
సాక్షి, హైదరాబాద్: ‘‘గల్లీలో హోదాను మరిచి తిట్లు.. ఢిల్లీలో చిట్ చాట్లు’’ అంటూ సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాలు గడప దాటదు కానీ.. ఢిల్లీలో మాటలు కోటలు దాటుతున్నాయి అంటూ ట్వీట్ చేశారు. నీళ్లు లేక పంటలు ఎండి- పొలాలు బీడువారి అన్నదాతలు అరిగోస పడుతుంటే.. కనీసం సాగునీళ్లపై సమీక్ష లేకుండా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావ్ అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ నిలదీశారు.
‘‘39 సార్లు ఢిల్లీ పోయి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకునుడు తప్ప.. ఢిల్లీ నుంచి సాధించిన పని.. తెచ్చిన రూపాయి లేదు. రాహుల్ గాంధీతో నీ సంబంధాల గురించి తెలంగాణకు ఏం అవసరం.. మీ మధ్య సంబంధం ఉంటే మాకేంటి-ఊడితే మాకేంటి.. తెలంగాణకు ఒరిగేది ఏంటి?. గ్రామ గ్రామాన, గల్లీ గల్లీల్లో మీకు ఓటేసి మోసపోయాం అని జనం చివాట్లు పెడుతుంటే-చీమకుట్టినట్టు కూడా లేని నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావ్.. మొహం బాగోలేక అద్దం పగలగొట్టినట్లు.. ఆడ లేక పాతగజ్జెలు అన్నట్లు. హామీల అమలు చేతగాక గాలి మాటలు.. గబ్బు కూతలు.’’ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు.
గల్లీలో హోదాను మరిచి తిట్లు - ఢిల్లీలో చిట్ చాట్లు.
కాలు గడప దాటదు కానీ .. ఢిల్లీలో మాటలు కోటలు దాటుతున్నాయి.
నీళ్లు లేక పంటలు ఎండి- పొలాలు బీడువారి అన్నదాతలు అరిగోస పడుతుంటే .. కనీసం సాగునీళ్లపై సమీక్ష లేకుండా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావ్.
39 సార్లు ఢిల్లీ పోయి మీడియా…— KTR (@KTRBRS) March 14, 2025
మరో ట్వీట్‌లో ‘‘బీజేపీ నేతలతో కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డి రహస్య సమావేశాలా.. సిగ్గు.. సిగ్గు..!. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అధికారిక సమావేశాలు నిర్వహించాలి కానీ ఈ చీకటి మీటింగులు పెట్టడమేంటి?’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఇలాంటి దిక్కుమాలిన చిల్లర రాజకీయం తెలంగాణ నేలపై ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఓ వైపు బయటకు బీజేపీ నేతలతో కుస్తీపడుతున్నట్టు ఫోజులు కొట్టి, దొంగచాటుగా దోస్తీ చేసే ఈ నీచ సంస్కృతికి తెరలేపడం అత్యంత దుర్మార్గం. ఏం గూడుపుఠాణి చేయడానికి ఈ తెరచాటు సమావేశాలు నిర్వహిస్తున్నారో ముఖ్యమంత్రికి దమ్ముంటే బయటపెట్టాలి’’ అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు.
‘‘పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, గురుకులాల్లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా ఒక్క సమీక్ష నిర్వహించే సమయం లేని సీఎంకు, ఈ రహస్య సమావేశాలకు మాత్రం టైమ్ దొరకడం క్షమించలేని ద్రోహం. కాంగ్రెస్‌లో బీజేపీ కోవర్టులున్నారని రంకెలు వేసే రాహుల్ గాంధీకి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో దొరికిపోయిన రేవంత్ రెడ్డిపై చర్య తీసుకునే ధైర్యం ఉన్నదా?. అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రిగా ముద్రపడి, ఇక ఏ క్షణంలోనైనా తన సీఎం కుర్చీ చేజారే సూచనలు కనిపించడం వల్లే చీప్ మినిస్టర్ బీజేపీతో ఈ చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. ఏడాదిన్నరలోనే రాష్ట్రాన్ని ఆగంచేసి, డర్టీ పాలిటిక్స్ చేస్తున్న ఈ రాబందు రాజకీయాలను తెలంగాణ సమాజం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించదు. రెండు ఢిల్లీ పార్టీలకు కర్రుగాల్చి వాతపెడ్తది’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment