మరో 22 ప్రత్యేక ఉత్పత్తులకు జీఐ గుర్తింపు కోసం తెలుగు రాష్ట్రాల దరఖాస్తు
వ్యవసాయం మొదలు చేనేత, హస్తకళల్లో వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కృషి
హైదరాబాద్ ముత్యాలు, ఆర్మూర్ పసుపు సహా తెలంగాణ నుంచి పోటీలో 10 ఉత్పత్తులు
ఏపీ నుంచి పోటీపడుతున్న 12 ఉత్పత్తులు.. జాబితాలో జమ్మలమడుగు సిల్క్, మాధవరం చీరలు
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 36 ఉత్పత్తులకు జీఐ ట్యాగ్
సాక్షి, హైదరాబాద్: చేనేత, హస్తకళలతోపాటు వ్యవసాయ రంగంలో ఘన సాంస్కృతిక వారసత్వాన్ని, నైపుణ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పేందుకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. తెలుగు నేలపై ప్రత్యేకత సంతరించుకున్న మరికొన్ని ఉత్పత్తులకు ఈ ఏడాది భౌగోళిక గుర్తింపు (జీఐ) సాధించేందుకు పోటీపడుతున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి మరో 10 ఉత్పత్తులు, ఏపీ నుంచి ఇంకో 12 ఉత్పత్తులు జీఐ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తుకు రానున్నాయి.
ఈ మేరకు ఆయా చేనేత, హస్తకళల గుర్తింపు కోసం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ ఉత్పత్తులకు గుర్తింపు కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ విశ్వవిద్యాలయం, వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ కసరత్తు ప్రారంభించాయి. ఇప్పటికే తెలంగాణలో 17 ఉత్పత్తులకు జీఐ గుర్తింపు లభించగా ఏపీలో 19 ఉత్పత్తులకు జీఐ హోదా లభించింది. తాజా ప్రతిపాదనలకు కూడా జీఐ ట్యాగ్ లభిస్తే తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 58 ఉత్పత్తులకు ఆ ఘనత లభించినట్లు అవుతుంది.
తెలంగాణ నుంచి జీఐ దరఖాస్తులివీ..
హైదరాబాద్ ముత్యాలు, ఆర్మూర్ పసుపు, నారాయణపేట ఆభరణాల తయారీ కళ, మెదక్‌కు చెందిన బాటిక్ పెయింటింగ్, నల్లగొండలోని బంజారా కుట్లు–అల్లికలు, బంజారా గిరిజన ఆభరణాలు, బాలానగర్ సీతాఫలం, నల్లగొండ దోసకాయ (ఓరియెంటల్ పిక్లింగ్ మెలన్), అనబ్–ఈ–షాహీ ద్రాక్ష, ఖమ్మం మిర్చి.
ఏపీ నుంచి జీఐ దరఖాస్తులివీ..
తిరుపతిలోని మాధవమాల హస్తకళా శిల్పాలు, జమ్మలమడుగులోని డూపియన్ సిల్‌్క, వైఎస్సార్ కడపలోని మాధవరం కాటన్ అండ్ సిల్క్ చీరలు, పోలవరం చీరలు, బొబ్బిలి చీరలు, కడపగుంట తెల్లజిల్లేడు చెక్క విగ్రహాలు, పాలమ్నేరు టెర్రకోట, సుగంధాల అరటి, మైదుకూరు పసుపు, పోలూరు వంకాయ, దుర్గాడ మిర్చి, కాకినాడ గులాబీ.
జీఐ గుర్తింపు ఎందుకు?
మన సంప్రదాయాన్ని, ఆర్థికాభివృద్ధిని ప్రపంచానికి చాటిచెప్పే సాధనమే జీఐ. దీనివల్ల నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాలకు చెందిన ప్రత్యేక ఉత్పత్తులను గుర్తించి పరిరక్షించడం వీలవుతుంది. ప్రస్తుతం దేశంలో 1,408 ఉత్పత్తులు జీఐ గుర్తింపు కోసం దరఖాస్తు చేయగా వాటిలో 658 ఉత్పత్తులు జీఐ గుర్తింపు పొందాయి.
చట్టపరమైన రక్షణ..
భౌగోళిక గుర్తింపు వల్ల ఆయా ఉత్పత్తులకు చట్టపరమైన రక్షణ లభిస్తుంది. అలాగే వాటికి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లలో డిమాండ్ ఏర్పడుతుంది. ఫలితంగా ఉత్పత్తుల ఎగుమతితో ఉత్పత్తిదారులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది.
జీఐ ఉత్పత్తులకు ఉండాల్సిన అర్హతలు ఇవే..
⇒ ఆయా ఉత్పత్తి తప్పనిసరిగా స్థానిక భౌగోళిక ప్రాంతానికి చెందినదై ఉండాలి
⇒ భౌగోళిక స్థానంతో కొంత అనుసంధానమై ఉండాలి
⇒ స్థానికంగా, జాతీయంగా లేదా ప్రపంచ స్థాయిలో ఖ్యాతిని కలిగి ఉండాలి
⇒ ఆయా ఉత్పత్తులకు చారిత్రక ఆధారాలు, ఉనికి కలిగి ఉండాలి
⇒ ఇతర ఉత్పత్తులతో కొంత ప్రత్యేకత కలిగి ఉండాలి
⇒ స్థానిక సంఘం ద్వారా తయారై లేదా ఉత్పత్తి అయి ఉండాలి
జీఐ గుర్తింపుతో వారసత్వ పరిరక్షణ
సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ మన వారసత్వం, విలువలు, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసేవి సాంస్కృతిక, హస్త, చేనేత కళలే. జీఐ గుర్తింపుతో ఉత్పత్తుల వారసత్వ పరిరక్షణతో పాటు ప్రపంచ దేశాలలో వ్యాపార డిమాండ్‌కు అవకాశం ఏర్పడుతుంది. – సుభాజిత్ సాహా, జీఐ ప్రాక్టీషనర్
Comments
Please login to add a commentAdd a comment