రకటించారు. గురువారం హైదరాబాద్‌లోని హజ్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సౌదీ అరేబియాలోని మక్కా మదీనాలో నిజాం రుబాత్ సమస్య పూర్తిగా పరిష్కారమైందన్నారు. రుబాత్లోని రెండు భవనాల్లో యాత్రికులకు బస ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ వర్గాలకు జిల్లాకొక రెసిడెన్షియల్ స్కూల్, వసతిగృహాలను నెలకొల్పుతోందని తెలి పారు. త్వరలో వక్ఫ్ ట్రిబ్యునల్‌ను ముగ్గురు జడ్జి ల ప్యానల్‌తో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. -
యోగాతోనే ఆరోగ్యకర ఆయుష్షు
ప్రపంచ యోగా, ఆరోగ్య కన్వెన్షన్ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం సాక్షి, హైదరాబాద్: యోగాతోనే ఆరోగ్యకరమైన ఆయుష్షు ఉంటుందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నాలుగురోజుల పాటు ఆర్ట్ ఎక్సోటికా కంపెనీ, ‘సాక్షి’ మీడియా సంయుుక్తంగా నిర్వహిస్తున్న ప్రపంచ యోగా, ఆరోగ్య కన్వెన్షన్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఆయుర్వేద, యునాని, సిద్ధా, హోమియోపతి వైద్యసేవలను ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. ‘ఆయుష్’కు నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమానికి జ్యోతి వెలిగించి ప్రారంభించిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ...ప్రధాని మోదీ పట్టుదలతో ఐక్యరాజ్యసమితి జూన్ 21ని ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటించిందన్నారు. ఆరోగ్యకర జీవితం కోసం అందరూ యోగా చేయాలని పిలుపునిచ్చారు. విద్యాసంస్థల్లో యోగా తరగతులు చేర్చాలన్న అంశానికి అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలన్న దత్తాత్రేయ.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. సద్వినియోగం చేసుకోవాలి... ‘నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్లో ఉచిత యోగాక్లాసులు, ఆయుర్వేద, యునాని, సిద్ధా, హోమియోపతి ఉచిత వైద్య సేవలు, ప్రకృతి ఔషధాల మొక్కల పంపిణీ ఉంటుంది. ఆయా రంగాల్లో ప్రముఖులు చేసే ప్రసంగాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల’ని నిర్వాహకులు రామ్.జి.రెడ్డి, సంధ్యలు తెలిపారు. ప్రవేశం ఉచితం. ప్రతీరోజూ ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు ఉచిత యోగా క్లాస్‌లు ఉంటాయి. ఉదయం పది నుంచి రాత్రి ఏడు గంటల వరకు స్టాళ్లు తెరిచి ఉండనున్నాయి. ఆయుర్వేద, యునాని, సిద్ధా, హోమియోపతి ప్రాధాన్యతను తెలిపే వివిధ కంపెనీల స్టాళ్లను ఏర్పాటుచేశారు. ప్రాచీన వైద్యం వల్ల జరిగే లాభాలను ఎగ్జిబిషన్‌కు వచ్చిన ప్రజలకు వివరిస్తున్నారు. ఇక్కడ ఏర్పాటుచేసిన ఆర్గానిక్ ఫుడ్ రుచులు కూడా సందర్శకులకు నోరూరిస్తున్నాయి. తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేవిధంగా సాంసృ్కతిక కార్యక్రమాలు సాయంత్రం ఉండనున్నాయి. -
నేడు మక్కాకు మహమూద్ అలీ
హైదరాబాద్: మక్కాలో ఉమ్రా ప్రార్థనలు చేసేందుకు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ శుక్రవారం జెద్దాకు వెళ్లనున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు బయలుదేరనున్నారు. ఆదివారం హజ్ యాత్రికుల ఉచిత బస నిజాం రుబాత్ వివాదంపై అక్కడి నిర్వాహకులతో చర్చిస్తారు. ఈ నెల 12న హైదరాబాద్‌కు చేరుకుంటారు. -
కేసీఆర్ మహాత్ముడా? : షబ్బీర్ అలీ
-
కేసీఆర్ మహాత్ముడా? : షబ్బీర్ అలీ
హైదరాబాద్: ‘కేసీఆర్‌ను మహాత్ముడు అని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఎందుకు పొగిడారు..? దళితుడిని తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పి మాటతప్పినందుకా?, వారికి దక్కాల్సిన సీఎం కుర్చీని కబ్జా చేసినందుకా..? ఎందుకు మహాత్మా అని పొగుడుతున్నారు?’ అని శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ అలీ నిల దీశారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతాంగాన్ని టీఆర్ఎస్ ప్లీనరీ నిరాశకు గురిచేసిందన్నారు. కేయూ పీజీ సెట్‌కు 31 వేల దరఖాస్తులు కేయూ క్యాంపస్: కాకతీయ వర్సిటీ, శాతవాహన వర్సిటీ పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న కేయూ పీజీ సెట్‌కు ఇప్పటివరకు 31 వేల దరఖాస్తులు వచ్చినట్లు కేయూ అడ్మిషన్ల ఇన్చార్జి డెరైక్టర్ డాక్టర్ నర్సింహాచారి తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో ఈనెల 30వ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.