హజ్ యాత్రికులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
చాదర్‌ఘాట్: హజ్ యాత్రకు వెళ్లే వారికోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పిస్తోందని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆదివారం ఓల్డ్ మలక్‌పేట హైటెక్ ఫంక్షన్ హాల్లో హజ్ యాత్రికుల అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. హజ్ యాత్రికుల సౌకర్యార్థం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారన్నారు. నిజాం పాలనలో సౌదీలో ఏడు అతిథి గృహాలు ఉండేవని, ఇప్పుడు వాటిలో ఒక్కటే మిగిలిందన్నారు.
ఒక వసతి గృహంలో దాదాపు 600 మందికి ఉచిత వసతి కల్పిస్తున్నట్లు వివరించారు. అయితే మిగతా వసతి గృహాలు సౌదీ రాజుల ఆధీనంలోకి వెళ్లాయని, త్వరలో వాటిని స్వాధీనం చేసుకుని తిరిగి అందుబాటులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. హజ్ యాత్ర కోసం హైదరాబాద్ నగరం నుంచి 11,483 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 2,252 మందికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం మొత్తంగా 17,390 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. హజ్ యాత్ర సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బలాల, హజ్ యాత్ర అధికారులు, దాదాపు వెయ్యి మంది యాత్రికులు పాల్గొన్నారు.