గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరనున్న తొలి విమానం
సాక్షి, అమరావతి/గన్నవరం: ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్–2024 యాత్ర సోమవారం ప్రారంభం కానుంది. రాష్ట్రం నుంచి ఈ ఏడాది 2,580 మంది హాజీల పవిత్ర యాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు ఉదయం 8 : 45 గంటలకు విజయవాడ ఎంబార్గేషన్ పాయింట్ (గన్నవరం విమానాశ్రయం) నుంచి తొలి విమానం బయలు దేరనుంది. మొదటి విమానంలో ప్రయాణించే 322 మంది హజ్ క్యాంపు నుంచి ఉదయం 4 గంటలకే గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
వారి సౌకర్యం కోసం గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఈద్గా జామా మసీదు వద్ద మదర్సాలోని హజ్ వసతి క్యాంపులో ఏర్పాట్లు చేశారు. శనివారం రాత్రి హజ్ క్యాంపు వద్దకు చేరుకున్న తొలి బృందానికి వైద్య పరీక్షలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. 24 గంటలు పనిచేసేలా మదర్సా వద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటైంది. వ్యాక్సినేషన్, వైద్య సహాయం అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. మదర్సా వద్ద పరిశుభ్రమైన వాతావరణంలో టెంట్లు, ఎయిర్ కూలర్లు సిద్ధం చేసి నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నారు. మహిళా పోలీసులను కూడా నియమించారు.
మదర్సా (హజ్ క్యాంపు) నుంచి హాజీలను విమానాశ్రయానికి తీసుకెళ్లేందుకు ఆర్టీసీ ఏసీ బస్సు సౌకర్యం కలి్పంచింది. అధికారులు, సిబ్బంది సమన్వయంతో హజ్ యాత్రకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ కార్యనిర్వహణ అధికారి (సీఈవో) ఎల్.అబ్దుల్ ఖాదర్ ‘సాక్షి’కి తెలిపారు.
వరుసగా రెండో ఏడాది
హజ్ యాత్ర కోసం ఈ ఏడాది కోటా కింద 2,902 మందికి కేంద్ర హజ్ కమిటీ అనుమతి ఇవ్వగా రాష్ట్రం నుంచి 2,580 మంది నమోదు చేసుకున్నారు. విజయవాడ నుంచి ఎంబార్గేషన్ పాయింట్‌కు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అనుమతి సాధించింది. దీంతో వరుసగా రెండో ఏడాది విజయవాడ ఎంబార్గేషన్ పాయింట్ నుంచి హాజ్ యాత్ర ప్రారంభం కానుంది.
విజయవాడ నుంచి 728 మంది ఈ నెల 27, 28, 29 తేదీల్లో మూడు విమానాల్లో ప్రయాణమవుతున్నారు. హైదరాబాద్ నుంచి 1,118 మంది, బెంగళూరు నుంచి 725 మంది, చెన్నై ఎంబార్కేషన్ పాయింట్ నుంచి 9 మంది బయలుదేరనున్నారు. మక్కా, మదీనాలో యాత్రికుల కోసం ప్రతి 200 మందికి ఒక ఖాదీమ్–ఉల్–హుజ్జాజ్(స్వచ్చంద సేవకులు)ను నియమించారు.
ట్రోల్ ఫ్రీ నెంబర్..
హజ్ యాత్రికులు జూలై 1 నుంచి 21వతేదీ లోపు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటారు. ఒక్కో హాజీకి సుమారు 40 రోజుల పర్యటనకు మాత్రమే అనుమతి ఉంటుంది. హ్యాండ్ బ్యాగేజి కింద 8 కిలోలు, చెక్ ఇన్ లగేజీ కింద 20 కేజీల బరువున్న రెండు బ్యాగులను అనుమతిస్తారు. విజయవాడ హజ్ క్యాంపు వద్ద ఎస్‌బీఐ తాత్కాలిక కేంద్రంలో ఒక్కొక్కరికి రూ.4 లక్షల వరకు ఫారిన్ ఎక్సే్చంజీ అందిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో గన్నవరం వద్ద ఒక్కొక్కరికి ఐదు లీటర్ల జామ్ జామ్ వాటర్ (పవిత్ర జలం) క్యాన్లను అందిస్తారు. యాత్రకు సంబంధించి అదనపు సమాచారం కోసం 1800 4257873 ట్రోల్ ఫ్రీ నెంబర్‌లో సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment