Hajj pilgrimage
-
దరఖాస్తు చేస్తే చాలు.. హజ్ యాత్రకు..
సాక్షి, హైదరాబాద్: హజ్ కమిటీ చరిత్రలో తొలిసారి దరఖాస్తు చేసుకున్న వారందరికీ హజ్ యాత్రకు వెళ్లే అవకాశం దక్కింది. తొలిసారి రాష్ట్రం నుంచి దాదాపు 10 వేల మంది యాత్రికులు 2025 హజ్ యాత్రకు వెళ్లనున్నట్టు రాష్ట్ర హజ్ కమిటీ ఈవో లియాకత్ హుస్సేన్ వెల్లడించారు. ఏటా గరిష్టంగా 6 నుంచి 7 వేల మందికే యాత్రకు అవకాశం దక్కేది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో కేవలం 40–50 శాతం మందికే యాత్రకు వెళ్లే అవకాశం లభించేది. కానీ ఈసారి రాష్ట్ర హజ్ యాత్ర కోటా పెరగడం.. దరఖాస్తులు తక్కువగా రావడంతో యాత్రకు వెళ్లే అవకాశం అందరికీ దక్కింది. ఈ ఏడాది 10 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఇప్పటికే 8,500 మంది యాత్రకు ఎంపికయ్యారు. మిగతా 1,500 మంది మరో 2–3 నెలల్లో ఎంపికవుతారని రాష్ట్ర హజ్ కమిటీ అధికారులు తెలిపారు. ఈ ఏడాది 2024 హజ్ యాత్రకు 11 వేల దరఖాస్తులు రాగా.. ఇందులో రాష్ట్రం నుంచి 7,500 మందికి మాత్రమే యాత్రకు వెళ్లే అవకాశం దక్కింది. 2025కు కేంద్ర హజ్ కమిటీ.. రాష్ట్ర హజ్ యాత్రికుల కోటా పెంచడంతో వెయ్యి దరఖాస్తులు తగ్గాయి. వచ్చే ఏడాది జూన్ 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు హజ్ యాత్ర కొనసాగనుంది. యాత్రకు నెల రోజుల ముందు నుంచే.. నగరం నుంచి హజ్ కమిటీ ద్వారా ప్రయాణం ప్రారంభం కానుందని లియాకత్ హుస్సేన్ చెప్పారు. -
హజ్ యాత్ర మృతులపై సౌదీ అధికారిక ప్రకటన.. మరణాలు ఎన్నంటే?
ఇటీవల సౌదీ అరేబియాలో హజ్ యాత్ర సందర్భంగా యాత్రికులు మృత్యువాతపడ్డారు. ఈ సందర్భంగా యాత్రకు వచ్చిన వారిలో 1301 మంది చనిపోయారని సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇదే సమయంలో అస్వస్థతకు గురైన పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు చెప్పుకొచ్చింది.కాగా, సౌదీ అరేబియా హజ్ యాత్రకు ఈ ఏడాది పలు దేశాల నుంచి కొన్ని లక్షల మంది వచ్చారు. దాదాపు 22 దేశాల నుంచి పది లక్షల మంది యాత్రికులు రాగా.. సౌదీ అరేబియా పౌరులు రెండు లక్షలకుపైగా హాజరయ్యారు. పది లక్షలకు మించి ముస్లింలు ఈజిప్టు నుంచి వచ్చినట్టు ప్రభుత్వం వెల్లడించింది.అయితే, ఈ ఏడాది అధికార వేడి కారణంగా ఉక్కుపోతతో యాత్రికులు ఇబ్బందిపడ్డారు. చాలా మంది ఎండలో కాలినడకన యాత్రకు రావడంతో వారి ఆరోగ్యం క్షీణించింది. వందలాది మంది క్యూ లైన్లలో నిల్చోవడం జరిగింది. ఈ కారణంగా ఉక్కుపోతలో ఊపిరి ఆడక వారంతా చనిపోయినట్టు ప్రభుత్వం పేర్కొంది. అలాగే, చనిపోయిన వారిలో 83 శాతం మంది అనధికారికంగా హజ్ చేయడానికి వచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇక, మరణాలు సంభవించిన రోజున రికార్డు స్థాయిలో 125 డిగ్రీల (ఫారెన్‌హీట్) నమోదు అయినట్టు అధికారులు చెప్పారు. Almost two millions of pilgrims has performed the Hajj easily and safely, with all needed services, the numbers of deaths are 1301 and 83% of them has no permit and tried to came to #Mecca through mountains with no shelter and with high temperatures #Hajj pic.twitter.com/QOt2Hytndt— Ahmmed (@Ahmeeed_839) June 24, 2024 మరోవైపు.. హజ్ యాత్రలో 98 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు విదేశీ మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ ఏడాది 1,75,000 మంది భారతీయులు హజ్ యాత్రకు వెళ్లినట్లు తెలిపింది. అనారోగ్యం, వృద్ధాప్యం వంటి సహజ కారణాల వల్లే వీరంతా మరణించారని వెల్లడించింది. అయితే గతంలో కన్నా ఈ ఏడాది మృతుల సంఖ్య తగ్గిందని, గత ఏడాది 187 మంది మరణించినట్టు పేర్కొంది.ఇదిలా ఉండగా.. సౌదీ అరేబియా హజ్ యాత్ర చరిత్రలో మరణాలు అసాధారణం ఏమీ కావు. కొన్ని సార్లు రెండు మిలియన్ మంది వరకు యాత్రలో పాల్గొనే సంఘటనలు ఉన్నాయి. 2015లో మీనాలో తొక్కిసలాటలో 2400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అదే సంవత్సరం మీనా వద్ద తొక్కిసలాటలో 111 మంది చనిపోయారు. 1990లో హజ్‌యాత్ర సందర్భంగా 1426 మంది చనిపోయారు. అయితే ఈసారి హీట్‌వేవ్‌తో అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయారు. Akibat cuaca panas ekstrem di mekkah melebihi 50° , setidaknya lebih dari 550 jema'ah hajj meninggal dunia dan lebih 2.000 orang di rawat.Innalilahi wa innailaihi rooji'un.Meninggal diwaktu yang indah, ditempat yang indah dan sedang memakai pakaian terindah. pic.twitter.com/HgbcnUU8UM— Humairah (@Humairah_922) June 19, 2024 -
నేడు ‘హజ్ యాత్ర’ ప్రారంభం
సాక్షి, అమరావతి/గన్నవరం: ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్–2024 యాత్ర సోమవారం ప్రారంభం కానుంది. రాష్ట్రం నుంచి ఈ ఏడాది 2,580 మంది హాజీల పవిత్ర యాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు ఉదయం 8 : 45 గంటలకు విజయవాడ ఎంబార్గేషన్ పాయింట్ (గన్నవరం విమానాశ్రయం) నుంచి తొలి విమానం బయలు దేరనుంది. మొదటి విమానంలో ప్రయాణించే 322 మంది హజ్ క్యాంపు నుంచి ఉదయం 4 గంటలకే గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు.వారి సౌకర్యం కోసం గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఈద్గా జామా మసీదు వద్ద మదర్సాలోని హజ్ వసతి క్యాంపులో ఏర్పాట్లు చేశారు. శనివారం రాత్రి హజ్ క్యాంపు వద్దకు చేరుకున్న తొలి బృందానికి వైద్య పరీక్షలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. 24 గంటలు పనిచేసేలా మదర్సా వద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటైంది. వ్యాక్సినేషన్, వైద్య సహాయం అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. మదర్సా వద్ద పరిశుభ్రమైన వాతావరణంలో టెంట్లు, ఎయిర్ కూలర్లు సిద్ధం చేసి నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నారు. మహిళా పోలీసులను కూడా నియమించారు.మదర్సా (హజ్ క్యాంపు) నుంచి హాజీలను విమానాశ్రయానికి తీసుకెళ్లేందుకు ఆర్టీసీ ఏసీ బస్సు సౌకర్యం కలి్పంచింది. అధికారులు, సిబ్బంది సమన్వయంతో హజ్ యాత్రకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ కార్యనిర్వహణ అధికారి (సీఈవో) ఎల్.అబ్దుల్ ఖాదర్ ‘సాక్షి’కి తెలిపారు. వరుసగా రెండో ఏడాది హజ్ యాత్ర కోసం ఈ ఏడాది కోటా కింద 2,902 మందికి కేంద్ర హజ్ కమిటీ అనుమతి ఇవ్వగా రాష్ట్రం నుంచి 2,580 మంది నమోదు చేసుకున్నారు. విజయవాడ నుంచి ఎంబార్గేషన్ పాయింట్‌కు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అనుమతి సాధించింది. దీంతో వరుసగా రెండో ఏడాది విజయవాడ ఎంబార్గేషన్ పాయింట్ నుంచి హాజ్ యాత్ర ప్రారంభం కానుంది.విజయవాడ నుంచి 728 మంది ఈ నెల 27, 28, 29 తేదీల్లో మూడు విమానాల్లో ప్రయాణమవుతున్నారు. హైదరాబాద్ నుంచి 1,118 మంది, బెంగళూరు నుంచి 725 మంది, చెన్నై ఎంబార్కేషన్ పాయింట్ నుంచి 9 మంది బయలుదేరనున్నారు. మక్కా, మదీనాలో యాత్రికుల కోసం ప్రతి 200 మందికి ఒక ఖాదీమ్–ఉల్–హుజ్జాజ్(స్వచ్చంద సేవకులు)ను నియమించారు. ట్రోల్ ఫ్రీ నెంబర్.. హజ్ యాత్రికులు జూలై 1 నుంచి 21వతేదీ లోపు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటారు. ఒక్కో హాజీకి సుమారు 40 రోజుల పర్యటనకు మాత్రమే అనుమతి ఉంటుంది. హ్యాండ్ బ్యాగేజి కింద 8 కిలోలు, చెక్ ఇన్ లగేజీ కింద 20 కేజీల బరువున్న రెండు బ్యాగులను అనుమతిస్తారు. విజయవాడ హజ్ క్యాంపు వద్ద ఎస్బీఐ తాత్కాలిక కేంద్రంలో ఒక్కొక్కరికి రూ.4 లక్షల వరకు ఫారిన్ ఎక్సే్చంజీ అందిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో గన్నవరం వద్ద ఒక్కొక్కరికి ఐదు లీటర్ల జామ్ జామ్ వాటర్ (పవిత్ర జలం) క్యాన్లను అందిస్తారు. యాత్రకు సంబంధించి అదనపు సమాచారం కోసం 1800 4257873 ట్రోల్ ఫ్రీ నెంబర్లో సంప్రదించవచ్చు. -
హజ్ యాత్రకు జూన్ 7న తొలి విమానం
సాక్షి, అమరావతి: ఏపీకి చెందిన హజ్ యాత్రికులు ఈసారి విజయవాడ (గన్నవరం) విమానాశ్రయం నుంచి ప్రయాణం ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో చేసిన కృషి ఫలించడంతో విజయవాడలో ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటైంది. దీంతో హజ్ యాత్రకు శ్రీకారం చుడుతూ జూన్ 7 న విజయవాడ నుంచి తొలి విమానం ఎగరనుంది. రోజుకు 155 మంది హజీలు విజయవాడ నుంచి వెళ్లనున్నారు. ఒక్కో బృందం 41 రోజుల పాటు హజ్ యాత్రను చేపట్టనుంది. ఏపీ నుంచి హజ్ యాత్రకు 2,116 మంది ఎంపికవ్వగా వీరిలో 1,115 మంది పురుషులు..1,001 మంది మహిళలున్నారు. కాగా, విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి 1,814 మంది వెళ్తున్నారు. అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు చెందిన హజీలు బెంగళూరు నుంచి వెళతారు. కృష్ణా, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప తదితర జిల్లాలకు చెందిన వారు హైదరాబాద్ నుంచి వెళ్లనున్నారు. హజ్ యాత్రను విజయవంతం చేసేలా ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏపీ హజ్ కమిటీ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ పూర్తి చేసి యాత్రకు మార్గదర్శకాలను హజీలకు అందజేసింది. విజయవాడ–గుంటూరు ఎన్‌హెచ్‌లోని నంబూరు వద్ద మదరసాలో బస ఏర్పాట్లు చేసి భోజన, వసతి, రవాణా వంటి విభాగాల వారీగా కమిటీలను వేసి యాత్ర విజయవంతానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒక్కో హజీకి రూ.3.8 లక్షల ఖర్చు హజ్–2023కు దేశంలో 22 ఎంబార్కేషన్ పాయింట్లు ఉండగా వాటి నుంచి వెళ్లే హజీలు ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అవుతుందన్నది కేంద్ర హజ్ కమిటీ నిర్ణయించింది. వాటిలో బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌ల నుంచి వెళ్లే వారికే తక్కువ ఖర్చు కానుంది. వాటితో పోల్చితే విజయవాడతో పాటు మరో 9 ఎంబార్కేషన్ పాయింట్ల నుంచి వెళ్లేవారిపై అదనపు భారం పడుతోంది. కాగా, ఒక్కొక్క హజీకి విజయవాడ నుంచి రూ.3,88,580 గా ఖర్చును కేంద్ర హజ్ కమిటీ నిర్ణయించింది. ఏపీ నుంచి హజ్ యాత్రకు వెళ్లేవారిపై పడుతోన్న అదనపు భారాన్ని ప్రభుత్వమే భరించడంతో ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమస్య తెలిసిన వెంటనే సీఎం జగన్ ఆదేశాలతో ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, హజ్ కమిటీ చైర్మన్ గౌస్ అజామ్‌లు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతిఇరానీ, కేంద్ర హజ్ కమిటీని సంప్రదించారు. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్లే వారిపై అదనపు భారం తగ్గించే పరిస్థితి లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే హజీలపై పడుతోన్న అదనపు ఖర్చుల భారం రూ.14.51 కోట్లను విడుదల చేసింది. -
Andhra Pradesh: ‘హజ్’ అరుదైన భాగ్యం
కర్నూలు (ఓల్డ్‌సిటీ) : ఇస్లాం ఐదు మూల స్తంభాలపై ఆధారపడి ఉండగా అందులో మొదటిది విశ్వాసం. ఆతర్వాతి స్థానాలు నమాజ్, రోజా, జకాత్, హజ్‌లకు లభిస్తాయి. నమాజ్, రోజాలకు ఆర్థిక స్థోమత అవసరం ఉండదు. నాలుగోది జకాత్ (అంటే దానధర్మాలు). హజ్ అనేది ఆర్థిక స్థోమతను బట్టి జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన పవిత్ర యాత్ర. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది ముస్లింలు 40 రోజుల పవిత్ర హజ్‌యాత్ర చేస్తున్నారు. హజ్‌యాత్ర ఒకప్పుడు ప్రయాసతో కూడుకున్నది. సుదీర్ఘ ఓడ ప్రయాణం, ఆ తరువాత సౌదీలో ఒంటెలు, గుర్రాలపై ప్రయాణం వంటి దశలు ఉండేవి. విమాన ప్రయాణం మొదలైనప్పటి నుంచి ఎంతో సులువుగా మారింది. 2019కి సంబంధించిన జిల్లా యాత్రికులు 473 మంది యాత్ర చేశారు. ఆతర్వాత కోవిడ్–19 కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో భారతీయులకు హజ్ యాత్ర అవకాశం కలగలేదు. ప్రస్తుతం 2022కి సంబంధించిన దరఖాస్తుల ప్రకియ ఈనెల 1వ తేదీనే ప్రారంభమైంది. హజ్ యాత్రకు వెళ్లాలనుకునే వారు పూర్తి చేసిన దరఖాస్తులను జనవరి 10వ తేదీలోపు అందజేయాల్సి ఉంటుంది. (కాగా ఆన్‌లైన్‌కు ఆఖరు తేది 2022, జనవరి 31). ముస్లింలలో ఎక్కువ శాతం నిరక్షరాస్యులు. పైగా దరఖాస్తు గడులన్నీ ఆంగ్లంలో ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని పూరించాలంటే తలప్రాణం తోకకు వస్తుంటుంది. ఒక్కగడి తప్పుగా పూరించినా హజ్ యాత్రలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదా సెంట్రల్ హజ్ కమిటీ తరపున హజ్‌యాత్ర చేసే అవకాశం కోల్పోవచ్చు. అన్ని అంశాలను కూలంకషంగా అర్థం చేసుకున్న తర్వాతే పూరించాల్సి ఉంటుంది. దరఖాస్తు పూరించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియబరుస్తూ హజ్ యాత్రికులకు ‘సాక్షి’ అందించిన తోడ్పాటే ఈ కథనం.. దరఖాస్తుల్లో రెండు విధాలు.. కుటుంబంలో ఒక్కరే హజ్‌యాత్రకు వెళ్లాలనుకుంటే వ్యక్తిగత వివరాలతో దరఖాస్తు చేసుకుంటే చాలు. అదే కుటుంబంలోని నలుగురు సభ్యులు వెళ్లాలనుకుంటే ఒకే దరఖాస్తులో అందరి వివరాలు పొందుపరచవచ్చు. ఇలాంటి దరఖాస్తును ‘కవర్’ అంటారు. కవర్లో కవర్‌హెడ్ అందరి తరపున బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. కవర్లో ఐదుగురు కుటుంబ సభ్యులు, బంధువులు వెళ్లవచ్చు. ఇందులో (09.09.2022 నాటికి) రెండేళ్లలోపు వయస్సు కలిగిన ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉండవచ్చు. (వీరికి టికెట్టులో 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది.) యాత్రికులు అందజేసిన దరఖాస్తులను హజ్ కమిటీలు, సొసైటీల ప్రతినిధులు బాధ్యత తీసుకుని ఆన్లైన్ చేస్తారు. కవర్ నెంబర్ మాత్రం ఐహెచ్‌పీఎంఎస్ సాఫ్ట్వేర్ ద్వారా జనరేట్ చేస్తారు. హజ్ యాత్రికులను ఎంపిక చేసేందుకు సెంట్రల్ హజ్ కమిటీ వారు జనవరిలో కవర్ నంబర్‌తోనే డ్రా తీస్తారు. అర్హతలు.. భారత పౌరసత్వం కల్గిన ముస్లింలు హజ్ కమిటీ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. హజ్ చేయాలంటే వారు తప్పనిసరిగా ఇండియన్ పాస్‌పోర్టు కలిగి ఉండాలి. (అది మిషన్ రీడబుల్, ఇంటర్నేషన్ పాస్‌పోర్టు అయి ఉండాలి) 2022 హజ్ యాత్ర కోసం పాస్‌పోర్టు కాలపరిమితి 2022, డిసెంబరు 31వ తేదీ వరకు ఉండాలి. ఒక్కరోజు తక్కువ ఉన్నా అనుమతించరు. హజ్ దరఖాస్తుకు జత చేయాల్సినవి.. పూరించిన హజ్ దరఖాస్తుతో పాటు సెంట్రల్ హజ్ కమిటీ అకౌంటుపై బ్యాంక్‌లో (ఎస్బీఐ బ్యాంక్‌లో) చెల్లించిన రూ. 300 చలానా, పాస్‌పోర్టు జిరాక్స్, అకౌంట్ నంబర్ కనిపించే విధంగా బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, నాలుగు ఫొటోలు (వెనక తెల్లటి బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. తెలుపు కాకుండా తలకు ఇతర రంగు టోపీ ధరిస్తే మంచిది) అందజేయాల్సి ఉంటుంది. మహిళలు చెవులు కనిపించేలా ఫొటోలు దిగాలి. ఒకవేళ పాస్‌పోర్టులో సూచించిన ఇంట్లో నివాసం ఉండకపోతే ప్రస్తుత చిరునామాను సూచించే ధ్రువపత్రం (ఆధార్ లేక రేషన్ కార్డు) కూడా జతపరచాలి. రెండు కేటగిరీల్లో యాత్ర.. హజ్ యాత్రకు వెళ్లే వారిలో చెల్లించే ఫీజును బట్టి గ్రీన్, అజీజియా అనే రెండు కేటగిరీలు ఉంటాయి. గ్రీన్ కేటగిరీ వారికి మక్కాకు సమీపంలో బస చేసే సదుపాయం కల్పిస్తారు. అయితే ప్రస్తుత సంవత్సరంలో గ్రీన్ కేటగిరీకి ‘ఎన్‌సీఎన్‌టీజడ్’ అని పేరు మార్చారు. అంటే ‘నాన్ కుకింగ్ నాన్ ట్రాన్స్పోర్ట్ జోన్’ అని అర్థం. 65 ఏళ్ల లోపు వారే అర్హులు. గతంలో డెభ్భై ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లకు హజ్‌యాత్రలో రిజర్వు కేటగిరీ కేటాయించేవారు. ప్రస్తుతం కోవిడ్–19 వచ్చాక నిబంధనలు మారాయి. 65 ఏళ్లలోపు వయస్సు కలిగిన వారు మాత్రమే యాత్రకు వెళ్లాలి. రెండేళ్లలోపు పిల్లలను వెంట తీసుకెళితే పాస్‌పోర్టు అవసరం ఉండదు. అంతకు పైబడి వయస్సు కలిగిన పిల్లలకు ప్రత్యేక పాస్‌పోర్టు అవసరం. మహిళలకు ఒంటరిగా వెళ్లే అవకాశం ఉండదు. నిబంధనల్లో సూచించిన వ్యక్తి (మెహరం) తోడుండాలి. లేదా 31.05.2022 నాటికి వయస్సు 45 ఏళ్లు పైబడిన నలుగురు మహిళలు గ్రూప్‌గా వెళ్లవచ్చు. వ్యాక్సినేషన్ తప్పనిసరి.. హజ్ యాత్రకు వెళ్లే ముందు ప్రతి యాత్రికుడు తప్పనిసరిగా రెండు డోసుల కోవిడ్–19 వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలనే నిబంధన ఉంది. వ్యాక్సినేషన్ చేయించుకోవడమే కాకుండా ఆ మేరకు సర్టిఫికెట్ కూడా పొందుపరచాల్సి ఉంటుంది. వీరు అనర్హులు.. గర్భిణీ మహిళలు, మానసిక రోగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, కుష్ఠు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండదు. నామినీ.. హజ్ యాత్రికుల వెంట రాకుండా ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల పేరును (పూర్తి చిరునామాతో) మాత్రమే నామినీగా పొందుపరచాలి. బ్యాంక్‌లో ఖుర్బానీ ఫీజు.. హజ్‌యాత్రలో భాగంగా ఖుర్బానీ నిర్వహించడానికి సౌదీ ప్రభుత్వం గుర్తించిన ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఐడీబీ)లో ‘అదాయి కూపన్’ తీసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులో ఈ అంశాన్ని స్పష్టం చేయాలి. (ప్రైవేట్ వ్యక్తులకు ఖుర్బానీ సొమ్ము అప్పగిస్తే వారు మోసగించే అవకాశం ఉందని చెబుతారు). లక్కీ డ్రా.. దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చినా సెంట్రల్ హజ్ కమిటీ నిర్ణయించిన కోటా మేరకే యాత్రికులు ఎంపికవుతారు. ముంబాయిలో డ్రా తీస్తారు. డ్రాలో వచ్చిన వారికి మాత్రమే కమిటీ తరపున హజ్‌యాత్రకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఉచితంగా ఆన్లైన్ సేవలు.. హజ్ యాత్రికులకు సేవ చేస్తే పుణ్యం లభిస్తుందనే సదుద్దేశంతో జిల్లాలో అనేక సొసైటీలు ముందుకు వచ్చి వారి ప్రయాణానికి అవసరమైన సేవలు ఉచితంగా అందిస్తున్నాయి. సొసైటీల ప్రతినిధులు దరఖాస్తులను ఉచితంగా ఆన్లైన్ చేస్తున్నారు. దరఖాస్తులు మొదలు హజ్ యాత్రికులు విమానం ఎక్కే దాకా వారికి అవసరమైన శిక్షణ, సదుపాయాలు, రోగనిరోధక వాక్సినేషన్ వంటి సేవాభావంతో కల్పిస్తాయి. బుధవారపేటలోని మహబూబ్‌సుభానీ మసీదులో రాయలసీమ హజ్ సొసైటీ వారు సేవలు అందిస్తున్నారు. వీరి ఫోన్ నంబర్లు: అధ్యక్షుడు ఎం.మొహమ్మద్పాష: 76809 01952, ప్రధాన కార్యదర్శి బాషా సాహెబ్: 99633 18255. జిల్లా హజ్ సొసైటీ అధ్యక్షుడు నాయబ్ సలీం: 99123 78586, ప్రధాన కార్యదర్శి అష్వాక్ హుసేని: 98662 86786. దరఖాస్తుకు జతపరచాల్సిన పత్రాలతో వీరిని సంప్రదిస్తే ఉచితంగా ఆన్లైన్ చేస్తారు. ఒంట్లో సత్త ఉన్నప్పుడు వెళ్లి రావడమే మేలు: ఇర్షాదుల్ హక్ ఆర్థిక స్థోమత కలిగిన వాళ్లు వృద్ధాప్యం వచ్చేంత వరకు నిరీక్షించాల్సిన అవసరం లేదు. ఎవరి ఆయుష్షు ఎంత ఉంటుందో ఎవరికి తెలియదు కదా.. పైగా వృద్ధాప్యంలో లేనిపోని జబ్బులు వస్తుంటాయి. వాటిని భరించి 40 రోజుల ప్రయాణంలో ఇబ్బందులు పడటం కంటే, యవ్వన ప్రాయంలోనే హజ్ యాత్రకు వెళ్లి రావడం ఉత్తమం. నేను అబ్బాస్‌నగర్‌లో ఉంటాను. నాకు ఏసీ స్పేర్‌పార్ట్స్ షాప్ ఉంది. హజ్‌కు వెళ్లేంత స్థోమత ఉంది కాబట్టి నా 50వ ఏటనే హజ్ ముగించుకువచ్చాను. నా ముగ్గురు పిల్లలను బంధువులకు అప్పగించి నేను, నాభార్య ఇద్దరు కలిసి ఓ ఐదేళ్ల క్రితమే హజ్ యాత్రకు వెళ్లొచ్చాం. యాత్రకు అవసరమైన డాక్యుమెంటేషన్ అంతా హజ్ సొసైటీల వాళ్లే ఉచితంగా చేసి పెట్టారు. అల్లా వారికీ పుణ్యం ప్రసాదిస్తాడు. శిక్షణ తీసుకోకపోతే ఇక్కట్లే.. : జాకిర్ హుసేన్, సివిల్ ఇంజనీరు నేను సివిల్ ఇంజనీర్ని. బాలాజీనగర్‌లో ఉంటాను. హజ్‌కు వెళ్లాలంటే సాధారణ దుస్తులను వదిలేసి ఇహ్రాం అనే వస్త్రాన్ని ధరించాల్సి ఉంటుంది. దేశం వదిలి ఇతర దేశానికి వెళతాం కాబట్టి అక్కడి చట్టం, అక్కడి నియమ నిబంధనలపై అవగాహన ఉండాలి. హజ్ యాత్రలోని ప్రధాన ఘట్టాలు కూడా తెలిసి ఉండాలి. పక్కనే ఉండే వ్యక్తిని అడిగితే అతనూ మనదేశీయుడే అయి ఉంటాడు. అందువల్ల హజ్‌యాత్రకు ముందే అన్ని తెలుసుకుని ఉండాలి. ఇందుకు హజ్ సొసైటీలు నిర్వహించే శిక్షణ తరగతులు బాగా ఉపయోగపడతాయి. అప్లికేషన్ భర్తీ చేసేటప్పుడు ఒక్క గడి తప్పున్నా అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. నేను విద్యావంతుడినైనా కూడా ఆన్లైన్ అప్లికేషన్‌ను సొసైటీ ద్వారానే భర్తీ చేయించుకున్నాను. -
2020 హజ్ యాత్ర లేనట్టే..!
సాక్షి, హైదరాబాద్ : 2020 హజ్ యాత్రకు సంబంధించి సౌదీ ప్రభుత్వం ఏ సమాచారం తెలియజేయడం లేదు. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెలలో హజ్ యాత్ర ప్రారంభం కావాలి. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు జరగలేదని, దీంతో కేంద్ర హజ్ కమిటీ ఈ ఏడాది యాత్ర రద్దయినట్టేనని చెబుతోందని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మసీవుల్లా, ఎగ్జిక్యూటివ్ అధికారి బి.షఫీవుల్లా బుధవారం విలేకరులకు తెలిపారు. ఈఏడాది హజ్ యాత్రకు ఎంపికైన యాత్రికులు మొదటి విడతగా రూ. 81 వేలు జమ చేశారన్నారు. (హజ్ యాత్రపై కోవిడ్ ప్రభావం) మరికొంత మంది రెండవ కిస్తు రూ.1.20 లక్షలు కూడా చెల్లించారని, రాష్ట్ర యాత్రికులు చెల్లించిన డబ్బు కేంద్ర హజ్ కమిటీ వద్ద ఉందన్నారు. ఈ ఏడాది కరోనా ప్రభావంతో హజ్ యాత్ర రద్దయిన నేపథ్యంలో కేంద్ర హజ్ కమిటీ యాత్రికులకు వంద శాతం డబ్బులు తిరిగి ఇస్తుందన్నారు. తమ యాత్రను రద్దు చేసుకుంటూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి తిరిగి వారి ఖాతాలో డబ్బులు జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు. యాత్ర రద్దు చేసుకునే వారు కేంద్ర హజ్ కమిటీ వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చని లేని పక్షంలో రాష్ట్ర హజ్ కమిటీని 040–23298793లో సంప్రదించాలన్నారు. -
హజ్ యాత్రపై కోవిడ్ ప్రభావం
రియాద్/బీజింగ్/సియోల్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కోవిడ్ వైరస్ ప్రభావం హజ్ యాత్రపై పడింది. కోవిడ్ వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారిని ఈ ఏడాది జరగబోయే హజ్ యాత్రకు అనుమతించబోమని సౌదీ అరేబియా ప్రకటించింది. ఈ దేశాల నుంచి మక్కాకు వచ్చే యాత్రికులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సౌదీ విదేశీ వ్యవహారాల శాఖ గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. వారిని మక్కాలోకి అనుమతించబోమని తెలిపింది. కేవలం ఉమ్రా యాత్రికులనే కాకుండా మదీనాను సందర్శించే వారిని సైతం అనుమతించబోమని ప్రకటించింది. ఈ ఆంక్షలు ఎప్పటివరకు కొనసాగుతాయనే దానిపై మాత్రం సౌదీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. మక్కా యాత్రకు తాత్కాలిక బ్రేక్ శంషాబాద్: నిషేధం నేపథ్యంలో హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి గురువారం ఉమ్రా యాత్ర కోసం వచ్చిన 76 మంది ప్రయాణికులను ఇమిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. జపాన్‌లో పాఠశాలల మూసివేత టోక్యో: కోవిడ్ వైరస్ కారణంగా జపాన్‌లోని అన్ని పాఠశాలలను కొన్ని వారాలపాటు మూసివేయాలని ఆ దేశ ప్రధాని షింజో అబే ఆదేశించారు. మార్చి 2 నుంచి వసంత కాలం సెలవులు పూర్తయ్యే వరకు తాత్కాలికంగా పాఠశాలలను మూసివేయనున్నట్లు తెలిపారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో సంయుక్త సైనిక విన్యాసాలను వాయిదా వేస్తున్నట్లు దక్షిణ కొరియా, అమెరికా ప్రకటించాయి. శాంతిస్తున్న కోవిడ్ కోవిడ్ తీవ్రత క్రమేపీ నెమ్మదిస్తోంది. వైరస్ కారణంగా చైనాలో సంభవిస్తున్న రోజువారీ మరణాల్లో తగ్గుదల నమోదు అవుతూండటం దీనికి కారణం. చైనా ఆరోగ్య కమిషన్ గురువారం తెలిపిన దాని ప్రకారం బుధవారం కేవలం 29 మంది కోవిడ్‌కు బలయ్యారు. దీంతో ఇప్పటివరకూ ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2744కు చేరుకోగా, నిర్ధారిత కేసుల సంఖ్య 78,497కు చేరుకుంది. దేశంలోని మొత్తం 31 ప్రావిన్సుల్లోనూ అతితక్కువ మరణాలు నమోదు కావడం కొన్ని వారాల్లో ఇదే మొదటిసారి. చైనా చేపట్టిన చర్యల కారణంగా కరోనా వైరస్ ఉధృతి గత అంచనాల కంటే వేగంగా కట్టడి అయిందని డబ్ల్యూహెచ్ఓ వైద్య నిపుణుడు బ్రూస్ ఐల్వార్డ్ తెలిపారు. -
హజ్ యాత్రలో 20 లక్షలు
మౌంట్ అరాఫత్: హజ్ యాత్రలో భాగంగా ఇప్పటివరకూ దాదాపు 20 లక్షల మంది ముస్లింలు సౌదీలోని ‘అరాఫత్’ కొండను దర్శించుకున్నారని సౌదీ అరేబియా ప్రభుత్వం శనివారం తెలిపింది. ఈ యాత్ర సందర్భంగా ఎలాంటి తొక్కిసలాటలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. హజ్ యాత్రలో భాగంగా భక్తులు తొలుత మక్కాను దర్శించి కాబా చుట్టూ ఏడుసార్లు తిరుగుతారు. మరుసటి రోజూ మినా నుంచి అరాఫత్ పర్వతం వద్దకు చేరుకుంటారు. మహమ్మద్ ప్రవక్త తన చివరి ఆధ్యాత్మిక ప్రవచనాన్ని ఇక్కడి నుంచే అందించారు. -
భారత్ నుంచి హజ్ కోటా పెంపు!
ఒసాకా: భారత్ నుంచి ఏటా హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల సంఖ్యను 1.7 లక్షల నుంచి 2 లక్షలకు పెంచనున్నట్లు సౌదీ అరేబియా తెలిపింది. జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న జీ–20 సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా హజ్ కోటా పెంపుపై ఇరువురు చర్చించుకున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, ఉగ్రవాద నిర్మూలన తదితర అంశాలపై చర్చించారు. విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. హజ్ కోటాను 1.7 లక్షల నుంచి 2 లక్షలకు పెంచుతామని మహ్మద్ బిన్ సల్మాన్.. మోదీకి హామీ ఇచ్చి నట్లు విజయ్ తెలిపారు. ఇరు దేశాల మధ్య పర్యా టకం పెంపొందించేందుకు విమాన సేవలు పెంచేం దుకు ఇరువురు మరోసారి సమావేశం అయ్యేందుకు సుముఖం వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది సౌదీ అరేబియాలో జరగబోయే ఓ అంతర్జాతీయ సదస్సుకు మోదీని ఆహ్వానించారని, ఇందుకు మోదీ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. మక్కా కు ఒంటరిగా వెళ్లే మహిళలను లాటరీ లేకుండానే వెళ్లేందుకు వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. పురుషుల్లేకుండానే ఒంటరిగా వెళ్లే మహిళలను గతేడాది 1,300 మందిని అనుమతించారు. -
72 ఏళ్ల క్రితమే ఆకాశాన హజ్‌కు..
1946, అక్టోబర్ 22. ఆ రోజు మంగళవారం నగరమంతా సందడిగా ఉంది. జంట నగరాల నుంచి బేగంపేట విమానాశ్రయానికి ఉదయం 6 గంటల నుంచే జనం వస్తున్నారు. ఉదయం 9 గంటలకు విమానాశ్రయం జనసంద్రంగా మారింది. హైదరాబాద్‌లో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ.. దేశ చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖించిన రోజు. దేశంలోనే తొలిసారి హజ్ యాత్రకు వెళ్లేందుకు విమానం సిద్ధమైంది.ఉదయం 10 గంటలకు 18 మంది యాత్రికులతో డకోటా డీ–3 విమానం గాలిలోకి ఎగిరింది. అలా దేశంలోనే తొలిసారి హజ్ యాత్రకు దక్కన్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ విమానానికి పైలెట్లుగా కెప్టెన్ కాక్స్, మునిషీ, రేడియో ఆపరేటర్‌గా నాసిర్, ఫ్లైట్ ఇంజనీర్‌గా లార్డ్ వ్యవహరించారు. మంగళవారం నుంచి హజ్ యాత్ర ప్రారంభమవుతున్న నేపథ్యంలో ‘సాక్షి’ప్రత్యేక కథనం. – సాక్షి, హైదరాబాద్ 1400 ఏళ్ల క్రితమే... 1400 ఏళ్ల క్రితం నుంచే వివిధ దేశాల నుంచి సౌదీ అరేబియాలోని మక్కాకు హజ్ ఆరాధనల కోసం ముస్లింలు వెళుతున్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన బహుమనీలు, కుతుబ్ షాహీలు, ఆసిఫ్‌జాహీల కాలం నుంచే ముస్లింలు హజ్‌కు రోడ్డు, సముద్ర మార్గాల ద్వారా వెళ్లినట్లు చరిత్ర చెబుతోంది. 72 ఏళ్ల క్రితం దేశంలోనే తొలిసారి హైదరాబాద్ సంస్థాన ప్రజలు విమానంలో యాత్రకు వెళ్లారు. 1946లో ఒక విమానంలో 18 మంది వెళ్లగా, ప్రస్తుతం 25 విమానాల్లో దాదాపు 8 వేల మంది వెళుతున్నారు. హకీంపేట్ రన్‌వే నుంచి.. అప్పట్లో దేశ వ్యాప్తంగా ఎక్కడ నుంచి కూడా హజ్‌కు విమాన సర్వీసులు లేవు. 1947లో హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి రెండోసారి విమానం హజ్ యాత్రకు వెళ్లింది. అయితే యాత్రికుల సంఖ్య ఎక్కువ కావడం, బేగంపేట్ విమాన రన్‌వే తక్కువగా ఉండడంతో హకీంపేట్‌లో విమాన రన్‌వే అనుకూలంగా ఉండడంతో అక్కడి నుంచి హజ్ యాత్రకు బయలుదేరినట్లు ఇంటాక్ తెలంగాణ కో కన్వీనర్ అనురాధ తెలిపారు. ఆగుతూ.. హజ్ యాత్రకు.. హైదరాబాద్ నుంచి హజ్ యాత్రికుల విమానాలు నేరుగా సౌదీ అరేబియాలోని జెడ్డాకు వెళ్లేవి కావు. ఇంధనం ఇబ్బందులుండటంతో సిరియా, ఈజిప్టు, ఇరాక్‌తో పాటు ముంబై, కరాచి, షార్జాలో ఆగి వెళ్లేవారు. దక్కన్ ఎయిర్వేస్ విమానాలు హజ్ యాత్రకు 1946, 1947.. రెండేళ్ల పాటు నడిచాయి. అనంతరం దేశానికి స్వాతంత్య్రం రావడం, హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనం కావడంతో జరిగిన పరిణామాల దృష్ట్యా 1948–1950 వరకు విమానాలు హజ్ యాత్రకు వెళ్లలేదు. మళ్లీ 1951 నుంచి 1953 వరకు హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు విమానాలు వెళ్లాయి. 1953లో దక్కన్ ఎయిర్వేస్ ఎయిర్ ఇండియాలో విలీనం కావడంతో హజ్ యాత్రకు విమానాలు రద్దు చేశారు. ఆసిఫ్ జాహీల కాలంలో రైలు మార్గాన.. నిజాం హయాంలో హైదరాబాద్‌లో 1874లో రైల్వే లైన్ ప్రారంభమైంది. దీంతో సంస్థానం నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారు రైలు మార్గం ద్వారా ముంబైకి చేరుకొని అక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా సౌదీ అరేబియాలోని జెడ్డా నౌకాశ్రయానికి చేరుకునేవారు. నిజాం ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్లేవారికి నాంపల్లిలో ప్రభుత్వం తరఫున ఉచితంగా భోజన వసతి ఉండేది. ఏడవ నిజాం ఉస్మాన్అలీ హయాం వచ్చే సరికి నాంపల్లి స్టేషన్ హజ్ యాత్ర సమయంలో జనసంద్రంగా మారేది. యాత్రికులతో పాటు వారి కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారితో పాటు సాధారణ జనం కూడా అక్కడికి వచ్చేవారు. 1994 వరకు నౌకాయానం.. తిరిగి విమాన యానం తొలుత హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారు రోడ్డు, రైల్వే మార్గాల ద్వారా ముంబైకి చేరుకునే వారు. మొదట్లో ఇంజన్ నౌకలు లేకపోవడంతో పరదా వాటిల్లోనే యాత్ర సాగేది. రంజాన్ 2 నెలల తర్వాత హజ్ ఆరాధనలు వస్తాయి. రంజాన్ నెల ఉపవాసాల కంటే ముందే హజ్ ఆరాధనలకు ఇళ్ల నుంచి బయలుదేరే వారు. నేను 1969 నుంచి హజ్ యాత్రకు వెళుతున్నా. అప్పటి నుంచి అందరి సామాన్లు మోసేవాడిని. అందుకే అందరూ నన్ను హబీబ్ కూలీగానే పిలుస్తారు. ఆ రోజుల్లో రంజాన్ కంటే ముందు ముంబై నుంచి సౌదీ, ముజ్జదీ అనే 2 నౌకలు, రంజాన్ తర్వాత ముహ్మదీ, అక్బర్, నూర్జహా పేర్లతో నౌకలు హజ్‌కు వెళ్లేవి. నౌక ప్రయాణం దాదాపు పదమూడు నుంచి పదిహేను రోజులు పట్టేది. చివరిసారిగా 1994 వరకు నౌకాయానం జరిగింది. అనంతరం విమానయానం ప్రారంభమైంది. – హజ్ సేవకుడు హబీబ్ అబ్దుల్ ఖాదర్ ఇల్యాస్ హబీబ్ కూలీ -
మళ్లీ పెరిగిన హజ్ కోటా
సాక్షి, న్యూఢిల్లీ: వరసగా రెండో ఏడాదీ హజ్ యాత్ర కోటా పెంచుకోవడంలో కేంద్ర ప్రభుత్వం సఫలీకృతమైంది. గత ఏడాది కంటే 5వేలు ఎక్కువగా ఈ ఏడాది 1,75,025 మంది మన యాత్రికులు హజ్ యాత్రకు వెళ్లేందుకు అవకాశం కలిగిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ తెలిపారు. మూడేళ్ల క్రితం హజ్ కోటా 1,36,020గా ఉందన్నారు. ఈసారి హజ్ యాత్రకు 3,55,000 దరఖాస్తులు వచ్చినట్టు ఆయన తెలిపారు. 45 ఏళ్లు నిండిన ఒంటరి మహిళలు హజ్ వెళ్లేందుకు తొలిసారిగా అవకాశం కల్పించామని, దరఖాస్తు చేసుకున్న 1,300 మందికి లాటరీ విధానం నుంచి మినహాయించి నేరుగా అవకాశం ఇచ్చామన్నారు. కోటా పెంచినందుకు సౌదీ అరేబియాకు కృతజ్ఞతలు తెలిపారు. -
హజ్ యాత్రికులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చాదర్‌ఘాట్: హజ్ యాత్రకు వెళ్లే వారికోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పిస్తోందని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆదివారం ఓల్డ్ మలక్‌పేట హైటెక్ ఫంక్షన్ హాల్లో హజ్ యాత్రికుల అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. హజ్ యాత్రికుల సౌకర్యార్థం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారన్నారు. నిజాం పాలనలో సౌదీలో ఏడు అతిథి గృహాలు ఉండేవని, ఇప్పుడు వాటిలో ఒక్కటే మిగిలిందన్నారు. ఒక వసతి గృహంలో దాదాపు 600 మందికి ఉచిత వసతి కల్పిస్తున్నట్లు వివరించారు. అయితే మిగతా వసతి గృహాలు సౌదీ రాజుల ఆధీనంలోకి వెళ్లాయని, త్వరలో వాటిని స్వాధీనం చేసుకుని తిరిగి అందుబాటులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. హజ్ యాత్ర కోసం హైదరాబాద్ నగరం నుంచి 11,483 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 2,252 మందికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం మొత్తంగా 17,390 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. హజ్ యాత్ర సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బలాల, హజ్ యాత్ర అధికారులు, దాదాపు వెయ్యి మంది యాత్రికులు పాల్గొన్నారు. -
‘హజ్’ కోటా పెంచండి
హజ్ యాత్ర నిమిత్తం రాష్ట్రంలోని ముస్లింలు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకుంటుస్తున్నారు. దరఖాస్తులు ఈ ఏడాది పెరగడంతో రాష్ట్రానికి హజ్ సీట్ల కోటా పెంచాలన్న విజ్ఞప్తిని కేంద్రం ముందు ప్రభుత్వం ఉంచింది. పీఎం నరేంద్ర మోడీ జోక్యానికి విజ్ఞప్తి చేస్తూ శనివారం సీఎం జయలలిత లేఖాస్త్రం సంధించారు. సాక్షి, చెన్నై : ఇస్లాం పంచ సూత్రాల్లో హజ్ పయనం ఒకటి. మహ్మద్ ప్రవక్త చేసిన ఉపదేశాల మేరకు జీవిత కాలంలో ప్రతి ముస్లిం హజ్ పయనం తప్పని సరిగా చేయాల్సి ఉంది. ఈ యాత్రతో బక్రీద్ పర్వదినాన మక్కాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ప్రతి ముస్లిం పునీతులు అవుతారు. సంపన్నులు తమ స్థోమత మేరకు ప్రైవేటు ట్రావెల్స్ ద్వారా హజ్ యూత్రకు వెళుతుంటారు. ఇక పేద, మధ్య తరగతి వర్గాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇతోధిక సాయం అందిస్తున్నాయి. ఏటా రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా అర్హులైన వారిని ఎంపిక చేసి హజ్ యాత్రకు పంపుతూ వస్తున్నారు. ఇటీవల కాలంగా రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో హజ్ పయనానికి వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. దరఖాస్తులు వెల్లువెత్తడంతో లాటరీ పద్ధతిలో ఎంపికైన వారికి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ ఏడాది బక్రీద్ పర్వదినం అక్టోబరులో రానుంది. రంజాన్ ముగియగానే, హజ్ యాత్ర ఏర్పాట్లు ఆరంభం అవుతాయి. ఇప్పటి నుంచి దరఖాస్తులను ఆహ్వానించే పనిలో హజ్ కమిటీ పడింది. దరఖాస్తుల వెల్లువ : హజ్ యాత్రకు ప్రతి ఏటా దరఖాస్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది ఇప్పటికే 13,159 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హజ్ సీట్ల కోటా మాత్రం కనిష్టంగానే ఉంది. ప్రతి ఏటా కేంద్రాన్ని హజ్ కోటా సీట్ల పెంపు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసుకుంటూ వస్తోంది. గత యూపీఏ ప్రభుత్వం తమిళనాడులోని ముస్లింలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని, కోటాను పెంచారు. అయితే, ఈ ఏడాది కొత్త ప్రభుత్వం ఉన్న సీట్లకు కోత విధించడం చర్చనీయాంశంగా మారుతోంది. కోటా పెంచరూ : గతంలో కంటే, ఈ సారిగా తక్కువగా ముంబైలోని హజ్ కమిటీ రాష్ట్రానికి సీట్లను కేటాయించడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత అప్రమత్తమయ్యారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సీట్లను రాబట్టుకునేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ జోక్యానికి విజ్ఞప్తి చేస్తూ శనివారం లేఖాస్త్రం సంధించారు. హజ్ యాత్రకు వెళ్లేందుకు రాష్ట్రంలోని ముస్లీంలు దరఖాస్తులు చేసుకుంటూ వస్తున్నారని తన లేఖలో వివరించారు. ఈ ఏడాది రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు 2672 మందిని మాత్రమే అనుమతిస్తూ ముంబైలోని భారత హజ్ కమిటీ నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ఇందులో 1180 మంది బీసీ కేటగిరి, 1492 మంది ఓసీ ముస్లింలను మాత్రమే అనుమతించనున్నారు. అయితే, ఈ సంఖ్య చాలా తక్కువ అని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది హజ్‌కు వెళ్లేందుకు ఇప్పటికే వేలాది మంది ముస్లింలు దరఖాస్తులు చేసుకున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయూంలో 2012లో తమిళనాడు నుంచి 3,500 మంది, 2013లో 4 వేల మంది వరకు హజ్ యాత్రకు అనుమతించే రీతిలో కేటాయింపులు జరిగాయని వివరించారు. అయితే, ఈ ఏడాది సీట్ల సంఖ్యను తగ్గించడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నడూ లేని రీతిలో అతి తక్కువ సీట్లను కేటాయించడం శోచనీయమని, రాష్ట్రంలో ముస్లింల జనాభాను, వస్తున్న దరఖాస్తులను దృష్టిలో ఉంచుకుని హజ్‌యాత్ర సీట్లను పెంచాలని విజ్ఞప్తి చేశారు. అవసరానికి తగ్గట్టుగా మరిన్ని సీట్లను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు భారత హజ్ కమిటీనీ, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖను ఆదేశించాలని కోరారు. రాష్ట్రం నుంచి అత్యధిక శాతం మంది ముస్లింలను హజ్ యాత్రకు పంపించాలన్న కాంక్ష తమ ప్రభుత్వానికి ఉందని, ఇందుకు తమ వంతు సహకారం అందించాలని విన్నవించారు.