అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు
సంక్రాంతి నుంచి కొత్త దరఖాస్తుల స్వీకరణ
ప్రజాపాలన దరఖాస్తులతో పాటు కొత్త దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: పేద ప్రజల ఆహార భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్‌కార్డుల ద్వారా రాయితీపై బియ్యం, ఇతర వస్తువులు అందిస్తున్నాయి. గత ప్రభుత్వం రేషన్‌కార్డుల జారీపై దృష్టి సారించకపోవడంతో దరఖాస్తుదారులు ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు.
ఆరేళ్లుగా కార్డుల జారీ నిలిపివేత
నగర శివార్లలో ఆరేళ్లుగా పౌరసరఫరాల శాఖ అధికారులు రేషన్ కార్డుల జారీ ప్రక్రియను నిలిపివేశారు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు వేలల్లో ఉన్నారు. కార్డుల్లో మార్పు చేర్పులకు దరఖాస్తు చేసుకున్న వారు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. 2018లో కేవలం ఒకసారి మాత్రమే కొన్ని కార్డులను జారీచేసి పలు కారణాలతో నిలిపివేశారు. పదేళ్లుగా కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్న వారు, కార్డుల్లో పిల్లల పేర్లు నమోదు చేయాల్సిన వారంతా మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు.
లబ్ధిదారుల్లో అయోమయం
రేషన్ కార్డుల జారీ కాకపోవడంతో రేషన్‌కార్డుతో పాటు వచ్చే ఆరోగ్యశ్రీ సేవలను పొందలేకపోతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డులను ముడిపెట్టడంతో కార్డులు లేని వారిలో అయోమయం నెలకొంది. ఇళ్ల మంజూరు, పెన్షన్లు, ఇతర ప్రభుత్వ పథకాలకు రేషన్‌కార్డులను ప్రామాణికంగా తీసుకోవడంతో కార్డులు లేని వారు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వ ప్రకటనతో హర్షం
కొత్తగా వివాహాలు చేసుకున్న వారికి అర్హత ఉన్నా.. రేషన్‌కార్డులు లేకపోవడంతో ఆహార భద్రతా పథకంతో పాటు పలు పథకాలకు దూరమవుతున్నారు. తాజాగా ప్రభుత్వ ప్రకటనతో దరఖాస్తుదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
⇒ మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ప్రస్తుతం 10,82,348 రేషన్ కార్డులు ఉండగా, 35,40,883 మంది లబ్ధిదారులుగా ఉన్నారు. ఇందులో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 5,32,938 రేషన్‌కార్డులు ఉండగా.. 17,18,351 మంది లబి్ధదారులు ఉన్నారు. ఏళ్లుగా రేషన్ కార్డులు అందకపోవడంతో కొంతమంది అర్హులు ప్రభుత్వ పథకాలకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రజాపాలనలో..
ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది. నగర శివారు 3.89 లక్షల దరఖాస్తులు పౌరసరఫరాలశాఖ అధికారులకు చేరాయి. తాజాగా సంక్రాంతి నుంచి కొత్త కార్డులను జారీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో మరోసారి స్వీకరించే అవకాశాలున్నాయి. ఈ ప్రక్రియ కోసం అవసరమైన మార్గదర్శకాలు జనవరి మొదటి వారానికి కొలిక్కి రానున్నాయి.
ఆదేశాలు రాగానే....
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే కొత్తరేషన్ కార్డుల జారీకి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికార వర్గాలు ప్రకటించాయి. ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందుకు సాగుతామని అధికారులు చెబుతున్నారు.
రేషన్‌కార్డులు ప్రామాణికం
ఉచిత బియ్యంతో పాటు ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసి, ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి నుంచి కొత్త రేషన్‌కార్డులను జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వాటి కోసం.. దరఖాస్తు చేసుకున్న వారిలో ఆశలు చిగురిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment