ఇంకెన్నిసార్లు అప్లై చేయాలి?.. ‘ప్రజాపాలన’పై హరీశ్‌రావు ఫైర్‌ | Harishrao Comments On Praja Palana Applications In Telangana | Sakshi
Sakshi News home page

ఇంకెన్నిసార్లు అప్లై చేయాలి?.. ‘ప్రజాపాలన’పై హరీశ్‌రావు ఫైర్‌

Published Wed, Jan 22 2025 12:42 PM | Last Updated on Wed, Jan 22 2025 1:38 PM

Harishrao Comments On Praja Palana Applications In Telangana

సాక్షి,సిద్దిపేట: పథకాల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం(జనవరి22) సిద్దిపేటలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. 

సంక్షేమ పథకాలకు ఎన్నో షరతులు పెడుతున్నారన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా రైతులకు పూర్తి రుణమాఫీ చెయ్యకుండా ఎగ్గొట్టారని విమర్శించారు. పథకాల కోసం ప్రజాపాలనలో ఇంకా ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకోవాలని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘సంక్షేమ పథకాలకు ఏడాది కిందట దరఖాస్తు ఇస్తే ఇప్పటికీ దిక్కు లేదు, మళ్ళీ ఎన్నిసార్లు దరఖాస్తులు ఇవ్వాలి. దరఖాస్తుల పేరుతో డబ్బులు వృథా అవుతున్నాయి. దరఖాస్తులతోనే ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. అబద్దాల పునాదులపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పాలనలో కూడా అబద్దాల పరంపర కొనసాగిస్తోంది. అప్పుడు అందరికీ పరమాన్నం పెడతామన్నారు. ఇప్పుడు అందరికీ పంగ నామాలు పెడుతున్నారు. 

రుణమాఫీ అయిందని రేవంత్‌రెడ్డి హైదారాబాద్ లో చెప్తున్నాడు దమ్ముంటే ఇక్కడికి రా చూపెడత ఎంతమందికి కాలేదనేది. వడ్డీతో సహా రెండు లక్షల రుణమాఫి చేస్తానని ఇప్పుడు మిత్తీ కట్టించుకుని పాక్షిక రుణమాఫి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలు, అబద్ధాలు. దమ్ముంటే రేవంత్ రెడ్డి గ్రామ సభలకు రావాలి నేను కూడా వస్తా. పోలీసులను పెట్టి నిర్బంధాల మధ్య గ్రామ సభ నడిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి డమ్మీ రుణమాఫీ చెక్ ఇచ్చావు. రెండు నెలలు అయినా రేవంత్ రెడ్డి ఇచ్చిన చెక్ పాస్ కాలేదు. 

ఈ ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు. ఈ ప్రభుత్వానికి మోసాలు తప్ప, నీతి నిజాయితీ లేదు. రుణమాఫీపై వైట్ పెపర్ రిలీజ్ చేయాలి. ఎప్పటి లోగా చేస్తారో ఎన్ని చేయాలో చెప్పాలి. రాష్ట్రంలో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు. వానాకాలం రైతు బంధు ఎప్పుడు వేస్తారో చెప్పాలి. ఇచ్చిన మాట ప్రకారం 15వేల రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. ద్రవ్యోల్బణం పెరిగినందున రేషన్ కార్డు ఇన్‌కం లిమిట్ పెంచాలి.

కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే తిరుబాటు తప్పదు. అర్హులకు ఇళ్లు ఇవ్వాలి. గ్రామ సభలలో కాంగ్రెస్ ఎంఎల్ఏ ఉన్న చోట ఎమ్మెల్యే ఫొటో పెడుతున్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉన్నచోట  ఫోటోలు పెట్టడం లేదు. ప్రోటోకాల్ పాటించడం లేదు. రేవంత్ రెడ్డి ఏడాదిలోనే ఎంతో వ్యతిరేకత మూటగట్టుకున్నారు’అని హరీశ్‌రావు విమర్శించారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement