ఏటా దరఖాస్తుల్లో 60 శాతం మందికే అవకాశం
గరిష్టంగా 6 నుంచి 7 వేల మందే ఎంపిక
ఈసారి దరఖాస్తు చేసుకున్న పది వేల మందికీ అవకాశం
కమిటీ చరిత్రలో ఇదే తొలిసారి అంటున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: హజ్ కమిటీ చరిత్రలో తొలిసారి దరఖాస్తు చేసుకున్న వారందరికీ హజ్ యాత్రకు వెళ్లే అవకాశం దక్కింది. తొలిసారి రాష్ట్రం నుంచి దాదాపు 10 వేల మంది యాత్రికులు 2025 హజ్ యాత్రకు వెళ్లనున్నట్టు రాష్ట్ర హజ్ కమిటీ ఈవో లియాకత్ హుస్సేన్ వెల్లడించారు. ఏటా గరిష్టంగా 6 నుంచి 7 వేల మందికే యాత్రకు అవకాశం దక్కేది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో కేవలం 40–50 శాతం మందికే యాత్రకు వెళ్లే అవకాశం లభించేది.
కానీ ఈసారి రాష్ట్ర హజ్ యాత్ర కోటా పెరగడం.. దరఖాస్తులు తక్కువగా రావడంతో యాత్రకు వెళ్లే అవకాశం అందరికీ దక్కింది. ఈ ఏడాది 10 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఇప్పటికే 8,500 మంది యాత్రకు ఎంపికయ్యారు. మిగతా 1,500 మంది మరో 2–3 నెలల్లో ఎంపికవుతారని రాష్ట్ర హజ్ కమిటీ అధికారులు తెలిపారు.
ఈ ఏడాది 2024 హజ్ యాత్రకు 11 వేల దరఖాస్తులు రాగా.. ఇందులో రాష్ట్రం నుంచి 7,500 మందికి మాత్రమే యాత్రకు వెళ్లే అవకాశం దక్కింది. 2025కు కేంద్ర హజ్ కమిటీ.. రాష్ట్ర హజ్ యాత్రికుల కోటా పెంచడంతో వెయ్యి దరఖాస్తులు తగ్గాయి. వచ్చే ఏడాది జూన్ 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు హజ్ యాత్ర కొనసాగనుంది. యాత్రకు నెల రోజుల ముందు నుంచే.. నగరం నుంచి హజ్ కమిటీ ద్వారా ప్రయాణం ప్రారంభం కానుందని లియాకత్ హుస్సేన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment